ఐపీఎల్‌ చుట్టూనే వినోదం.. వివాదం!

by Mahesh |   ( Updated:2025-03-22 06:44:48.0  )
ఐపీఎల్‌ చుట్టూనే వినోదం.. వివాదం!
X

ఐపీఎల్ ముందు పుట్టిందా? లేదంటే వివాదాలు ముందు పుట్టాయా? అంటే చెప్పడం కష్టం. ఇవి రెండూ కవల పిల్లల లాగే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 2008లో ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి వినోదం కంటే ఎక్కువగా ప్రతి ఏటా వివాదాలు వరుసగా చుట్టుముడుతూనే ఉన్నాయి. కానీ.. ఏనాడు ఐపీఎల్ ఇమేజ్ తగ్గలేదు. పైగా ఇలాంటి వివాదాలే ఐపీఎల్‌ పాపులర్ కావడానికి మరింతగా దోహదం చేశాయి. అసలు ఐపీఎల్ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది. అయినా సరే ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్నమైన, అత్యంత ప్రేక్షకాదరణ పొందిన క్రికెట్ లీగ్‌గా ఐపీఎల్ ఒక చరిత్ర సృష్టిస్తోంది.

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మొట్టమొదటి వేలం 2008 జనవరి 24న జరిగింది. ఇక ఐపీఎల్ తొలి సీజన్ మొదటి మ్యాచ్ 2008 ఏప్రిల్ 18న జరిగింది. ఆ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ విజేతగా నిలిచింది. అయితే అదే ఏడాది నవంబర్‌లో ముంబైపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. దీంతో భారత ప్రభుత్వం పాకిస్తాన్‌తో అన్ని రకాల దౌత్య సంబంధాలను తెంచుకుంది. దాంతో పాటు క్రీడా సంబంధిత బంధాలను కూడా తెంచుకుంది. అప్పటికే ఐపీఎల్ తొలి సీజన్ ముగిసింది. దాంట్లో అనేక మంది పాకిస్తాన్ క్రికెటర్లు పలు ఫ్రాంచైజీలలో ఆడుతున్నా.. వారందరినీ తర్వాత సీజన్ నుంచి ఆడబోనివ్వడం లేదని అప్పటి ఐపీఎల్ కమిషనర్ లలిత్ మోడీ ప్రకటించారు. పాకిస్తాన్‌లో జన్మించిన ఇమ్రాన్ తాహిర్‌కు దక్షిణాఫ్రికా పౌరసత్వం ఉండటంతో అతను కొన్నాళ్లు ఐపీఎల్‌లో ఆడాడు.

మొదటి వేటు లలిత్ మోడీపైనే..

ఐపీఎల్ రూపకర్త లలిత్ మోడీపైనే మొదటి వేటు పడింది. లలిత్ మోడీని లీగ్ చైర్మన్, కమిషనర్ పదవుల నుంచి బీసీసీఐ సస్పెండ్ చేసింది. బీసీసీఐ చరిత్రలో ఇది అత్యంత సంచలన నిర్ణయం. అధికార దుర్వినియోగం, ఆర్థిక నేరాలు తదితర ఆరోపణలతో ఐపీఎల్-2010లో ఫైనల్ మ్యాచ్ ముగిసిన రెండో రోజే అతనిపై బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. లీగ్ మధ్యలోనే లలిత్ మోడీని సస్పెండ్ చేస్తే అది ఐపీఎల్ మ్యాచ్‌లపై ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో ఆ సీజన్ ముగిసిన తర్వాత బీసీసీఐ అతడిని సస్పెండ్ చేసింది. అయితే లలిత్ మోడీపై నమోదైన ఆరోపణలు నిజమని తేలడంతో 2013లో అతనిపై జీవిత కాలం బ్యాన్ విధించారు. అయితే అప్పటికే లలిత్ మోడీ దేశం వదిలి లండన్ వెళ్లిపోయాడు.

