- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
టేస్టీ ఫుడ్ @ ‘మహిళా శక్తి’ క్యాంటీన్లు.. ఫుడ్ బిజినెస్‌లోకి మహిళా సంఘాలు

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. కానీ ఆ అవకాశాలు అందరి అందుబాటులో ఉండవు. మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి అందని ద్రాక్షే అని చెప్పొచ్చు. కానీ అలాంటి వారిలో నైపుణ్యాలను గుర్తించి, ఆర్థికంగా వారికి చేయూతనిచ్చేలా ప్రభుత్వం ప్రారంభించినదే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు(Indira Mahila Shakti canteens). వీటిద్వారా మహిళల జీవననానికి దగ్గరగా ఉండే ఫుడ్ బిజినెస్(Food business) అయితే బావుంటుంది అని భావించిన ప్రభుత్వం వారికి వంటలో మెలకువలు నేర్పించి మరీ సెర్ప్ (SERP) సహకారంతో క్యాంటీన్లు (canteens) ఏర్పాటు చేసుకునేలా వారికి ఆర్థికంగా తోడ్పాటు నిస్తూ అండగా నిలుస్తోంది. వారికి అందుతున్న శిక్షణ, క్యాంటీన్ల నిర్వహణపై ‘దిశ’ ప్రత్యేక కథనం. - స్వర్ణ మొలుగూరి
మహిళా సంఘాల ఏర్పాటు, నిర్వహణలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం తెలంగాణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్) మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థికంగా చేయూతనిచ్చే కార్యక్రమాలను విజయంతంగా పూర్తి చేస్తోంది. అందులో భాగంగానే ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. జాతీయస్థాయిలో పేరొందిన హోటల్స్, రెస్టారెంట్ వంటకాలకు దీటుగా ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లలో వంటలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి సెర్ప్ ఆధ్వర్యంలో ఇప్పటికే 190 మంది స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు శిక్షణ పూర్తి చేసుకోగా, మార్చి నెలాఖరు వరకు 300 మంది మహిళలు శిక్షణ పూర్తి చేసుకోనున్నారు. జాతీయ స్థాయి ప్రొఫెషనల్ షెఫ్‌లతో ఎన్ఐటీహెచ్ఎం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ శిక్షణను పదిరోజుల పాటు నిర్వహించింది. ఇందులో భాగంగా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన షెఫ్‌లు వంటకాలపై తరగతులు నిర్వహించారు. అందులో భాగంగా వెరైటీ రైస్ డిషెస్, రకరకాల టీలు, తెలంగాణ స్నాక్స్, స్వీట్లు, బేసిక్ గ్రేవీస్, బిర్యానీ వంటి వివిధ మెనూలపై వెుళకువలు నేర్పించారు. వంట చేసేటప్పుడు మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. పరిశుభ్రత, మెనూ ప్లానింగ్, ఆహార తయారీ, ప్లేటింగ్, సర్వింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.
ప్రభుత్వ తోడ్పాటు:
ఇందిరా క్యాంటీన్ల నిర్వహణ శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం మహిళలు తాము సొంతంగా వ్యాపారం చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగేలా ప్రభుత్వం తోడ్పాటు అందిస్తుంది. అందుకు ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, కళాశాలలు, మహిళా సమితి కార్యాలయాలు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్ల లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లకు సంబంధించి నిర్వహణ కోసం సోలార్ ప్లాంట్లను ప్రభుత్వం త్వరలోనే ప్రారంభించే ఏర్పాట్లు చేస్తున్నది. మార్చి చివరికల్లా 150 క్యాంటీన్లు ఏర్పాటు చేసేలా సెర్ప్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలుస్తున్నది. క్యాంటీన్ల నిర్వహణతో మహిళలను విజయవంతమైన వ్యవస్థాపకులుగా మారడానికి ప్రోత్సహించడంలో భాగంగా సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయనుంది. అంతేకాకుండా కొన్ని ప్రభుత్వ భవనాల్లో అద్దె లేకుండా స్థలం కేటాయించనుంది. వచ్చే నెలలో ఆయా జిల్లా కలెక్టర్ల ద్వారా క్యాంటీన్ స్థలం కేటాయింపు ఉంటున్న నేపథ్యంలో ఇప్పటికే సర్టిఫైడ్ ఐఎంఎస్ సర్టిఫికెట్ పొందిన మహిళలందరూ డీఆర్డీఓ లను కలిసి, వారంలోపు వారి జిల్లా కలెక్టర్‌తో ఫొటో తీసుకోవాలని సెర్ప్ అధికారులు సూచించారు. క్యాంటీన్ ఏర్పాటు మౌలిక సదుపాయాల కోసం సెర్ఫ్ ఆర్థిక సహాయం అందిస్తుంది. వంటసామగ్రి, వంటగది నిర్వహణ బాధ్యత మాత్రం క్యాంటీన్ నిర్వహించే మహిళలదే.
