- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సెంచరీ గర్ల్.. త్రిష

బుడి బుడి అడుగులు వేసే వయసులోనే బ్యాటు పట్టింది
సరదాగా ఆటలు ఆడాల్సిన వయసులో.. సీరియస్‌గా ప్రాక్టీస్ చేసింది
పొద్దున్నే నాన్న నిద్రలేపుతుంటే.. కష్టంగా కాకుండా ఇష్టంగా లేచింది
ఇంత చిన్న అమ్మాయిని పొద్దునే తీసుకెళ్లి ప్రాక్టీస్ అవసరమా అంటున్నా.. పెడచెవిన పెట్టింది
బ్యాటింగ్‌లో ఆరి తేరింది.. బౌలింగ్‌లో రాటు తేలింది
కోచ్ చెప్పాడని స్పిన్నర్ అయ్యింది.. ఆటలో పదును పెరిగింది..
మొత్తంగా టీమ్‌ను గెలిపించి.. తానూ విన్నర్ అయ్యింది. తానే గొంగడి త్రిష
- జాన్ కోరా
నిన్న మొన్నటి వరకు గొంగడి త్రిష అంటే పెద్దగా ఎవరికీ పరిచయం లేదు. కానీ తాను అండర్-19 వరల్డ్ కప్‌లో చేసిన సెంచరీ తనను ప్రపంచానికి పరిచయం చేసింది. అండర్-19 టీ20 వరల్డ్ కప్‌లో ఇంత వరకు ఎవరూ సాధించని ఘనతను సాధించింది. ఆమె తెలంగాణ అమ్మాయి కావడం అందరికీ గర్వకారణం. ఏనాటికైనా వరల్డ్ కప్‌ను గెలిచే జట్టులో తానూ ఉండాలని కోరుకుంటున్న 'గొంగడి త్రిషా'తో దిశ ప్రత్యేక ఇంటర్వ్యూ..
దిశ : పూర్తి ఇంటర్వ్యూలోకి వెళ్లే ముందు ఒకప్రశ్న.. ఆ రోజు సెంచరీ కొట్టే ముందు మీ మనసులో ఏముంది? ఆ సింగిల్ పరుగు చేయగలను అనే నమ్మకం ఉందా?
త్రిష : నిజం చెప్పాలంటే.. నేను సెంచరీ చేయబోతున్న విషయం కూడా నాకు తెలియదు. నేను సాధారణంగా స్కోర్ బోర్డు వైపు చూడను. నా స్కోర్ ఎంత అన్నది తెలుసుకోను. 18వ ఓవర్‌లో సింగిల్స్ తీస్తూ బ్యాటింగ్ రొటేట్ చేస్తున్నాము. ఆ ఓవర్ చివరి బంతికి సింగిల్ తీస్తున్నప్పుడు డగౌట్‌లో మా టీమ్ మేట్స్, కోచ్, ఇతర సిబ్బంది లేచి నిలబడి చప్పట్లు కొడుతున్నారు. అప్పుడు గానీ నేను సెంచరీ చేశానని తెలియలేదు. ఆ వెంటనే బ్యాట్ చూపించి సెలబ్రేట్ చేశాను.
దిశ: మరి మీరు సాధించింది ఒక రికార్డు సెంచరీ అని అప్పుడు తెలియదా?
త్రిష : నాకు తెలియదు. అండర్-19 వరల్డ్ కప్‌లో నాదే తొలి సెంచరీ అని పెవీలియన్‌కు వచ్చాక తెలిసింది.
దిశ : అండర్-19 వరల్డ్ కప్‌లో తొలి సెంచరీ మీదే అని తెలిసిన తర్వాత మీకు ఏమనిపించింది?
త్రిష : చాలా హ్యాపీ. అసలు నేనే తొలి సెంచరీ చేశానని అనుకోలేదు. అంతకు ముందు ఎవరో ఒకరు చేసి ఉంటారని అనుకున్నా. కానీ పెవీలియన్‌లోనే నాకు రికార్డు సెంచరీ అని అర్థం అయ్యింది.
దిశ : రికార్డు సెంచరీతో తెలుగు వాళ్లకే కాకుండా ప్రపంచ క్రికెట్‌లో మీకొక గుర్తింపు వచ్చింది. అయితే మీ స్వస్థలం, కుటుంబ గురించి చెప్పండి.
త్రిష : నేను పుట్టింది భద్రాచలంలో.. నాన్నది ఆ ఊరే. అమ్మ వాళ్లది సత్తుపల్లి.
దిశ: చిన్నప్పుడే క్రికెట్‌లోకి ఎలా అడుగు పెట్టారు?