చీర్ లీడర్స్.. లైంగిక ఆరోపణలు

ఐపీఎల్ మొదలైన కొత్తలో అందరినీ ఆకర్షించిన వాళ్లు చీర్ లీడర్స్. చిట్టి పొట్టి బట్టలతో బౌండరీ లైన్ల వద్ద ఫోర్లు, సిక్సులు కొట్టినప్పుడు... ఎదుటి జట్టు వికెట్ పడినప్పుడు ఆనందోత్సాహాలతో నృత్యాలు చేసేవారు. అయితే ఇలాంటి చీర్ లీడర్స్‌ను ఎలా చులకనగా చూస్తారో అప్పట్లో ముంబై ఇండియన్స్ చీర్ లీడర్‌గా ఉన్న గాబ్రియేలా తన బ్లాగ్‌లో రాసుకుంది. తమ నుంచి చాలా ఆశిస్తారని, పలువురు దక్షిణాఫ్రికా క్రికెటర్లు తమను లైంగికంగా లోబరుచుకోవడానికి ప్రయత్నించారని ఐదేళ్ల కింద ఆరోపించింది. అయితే ఐపీఎల్‌లో అత్యంత పాపులర్ జట్టు అయిన ముంబై ఇండియన్స్‌పై ఆరోపణలు చేయడంతో ఆ జట్టు యజమాని నీతా అంబానీ రంగంలోకి దిగారు. ఆ సమస్య పరిష్కారం అయినట్లు ఆమె మీడియాకు వెల్లడించారు. అయితే ఆ తర్వాత గాబ్రియేలాను చీర్ లీడర్స్ జట్టు నుంచి తప్పించడం పలు అనుమానాలకు తావిచ్చింది. మరోవైపు చీర్ లీడర్స్ కారణంగా వివాదాలు ముదురుతుండటంతో బీసీసీఐ ఏకంగా వారి కోసం కొన్ని నిబంధనలు అమలు చేసింది. అప్పటి నుంచి చీర్ లీడర్స్ కూడా పొట్టి దుస్తుల్లో కనిపించడం మానేశారు.

క్రికెటర్ల మధ్య గొడవ

ఐపీఎల్ తొలి సీజన్‌లో శ్రీశాంత్, హర్భజన్ సింగ్ మధ్య గొడవ సంచలనంగా మారింది. అప్పట్లో పంజాబ్ తరపున ఆడుతున్న శ్రీశాంత్‌ను ముంబై ఇండియన్స్ తాత్కాలిక కెప్టెన్ హర్భజన్ చెంపపై కొట్టడం 'స్లాప్ గేట్'గా బహుళ ప్రచారం పొందింది. కెమెరాల ఎదుట తనను హర్భజన్ కొట్టినట్లు శ్రీశాంత్ వెల్లడిస్తూ భోరున విలపించడం వైరల్ అయ్యింది. అప్పటి పంజాబ్ జట్టు ఓనర్ ప్రీతీ జింటా ఈ విషయంలో శ్రీశాంత్‌ను ఓదార్చిన ఫొటోలు విస్తృతంగా మీడియాలో ప్రచారం జరిగాయి. అయితే ఈ అంశంపై బీసీసీఐ ఒక విచారణ కమిటీని వేయగా.. భజ్జీదే తప్పని తేలింది. దీంతో హర్భజన్‌ను ఆ సీజన్ మొత్తానికి బ్యాన్ చేశారు. అంతే కాకుండా ఐదు అంతర్జాతీయ వన్డేల బ్యాన్ కూడా విధించారు. అయితే ఆ తర్వాత చాలా ఏళ్ల తర్వాత శ్రీశాంత్‌కు హర్భజన్ సారీ చెప్పాడు. కానీ అప్పటికే శ్రీశాంత్ మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఐపీఎల్ నుంచి శాశ్వతంగా నిషేధించబడ్డాడు.

