సాగర్ స్పిల్‌ వే మరమ్మతులు చేపట్టరా?

by Shyam |
సాగర్ స్పిల్‌ వే మరమ్మతులు చేపట్టరా?
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: రెండు తెలుగు రాష్ర్టాల్లోని లక్షల ఎకరాలకు సారునీరు, వేల గ్రామాలకు తాగునీరు అందిస్తున్న ప్రాజెక్టు నాగార్జున సాగర్. ఇంతటి కీర్తి కలిగిన ప్రాజెక్టును పాలకులు పట్టించుకోవడం లేదు. నిర్వహణకు సరిపడా నిధులు ఇవ్వకపోగా, ప్రాజెక్టు స్పిల్ వే మరమ్మతులను సైతం చేపట్టడం లేదు. స్పిల్ వే దెబ్బతిన్న ప్రాంతాలను ఐదేండ్ల క్రితమే ఇంజనీర్లు గుర్తించారు. కానీ, నేటికీ నిధులు మంజూరు కాలేదు. నిర్వహణ నిధులతో మరమ్మతులు చేపట్టాలని మొదటగా ఇంజినీర్లు భావించినా.. ఆ నిధులు సైతం సర్కారు అరకొరగా విడుదల చేస్తుండటంతో పనులు చేపట్టలేకపోయారు. పెద్ద ఎత్తున వరదలొస్తే ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

లక్షలాది ఎకరాల భూములకు సాగు నీరందించే నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్ వే 9 ఏండ్లుగా మరమ్మతులకు నోచుకోవడం లేదు. అందుకు సంబంధించిన పనుల ప్రతిపాదనలు అంచనాలకు మాత్రమే పరిమితమవుతున్నాయి. స్పిల్ వే దెబ్బతిన్న ప్రాంతాలను ఐదేండ్ల క్రితమే ఇంజనీర్లు గుర్తించారు. ప్రాజెక్టు మెయింటెనెన్స్ నిధులతో మరమ్మతులు చేయించాలని గతంలో ఇంజనీర్లు భావించారు. కానీ, మెయింటెనెన్స్ నిధులు సైతం ఐదేండ్లుగా నామమాత్రంగా విడుదల అవుతుండడంతో పనులు చేపట్టడం లేదు. మరమ్మతుకు రూ.కోట్లలో ఖర్చు అవుతుండడంతో అధికారులు సైతం ఆ ఆలోచనకు స్వస్తి పలికారు. రిపేర్లకు కావాల్సిన నిధులను అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదు.

నీరు తక్కువగా ఉన్నప్పుడే..

జలాశయంలో 546 అడుగులకు నీరు తగ్గినప్పుడే స్పిల్ వే మరమ్మతులు చేపట్టేందుకు వీలవుతుంది. ఏడేండ్లుగా జలాశయంలో నీరు తక్కువగా ఉండటంతో పనులు చేసేందుకు అనుకూల పరిస్థితులు నెలకొన్నాయి. కానీ సాగునీటి శాఖ అధికారులు అవేం పట్టించుకోలేదు. ప్రతిపాదనలు పంపాం.. ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే టెండర్లు పిలుస్తాం.. అన్న చందంగా వ్యవహరిస్తున్నారు.

వరదలు వస్తే…

నాగార్జున‌సాగర్ నిర్మాణం చేపట్టి సుమారు 64 ఏండ్లు అవుతోంది. మరమ్మతులు చేస్తే మరో వందేండ్లయినా నిర్మాణం చెక్కు చెదరకుండా ఉంటుంది. కానీ ఏండ్ల తరబడిగా స్పిల్ వే మరమ్మతులు చేపట్టడం లేదు. గతంలో మాదిరిగా పెద్ద ఎత్తున వరదలు వస్తే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదముంది. కొత్త ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు ఉన్న ప్రాజెక్టులు మరింత కాలం మన్నికగా ఉండేలా చర్యలు చేపట్టాలని పలువురు రైతులు అభిప్రాయ పడుతున్నారు. సరైన సమయంలో మరమ్మతులు చేయకపోతే ఉపద్రవాలు ఏర్పడే ప్రమాదం ఉందని ఇంజినీర్లు సైతం హెచ్చరిస్తున్నారు.

మరమ్మతులతోనే భద్రత..

గతంలో స్పిల్ వే దెబ్బతిన్నప్పుడు రెయి న్ ఫోర్స్డ్ కాంక్రీట్‌ను భూంపంప్ సహకారంతో ఆ రంధ్రాల్లోకి పంపారు. జాతీయ నిర్మాణ సంస్థ(ఎన్ఏసీ) సూచ న లు, కాంక్రీట్ మిక్స్‌డ్ డిజైన్ ప్రకారం ఎం60 గ్రేడ్ సిలికాప్యూమ్, స్టీల్ వైర్ ఫైబర్‌ను చేర్చారు. ఒక క్యూబిక్ మీటరు పరిధిలో ఉన్న గుంతలను పూడ్చడానికి స్టీల్ వైర్ ఫైబర్‌ను 40 కిలోలు వాడారు. ఇప్పుడు సైతం గుంతలు పడిన చోట ఇలా మరమ్మతులు చేస్తేనే డ్యామ్‌కు భద్రత ఉంటుంది. డ్యామ్ రేడియల్ క్రస్ట్ గేట్ల పైనుంచి నీరు స్పిల్ వే మీదుగా బలంగా కిందికి జారుతుంది. వీటికి మాములుగా సిమెంట్ కాంక్రీట్ పను లు చేస్తే నీటి ఒత్తిడికి వెంటనే పెచ్చలు ఊడే ప్రమాదముందని ఇంజినీర్లు అంటున్నారు.

Advertisement

Next Story