త్రిష: నాన్న ప్రోత్సాహమే నన్ను క్రికెట్ వైపు నడిపించింది. నాన్నకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అందుకే వాళ్ల కోరిక మేరకే నేను క్రికెటర్‌ను అయ్యాను.
దిశ: కొంచెం ఆ చిన్నప్పటి క్రికెట్ విశేషాలను వివరిస్తారా?
త్రిష: నాకు రెండున్నర ఏళ్ల వయసు ఉన్నప్పుడే బ్యాట్ పట్టుకున్నాను. నాన్నే నాకు తొలి కోచ్. కొన్నాళ్లకు నాకు క్రికెట్ కోచింగ్ ఇప్పించాలని నాన్న డిసైడ్ అయ్యారు. అలా నన్ను సికింద్రాబాద్‌కు తీసుకొచ్చారు. మొదట్లో అమ్మమ్మ వాళ్లతో ఉండి క్రికెట్ కోచింగ్‌కు వెళ్లేదాన్ని. ప్రతీ వీకెండ్ అమ్మానాన్న భద్రాచలం నుంచి సికింద్రాబాద్ వచ్చే వాళ్లు. అయితే ఇలా వారం వారం తిరగడం వాళ్లకు ఇబ్బంది అవుతుందని అమ్మా నాన్న కూడా భద్రాచలం నుంచి షిఫ్ట్ అయిపోయారు.
దిశ : నాన్న ఉద్యోగం వదిలేసి మీ కోసం వచ్చారట కదా?
త్రిష: అవును. నా కోసం నాన్న తీసుకున్న కఠినమైన నిర్ణయం అది. జిమ్‌ను అమ్మేసి.. సికింద్రాబాద్‌కు వచ్చారు. కేవలం నా క్రికెట్ కెరీర్ కోసమే నాన్న తన కెరీర్‌ను పక్కన పెట్టారు.
దిశ : చిన్నప్పుడు అమ్మానాన్నలు పడిన కష్టాలు ఎలా ఉండేవి?
త్రిష: నాకు అప్పట్లో ఏమీ తెలియదు. అమ్మానాన్న నా కోసం ఎలాంటి కష్టాలు పడ్డారో అప్పట్లో అర్థమయ్యేది కాదు. కానీ నాన్న టార్గెట్ నన్ను క్రికెటర్‌ను చేయడం. అందుకే నాకు క్రికెట్ తప్ప కుటుంబంలో ఎలాంటి కష్టాలుండేవో నాకు తెలియదు. అలా తెలియకుండా నాన్న పెంచారు.
దిశ : నాన్న ఇలా అన్నీ అమ్మేసి వస్తుంటే అమ్మ ఏమీ అడ్డు చెప్పలేదా?
త్రిష: నన్ను క్రికెటర్‌ను చేయడం అనేది అమ్మానాన్నల సమిష్టి నిర్ణయం. నాన్న నాకు క్రికెట్ కోచింగ్ ఇప్పిస్తే.. అమ్మా నా డైలీ రొటీన్స్ చూసుకుంటుంది. ఇప్పటికీ నేను సమయానికి కోచింగ్‌కు వెళ్లాలన్నా.. మ్యాచ్‌లకు హాజరవ్వాలన్నా.. అమ్మ టైంకి అన్ని సమకూర్చి పెట్టడం వల్లే జరుగుతుంది. అమ్మనాన్న ఇద్దరూ నా కోసం సమానంగా కష్టపడ్డారు.
దిశ : ఇంట్లో ఒక్కరే. పైగా అమ్మాయిలు అనగానే పరిస్థితి ఎలా ఉంటదో తెలిసిందే. ఇలాంటప్పుడు బంధువుల నుంచి ఎలాంటి సూటిపోటి మాటలు ఏమీ ఎదురు కాలేదా?
త్రిష: మా బంధువుల నుంచి ఎలాంటి అభ్యంతరాలు రాలేదు. పైగా వాళ్లు సపోర్టీవ్‌గా కూడా ఉండేవారు. కాకపోతే.. పొద్దున్నే లేపి ప్రాక్టీస్‌కు తీసుకెళ్తుంటే.. ఇంత పొద్దున్నే పాపను కష్టపెట్టడం అవసరమా అని అప్పుడప్పుడు అనేవాళ్లు. కానీ కొన్నాళ్ల తర్వాత నా పెర్ఫార్మెన్స్ చూసి.. వాళ్లకు కూడా నాన్న తీసుకున్న నిర్ణయం సరైనదే అని అర్థం అయ్యింది.
దిశ : సికింద్రాబాద్‌కు వచ్చాక జాన్ మనోజ్ సార్ దగ్గర ఎలా చేరారు?