స్పాట్ ఫిక్సింగ్

ఐపీఎల్ 2013లో స్పాట్ ఫిక్సింగ్ ఒక మచ్చలా మారింది. అప్పట్లో రాజస్థాన్ జట్టుకు చెందిన శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లు స్పాట్ ఫిక్సింగ్‌ కోసం బుకీల నుంచి డబ్బులు తీసుకున్నట్లు తేలింది. దీంతో ఈ ముగ్గురినీ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఐపీఎల్‌తో పాటు క్రికెట్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరో వైపు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్.శ్రీనివాసన్ మేనల్లుడు గురునాథ్ మునియప్పన్, విందు ధారాసింగ్‌లతో కలిసి బెట్టింగ్‌లకు పాల్పడి నట్లు.. బుకీలతో సంబంధాలు ఉన్నట్లు అప్పట్లోనే ముంబై పోలీసులు గుర్తించారు. వారిని అరెస్టు చేయడంతో బీసీసీఐ కూడా ఈ అంశంలో చాలా సీరియస్ నిర్ణయాలు తీసుకుంది. స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెటర్లపై జీవిత కాల నిషేధం.. ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన రాజస్థాన్, చెన్నై జట్లపై రెండేళ్ల పాటు నిషేధం అమలు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

నిబంధనలకు నీళ్లొదిన కోహ్లీ

స్పాట్ ఫిక్సింగ్ వ్యహారం తర్వాత బీసీసీఐ ఆటగాళ్ల కోసం అనేక మార్గదర్శకాలను రూపొందించింది. మ్యాచ్ జరిగే సమయంలో బయటి వ్యక్తులతో మాట్లాడటంపై అప్పట్లో నిషేధం విధించింది. కానీ అప్పట్లో ఆర్సీబీ కెప్టెన్‌గా ఉన్న విరాట్ కోహ్లీ.. నిబంధనలను ఉల్లంఘించాడు. డ్రెసింగ్ రూమ్‌ను వదిలి తన ప్రేయసి (అప్పటికి పెళ్లి కాలేదు) అనుష్క శర్మతో ముచ్చటిస్తూ కనపడ్డాడు. ఈ దృశ్యాలు కెమేరాల్లో రికార్డు కావడం, కోహ్లీ పై విమర్శలు రావడంతో బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్ తీవ్రంగా పరిగణించింది. ఒక జట్టుకు కెప్టెన్‌గా ఉంటూ నిబంధనలు ఉల్లంఘించడంపై విచారణ చేపట్టింది. అయితే ఆ తర్వాత బీసీసీఐ ఆ విచారణను పక్కన పెట్టింది.

ఆటగాడు వర్సెస్ కామెంటేటర్

ఐపీఎల్-2017 లో ఎన్నడూ లేని విధంగా ఆటగాళ్లకు, కామెంటేటర్లకు మధ్య విభేదాలు తలెత్తాయి. ముఖ్యంగా ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కిరాన్ పొలార్డ్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మధ్య వివాదం చెలరేగింది. కిరాన్ పొలార్డ్‌ను ఉద్దేశించి.. అతను తెలివి తక్కువ మనిషి అంటూ మంజ్రేకర్ కామెంట్ చేయడం తీవ్ర దుమారాన్ని లేపింది. దీనిపై పొలార్డ్ అభ్యంతరాన్ని వ్యక్తం చేశాడు. సంజయ్ మంజ్రేకర్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పెద్ద పోస్టే పెట్టాడు. అయితే సంజయ్ నిజంగా ఆ మాట అన్నాడా? లేదంటే ఇదంతా మీడియా సృష్టా? అనే విషయాన్ని మాత్రం పొలార్డ్ నిరూపించలేక పోయాడు. అయినా సరే పొలార్డ్ మాత్రం ఈ అంశంలో వెనక్కు తగ్గలేదు. ఆ సీజన్ ఆమాంతం వీరిద్దరి మధ్య ఈ వివాదంపై మాటల యుద్ధం కొనసాగింది. చివరకు బీసీసీఐ జోక్యం చేసుకొని ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చింది.

