జాతీయ క్రీడా అవార్డుల నగదు పురస్కారం పెంపు?

by Shyam |   ( Updated:2020-08-20 10:40:20.0  )
జాతీయ క్రీడా అవార్డుల నగదు పురస్కారం పెంపు?
X

దిశ, స్పోర్ట్స్: జాతీయ క్రీడా అవార్డులతో పాటు అందించే నగదు పురస్కారాన్ని భారీగా పెంచేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్టు సమాచారం. ఏటా జాతీయ క్రీడా దినోత్సవం (ఆగస్టు 29)న ఇచ్చే అవార్డులతో క్రీడాకారులకు షీల్డుతో పాటు నగదు పురస్కారం అందిస్తారు. ఖేల్ రత్న, అర్జున అవార్డు, ధ్యాన్‌చంద్, ద్రోణాచార్య అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ప్రస్తుతం రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతకు రూ.7.5 లక్షలు, అర్జున, ధ్యాన్‌చంద్, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలకు రూ . 5లక్షల చొప్పున అందిస్తున్నారు.

అయితే, ఇకపై రాజీవ్ ఖేల్ రత్న అవార్డు గ్రహీతకు రూ.25 లక్షలు, అర్జున, ధ్యాన్ చంద్, ద్రోణాచార్య అవార్డు గ్రహీతలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాన్ని రూ.15లక్షలకు పెంచాలని భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం అవార్డులకు నామినేట్ అయినవారి తుది జాబితాపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు నిర్ణయం తీసుకోవల్సి ఉంది. వాటితోపాటే నగదు పురస్కారం పెంపునకు సంబంధించిన ఫైలుపైనా సంతకం చేస్తారని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story