త్రిష : నేను చిన్నప్పుడు నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తుండగా తీసిన వీడియోలను నాన్న జాన్ మనోజ్ సార్, శ్రీనివాస్ సార్‌కు పంపించారు. ఆ వీడియోలు చూసి జాన్ మనోజ్ సార్ చాలా ఇంప్రెస్ అయ్యారు. అలా సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యాను. ఇక్కడే కోచ్ శ్రీనివాసన్ సార్ నాకు కోచింగ్ ఇచ్చారు.
దిశ : అండర్-19 వరల్డ్ కప్‌లో మీరు ఆడిన మ్యాచెస్ చూస్తుంటే.. చాలా అవవోకగా సిక్సులు కొడుతున్నారు. దీని కోసం ఎంత కష్టపడ్డారు?
త్రిష : నాకు ఇలా సిక్సులు అలవోకగా కొట్టడానికి ప్రాక్టీస్ చేయించింది ప్రణయ్ సార్. ఆయనే నాకు ఈజీగా సిక్సులు ఎలా కొట్టవచ్చో చెప్పారు.
దిశ: మీకు ఇష్టమైన షాట్ ఏంటి?
త్రిష: నాకు ఓవర్ ద కవర్స్ షాట్ చాలా ఇష్టం. ఛాన్స్ దొరికితే ఆ షాక్ ఆడటానికి ఏ మాత్రం సంశయించను.
దిశ: మీరు ఆల్‌రౌండర్ కావాలని ముందు నుంచి అనుకున్నారా?
త్రిష: నేను మొదటి నుంచి బ్యాటర్, బౌలర్‌గా ఉన్నాను. అంతే కాకుండా జట్టు కోసం ఓపెనింగ్ చేయడానికి కూడా చిన్నప్పటి నుంచే ఇష్టపడేదాన్ని.. అందుకే ఆల్‌రౌండర్‌గా మారాను. నేను మొదట్లో ఫాస్ట్ బౌలింగ్ వేసేదాన్ని.. అయితే కోచ్ సార్ వాళ్లు ఫాస్ట్ బౌలింగ్ వేయడం వల్ల బాగా అలసిపోతావు. గాయాల బెడద కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పారు. దీంతో నేను స్పిన్నర్‌గా మారాను. అప్పటి నుంచి నా బ్యాటింగ్ మరింత మెరుగుపడింది. అంతే కాకుండా స్పిన్ ఇంకా బాగా వేయగలుగుతున్నాను.
దిశ : క్రికెట్‌లో మీరు ఇన్‌స్పిరేషన్‌గా భావించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా?
త్రిష : నాకు మిథాలీ రాజ్ గొప్ప స్పూర్తి. తాను హైదరాబాదీ కావడమే కాదు. ఇదే సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నారు. టీమ్ ఇండియా కెప్టెన్‌గా ఎన్నో రికార్డులు సాధించారు. తన ఆట మాత్రమే కాదు తన వ్యక్తిత్వం కూడా నాకు చాలా ఇష్టం. తనతో మాట్లాడితే నాకు ఎంతో ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది.
దిశ: ఎప్పుడైనా మిథాలీ నుంచి టిప్స్ తీసుకున్నారా?
త్రిష: నేను మిథాలీ మేడమ్‌తో చాలా సార్లు మాట్లాడాను. తన వద్ద చాలా నేర్చుకున్నాను. ఇక ముందు కూడా నేర్చుకుంటాను.
దిశ: మరి మీకు ఇష్టమైన మేల్ క్రికెటర్లు ఎవరు?
త్రిషః నాకు మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ అంటే ఇష్టం
దిశ : ఒక వైపు ప్రాక్టీస్.. మళ్లీ మ్యాచ్‌లు.. దీంతో పాటు ఫిట్నెస్ కాపాడుకోవాలి. ఇలాంటిప్పుడు బయటి ఫుడ్ తింటుంటారా?
త్రిష: నాకు పిజ్జా అంటే ఇష్టం. వెజ్ నాన్ వెజ్ రెండూ ఇష్టంగా తింటాను. ఇంట్లో అమ్మ చేసే వంటలు బాగుంటాయి. అన్నీ ఇష్టంగా తింటూనే ఫిట్‌నెస్ కాపాడుకుంటాను.
దిశ: ఇంటిని వదలి దూరంగా చాలా రోజులు ఉంటారు. అలాంటి సమయంలో భయం వేయదా?
త్రిష: హెచ్‌సీఏ, బీసీసీఐ మాకు చాలా సెక్యూరిటీ అరేంజ్ చేస్తుంది. మాకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తారు. జట్టులో ఉండే కోచెస్, ఇతర సిబ్బంది మాకు ఎలాంటి భయం లేకుండా వాళ్లు చూసుకుంటారు. నేను ఏనాడూ భయపడలేదు. అంత బాగా చూసుకుంటారు.