మన్కడింగ్

ఐపీఎల్‌లో మన్కడింగ్ పెద్ద వివాదంగా మారిది. అప్పట్లో పుణె జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న అశ్విన్.. రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జాస్ బట్లర్‌ను మన్కడింగ్ చేయడం పెద్ద వివాదానికి దారి తీసింది. బంతి వేయక ముందే క్రీజ్ దాటిన బ్యాటర్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ ఆ సీజన్ అంతా పెద్ద అంశాన్ని చర్చకు తెచ్చాడు. ఇది క్రీడా స్పూర్తికి విరుద్దం అంటూ అశ్విన్‌ను పలువురు విమర్శించారు. అయితే తాను ఐసీసీ నిబంధనల మేరకే బట్లర్‌ను అవుట్ చేశానని అశ్విన్ సమర్థించుకున్నాడు. ఈ మన్కడింగ్‌పై ఆ తర్వాత అంతర్జాతీయ మ్యాచ్‌లలో కూడా చర్చకు వచ్చింది.

లైంగిక ఆరోపణలు కూడా

ఐపీఎల్‌లో చీర్ లీడర్స్ లైంగిక ఆరోపణలే కాకుండా.. ఏకంగా జట్టు యజమానురాలు కూడా మీడియా ముందు తన బాధను వెల్లడించడం గమనార్హం. అప్పట్లో పంజాబ్ కింగ్స్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) యజమానులు గా ఉన్న ప్రీతీ జింటా, నెస్ వాడియాల వ్యవహారం టాక్ ఆఫ్ ది సీజన్‌గా మారింది. ఐపీఎల్-14లో వీరి మధ్య బంధమే చర్చనీయాంశంగా మారింది. నాలుగేళ్లపాటు డేటింగ్ చేసిన ఈ జంట 2009లో విడిపోయారు. అయితే ఆ తర్వాత కూడా నెస్ వాడియా తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ మీడియాకు ఎక్కడంతో బీసీసీఐ కూడా ఇరుకున పడింది. అప్పటికే స్పాట్ ఫిక్సింగ్ దెబ్బకు సుప్రీంకోర్టుతో చీవాట్లు తిన్న బీసీసీఐ.. ప్రీతి, వాడియా గొడవను రచ్చ చేయకుండా.. పెద్దలతో రాజీ కుదిర్చింది.

వాటర్, షారుఖ్ అండ్ హార్దిక్

ఇవే కాకుండా.. అనేక వివాదాలు ఐపీఎల్‌‌ను చుట్టుముట్టాయి. ఐపీఎల్ నిర్వహణపై గతంలో రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ పంట పొలాలకు నీళ్లు ఇవ్వకుండా.. ఐపీఎల్ స్టేడియంలకు మాత్రం వేలాది లీటర్ల నీటిని వాడుతున్నారంటూ ఆరోపించారు. తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్న సమయంలో పుణెలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహించడంపై మహారాష్ట్ర రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక కావేరి నీటి వివాదం సమయంలో చెన్నై, బెంగళూరులో మ్యాచ్‌లు జరగనివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. ఇక వాంఖడే స్టేడియంలో స్టార్ యాక్టర్ షారుక్ ఖాన్ చేసిన వివాదం పత్రికలకు ఎక్కింది. వాంఖెడేలో సెక్యూరిటీ సిబ్బందిపై దాడి చేయడం, నో స్మోకింగ్ జోన్‌లో సిగరెట్ కాల్చడం వంటి వివాదాల కారణంగా అతడిని వాంఖేడేకు రాకుండా ఐదేళ్ల పాటు నిషేధం విధించారు. మరో వైపు అదే వాంఖడేలో ముంబై జట్టు కెప్టెన్‌గా ఉన్న హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా అభిమానులు నినాదాలు చేయడం కూడా వివాదంగా మారింది. మొత్తంగా ఐపీఎల్‌లో ప్రతి ఏటా ఏదో ఒక వివాదం నెలకొంటూనే ఉంది.

Read More : నేటినుంచి వరల్డ్‌వైడ్ క్రికెట్ వార్..

కేకేఆర్, ఆర్సీబీ మధ్య తొలి ఫైట్..

ఐపీఎల్‌తో నెక్ట్స్ లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్

Next Story

Most Viewed