మరిన్ని క్రీడా వార్తలు..

by Shyam |   ( Updated:2021-05-28 12:07:13.0  )
మరిన్ని క్రీడా వార్తలు..
X

– దుబాయ్‌లో జరుగుతున్న ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌ సెమీస్‌లో భారత బాక్సర్ సాక్షి చౌదరి (54 కేజీలు) విజయం సాధించి ఫైనల్ చేరినట్లు మ్యాచ్ రిఫరీ ప్రకటించారు. కజకిస్తాన్‌కు చెందిన దినా జోలామన్‌పై గెలుపొందినట్లు ప్రకటించారు. అయితే కజకిస్తాన్ బాక్సింగ్ జట్టు బౌట్ రివ్యూ కోరింది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆమె కోరిన బౌట్ రివ్యూను పరిశీలించి విజయం సాధించినట్లు ప్రకటించారు. దీంతో సాక్షి చౌదరి బదులు దినా జోలామన్ ఫైనల్ చేరుకున్నది.

– భారత బాక్సర్ అమిత్ పంగల్ (52 కేజీలు) ఏసియన్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్స్‌కు చేరుకున్నాడు. శుక్రవారం కజకిస్తాన్‌కు చెందిన సాకెన్ బిబోస్సినోవ్‌తో జరిగిన సెమీస్లో 5-0 తేడాతో విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు. వరల్డ్ చాంపియన్‌షిప్ సెమీస్‌లో కూడా సాకెన్ బిబోస్సినోవ్‌ను అమిత్ పంగల్ ఓడించడం విశేషం. ఈ విజయంతో అమిత్ ఒక పతకాన్ని ఖరారు చేసుకున్నాడు.

– హాంకాంగ్‌కు చెందిన త్సాంగ్ ఇన్-హంగ్ (45) ఎవెరెస్టు శిఖరాన్ని 26 గంటల్లో ఎక్కి రికార్డు సృష్టించింది. బేస్ క్యాంపు నుంచి శిఖరాగ్రాన్ని అతి తక్కువ సమయంలో ఎక్కిన మహిళగా ఆమె రికార్డు సృష్టించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు అమెరికాకు చెందిన ఆర్థర్ ముయిర్ (75) ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అత్యధిక వయస్కుడిగా రికార్డు సృష్టించాడు.

– జపాన్‌లోని టోక్యో నగరంలో కోవిడ్ కేసులు పెరిగిపోతుండటంతో ఎమర్జెన్సీని జూన్ 20 వరకు పొడిగించారు. గతంలో విధించిన ఎమర్జెన్సీ మే 31తో ముగియనుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒలింపిక్స్‌కు మరో ఏడు వారాలే గడువు ఉన్న సమయంలో ప్రభుత్వం ఎమర్జెన్సీని పొడిగించడంతో క్రీడల నిర్వహణపై అనుమానాలు నెలకొన్నాయి.

– ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లకు ఇంగ్లాండ్ క్రికెటర్లు అందుబాటులో లేకపోయినా మేము పెద్దగా ఆందోళన చెందడం లేదని సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ వ్యాఖ్యానించారు. మేము ఇద్దరు కీలక ఆటగాళ్లను మిస్ అవుతాము. కానీ ఈసీబీ వాళ్లను విడుదల చేయకపోతే మేం చేసేది ఏమీ ఉండదని ఆయన అన్నారు. కాగా ఇంగ్లాండ్ ఆటగాళ్లు అందుబాటులో ఉండరనే విషయమం మాకు అధికారికంగా సమాచారం ఇవ్వలేదన్నారు.

– ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న టీమ్ ఇండియా మహిళా క్రికెటర్ ప్రస్తుతం ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్‌లో కఠిన క్వారంటైన్‌లో ఉన్నారు. వీరికి గురువారం బీసీసీఐ కోవీషీల్డ్ వ్యాక్సినేషన్ క్యాంప్ ఏర్పాటు చేసింది. గతంలో వ్యాక్సిన్ వేయించుకున్న క్రికెటర్లు కాకుండా.. మిగిలిన అందరికీ వ్యాక్సిన్ తొలి డోసు అందించారు. రెండో డోసు ఇంగ్లాండ్ వెళ్లిన తర్వాత ఇవ్వనున్నట్లు బీసీసీఐ అధికారులు తెలిపారు.

– దిశ, స్పోర్ట్స్

Advertisement

Next Story