దిశ : విదేశాలకు వెళ్లినప్పుడు ఎలా ఉంటుంది?
త్రిష: ఇక్కడి పిచ్, వాతావరణం కంటే విదేశాల్లో ఎలాంటి తేడా ఉంటుంది. అక్కడి వాతావరణానికి ఎలా ఆడాలనే విషయాలను మాకు కోచ్‌లు వివరిస్తారు. అక్కడి పిచ్‌లు ఎలా ఉంటాయి.. మన ఆట తీరు ఎలా ఉండాలనే విషయాలపై ముందుగానే అవగాహన కల్పిస్తారు. కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు.
దిశ: ఇప్పుడిప్పుడే క్రికెట్‌లో మంచి పేరు సంపాదిస్తున్నారు. అయితే ఇటీవల జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో మిమ్మల్ని ఏ టీమ్ కూడా కొనలేదు. అప్పుడు బాధపడలేదా?
త్రిష: లేదు. నాకు ఎలాంటి బాధ లేదు. మరింత కష్టపడితే అవకాశాలు అవే వస్తాయి. ఇవ్వాళ కాకపోయినా రేపైనా నాకు ఏదో ఒక జట్టులో అవకాశం వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. అందుకే అన్‌సోల్డ్‌గా మిగిలినందుకు నాకు బాధలేదు.
దిశ: ఒక వేళ మీకు అవకాశం వస్తే ఏ జట్టు తరపున ఆడాలని అనుకుంటారు?
త్రిష: నాకు ఆట ఆడటం ఇష్టం. ఏ జట్టు అయినా నాకు పర్వాలేదు. ఎవరి కోసం ఆడినా.. నా బెస్ట్ ఇవ్వాలన్నదే నా ఆకాంక్ష.
దిశ: టీమ్ ఇండియా తరపున ఆడాలని అందరికీ ఉంటుంది. మరి మీకు అవకాశం వస్తే ఏం చేస్తారు?
త్రిష: టీమ్ ఇండియా తరపున ఆడటమే ఏ క్రికెటర్‌కు అయిన ఉండే ఫైనల్ గోల్. నాకు అవకాశం వస్తే తప్పకుండా బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తా. ఏనాటికైనా టీమ్ ఇండియా వరల్డ్ కప్ కొడితే.. ఆ జట్టులో నేను ఉండాలని భావిస్తున్నాను. అదే నా అంతిమ లక్ష్యం.
దిశ: క్రికెట్ తప్ప ఇతర వ్యాపకాలు ఏమైనా ఉన్నాయా?
త్రిష: క్రికెట్ నాకు ప్రాణం. ఎక్కువగా ప్రాక్టీస్, మ్యాచ్‌లకే సమయం సరిపోతుంది. సినిమా థియేటర్లకు వెళ్లను. ఇంట్లో ఖాళీ ఉంటే వెబ్ సిరీస్‌లు చూస్తాను. అంతే.. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ కాదు నేను. నాకున్న సమయం అంతా క్రికెట్‌కే కేటాయిస్తాను.
పూర్తి పేరు : గొంగిడి త్రిష రెడ్డి
తల్లిదండ్రులు : రాంరెడ్డి, మాధవి
పుట్టిన తేదీ : 2005 డిసెంబర్ 15
పుట్టిన స్థలం : భద్రాచలం
క్రికెట్ ఆడటం మొదలు పెట్టింది : 2.5 ఏళ్ల నుంచి
జట్లు: హైదరాబాద్, ఇండియా బి, ఇండియా ఏ, ఇండియా బ్లూ అండర్-16 సౌత్ జోన్, ఇండియా అండర్-19
కోచ్‌లు : శ్రీనివాసన్, జాన్ మనోజ్, ఆర్.శ్రీధర్
ఘనతలు :
1. ఎనిమిదేళ్ల వయసులోనే హైదరాబాద్ అండర్-19 మహిళా జట్టులో చోటు. అప్పట్లో ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కురాలు త్రిషనే.
2. అండర్-16లో వరుసగా రెండేళ్ల పాటు టాప్ స్కోరర్‌గా నిలిచింది.
3. హైదరాబాద్ అండర్-19 జట్టుకు 12 ఏళ్ల వయసు నుంచి ఆడుతోంది.
4. అండర్-19లో తొలి మ్యాచ్ తమిళనాడుతో ఆడింది. ఆ మ్యాచ్‌లో నాలుగు వికెట్లు తీయడమే కాకుండా 38 పరుగులు చేసింది.
5. అండర్-19 ప్లేయర్‌గా శ్రీలంక, వెస్టిండీస్, న్యూజీలాండ్‌లతో సిరీస్‌లు ఆడింది.
హాబీలు : స్విమ్మింగ్, డ్రాయింగ్