ఇందిరా మహిళా శక్తి
ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ శిక్షణ కార్యక్రమం పదిరోజుల షెడ్యూల్ పూర్తవుతుంది. హైదరాబాద్‌లో ఇచ్చే ఈ శిక్షణా కార్యక్రమంలో ఆయా జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంత మహిళలు చురుగ్గా పాల్గొంటుండడం విశేషం. అందులో శిక్షణ పొందిన మహిళలతో సెర్ప్ డీపీఎంలు, ఎన్ఐటీహెచ్ఎం శిక్షణ, ప్లేస్‌మెంట్ అధికారులు, సీనియర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ మిచెల్ జె. ఫ్రాన్సిస్‌లు వారి అనుభవాలను అడిగి తెలుసుకుంటారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణ శిక్షణ ద్వారా అనేక మంది మహిళలు విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా మారేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమం పట్ల మహిళలు హర్షం వ్యక్తం చేయడమే కాకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఫుడ్ వ్యాపారంలో మరింత పురోగతి సాధించేలా కృషి చేస్తామని చెప్తున్నారు.
క్యాంటీన్ ఎలా ప్రారంభించాలి
ఒక క్యాంటీన్ ప్రారంభించాలంటే రూ. 5లక్షలు నుంచి రూ.10 లక్షల దాకా ఖర్చవుతుంది. ఈ డబ్బును బ్యాంకు ద్వారా రుణం రూపంలో పొందేలా ప్రభుత్వం ప్లాన్ చేసింది. ఈ బుణాన్ని స్యయం సహాయక సంఘాల్లోని మహిళలు నెల నెలా సులభవాయిదాల్లో చెల్లించాలి. క్యాంటిన్ ఏర్పాటు చేయాలనుకునే మహిళలు జిల్లా గ్రామీణాభివ్రుద్ది శాఖలోని జిల్లా ప్రాజెక్టు మేనేజర్(డీపీఎం)ను సంప్రదించాలి. క్యాంటిన్ ప్రారంభించాక దానిని లాభాల్లోకి తీసుకెళ్లేలా మహిళలకు పూర్తి స్వేచ్చ ఉంటుంది. వారికి ప్రభుత్వం అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తుంది.
నా కుటుంబానికి అండగా ఉంటున్నా
వంట చేయడంలో మెళకువలు నేర్చుకోవడం ద్వారా క్యాంటీన్లకు ఫుడ్ తయారు చేయడమే కాకుండా ఫంక్షన్లకు కూడా వంటలు చేస్తున్నాం. పెద్ద మొత్తంలో వంటలు చేయడంపై శిక్షణ పొందడం ద్వారా మహిళలకు జీవనోపాధి కల్పించడమే కాకుండా, సొంతంగా క్యాంటీన్‌లను తెరవడానికి ఉపయోగపడుతుంది. పదిరోజుల శిక్షణ తర్వాత వంట చేయడంలో చాలా మార్పులు వచ్చాయి. ఏ పదార్థాలు ఎంత క్యాంటిటీలో వేయాలి, బిర్యానీ చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వంటి అంశాలన్నీ తెలుసుకున్నాను. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు నా వంట మా కుటుంబ సభ్యులే కాకుండా బయట వాళ్లు బాగుంటున్నాయని అంటున్నారు. పదిమందితో కలిసి పనిచేస్తే సమయంతో పాటు పనిచేస్తున్నామన్న భావన కూడా కలగదు. - భాగ్యలక్ష్మి, క్యాంటీన్ నిర్వాహకురాలు
ఫుడ్ టేస్ట్ బాగుంది: నాగర్ కర్నూల్ కలెక్టరేట్ కార్యాలయం సిబ్బంది
మహిళా శక్తి క్యాంటీన్లలో ఫుడ్ ఇంట్లో వండినట్లే ఉంటుంది. నేను కార్యాలయానికి వచ్చేటప్పుడు ఇదివరకు బాక్స్ తెచ్చుకునేవాడిని కానీ ఇప్పుడు ఇక్కడే తింటున్నా..ప్లేట్ మీల్ రూ.80 వరకు ఉంటుంది. బిర్యానీ రూ.120 ఉంది. ధరలు అనుకూలంగానే ఉన్నాయి. బయటతో పోల్చితే రుచితో పాటు శుభ్రత కూడా ఉంటుంది. అందుకే ఇక్కడ తినడానికి ఉద్యోగులే కాకుండా కార్యాలయానికి వచ్చే బయటివాళ్లు కూడా తినడానికి ఇష్టపడుతుంటారు.
ఫీడ్ బ్యాక్ బాగుంది
ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా మహిళా శక్తి క్యాంటిన్లు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 97 యూనిట్లు స్టార్ చేశాం. మార్చి వరకు 150 క్యాంటీన్లు ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఆర్థికంగా ఎదగడమే కాకుండా వ్యాపారవేత్తలుగా మారడానికి మహిళా శక్తి క్యాంటీన్లు ఉపయోగపడతాయి. ప్రభుత్వం మహిళల కోసం చేపట్టే ఇలాంటి కార్యక్రమాలపై జిల్లాల వారీగా అవగాహన కల్పిస్తూ మరికొందరిని భాగస్వాములు చేయాలని భావిస్తున్నాం. కమర్షియల్ ఏరియాలో కాకుండా ప్రభుత్వం నిర్ధేశించిన ప్రాంతాల్లో క్యాంటీన్ ఏర్పాటు చేస్తే వారికి అద్దె ఖర్చు ఆదా అవుతుంది. అలాగే వాటి మొయింటనెన్స్‌కి సోలార్ ప్లాంట్స్ ఏర్పాటు చేయడంతో కరెంటు ఖర్చులు కూడా తగ్గుతాయి.
- దివ్య దేవరాజన్, సెర్ప్ సీఈఓ