- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Disha Special : జైలే.. బెటర్! నేరాలకు పాల్పడుతున్న సీనియర్ సిటిజన్లు

‘బతుకు బండి లాగి అలసిపోయి
ఎండి శల్యమైన పండు ముసలి నేను
సత్తు విరిగిన కాళ్లు చచ్చుబోయే
చెందనాడి బలిమి జెల్లిపోయే
సొంతమైన వారు చెంత చేరరాయే
అంత బతుకూ నేడు పంచకాయే’ అని వృద్ధాప్యాన్ని అభివర్ణిస్తూ ఓ కవి రాసిన మాటలివి. మనిషి జీవితంలో చివరి దశ వృద్ధాప్యం. బతుకుబండిని లాగి లాగి అలిసి పోయి విశ్రాంతి తీసుకునే సమయం అది. ఈ టైంలో ఎవరైనా తమ కొడుకులు, కుమార్తెలు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిసి సంతోషంగా జీవించాలని కోరుకుంటారు. ఎటువంటి కష్టం లేకుండా ఇంకా ఆరోగ్యంగా హాయిగా జీవించాలని పరితపిస్తుంటారు. ఒకవేళ తమను చేరాదీయాల్సిన వారు ఇంటి నుంచి గెంటేసినా, పేదరికం వెంటాడినా ఏ వృద్ధాశ్రమమో చూసుకుని అక్కడే ఉండాలనుకుంటారు. కానీ ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి చెందిన జపాన్ దేశంలో మాత్రం విచిత్ర పరిస్థితి ఉంది. ఈ దేశంలోని వృద్ధులు జైళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఏ నేరం చేసి ఎప్పుడు జైలుకు వెళ్దామా అని ఆతృతతో ఉంటారు. జైలుకు వెళ్లేందుకే నేరాలబాట పడుతుండటం అక్కడి ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. చిన్న చిన్న చోరీలకు పాల్పడుతూ కారాగారానికి వెళ్లేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఏదైనా నేరం చేసి జైలుకు వెళ్లి విడుదలైనా మళ్లీ పదే పదే నేరాలు చేస్తూ జైలు బాటపడుతున్నారు. ఈ నేపథ్యంలో వారు జైలు వైపు ఎందుకు వెళ్తున్నారు? రెస్ట్ తీసుకునే వయసులో జైళ్లలో మగ్గిపోవాలని ఎందుకు కోరుకుంటున్నారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. - ముస్కే వినోద్ కుమార్
కూడు, గూడు కోసమే
జపాన్‌లో ఎక్కువమంది వృద్ధులు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. పేదరికం, ఒంటరితనంతో బాధపడుతున్నారు. దేశంలో 65 ఏళ్లు పైబడిన వారిలో 20శాతం మంది పేదరికంలో మగ్గుతున్నట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంతేగాక జపాన్‌లో వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. యువ జనాభా తగ్గుముఖం పడుతుండటంతో వారు భవిష్యత్‌పై దృష్టి సారిస్తూ వారి ఇండ్లలోని వృద్ధులను పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో ఎంతో మందిని వారి కుటుంబాలు విడిచిపెడుతున్నాయి. కాబట్టి వారు బయట ఉంటే పట్టించుకునే వారు కూడా ఉండబోరు. ఈ నేపథ్యంలో బయట ఉన్న వృద్ధులకు తిండి, వసతి కరువుతున్నాయి. ఆనారోగ్య సమస్యలు సైతం వారిని వేధిస్తున్నాయి. దీంతో వారంతా జైళ్లకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. అక్కడైతే కూడు, గూడు, తోడు దొరుకుతుందని, ఉచిత వైద్య సదుపాయాలు లభిస్తాయని భావిస్తున్నారు. అందుకే పదే పదే నేరాల బాట పడుతున్నారు.
జైళ్లలో మెరుగైన సౌకర్యాలు
జపాన్ జైళ్లలో వృద్ధులకు మెరుగైన సౌకర్యాలు ఉంటాయి. జైలులోని భద్రతా సిబ్బంది వృద్ధ ఖైదీలను జాగ్రత్తగా చూసుకుంటారు. వారికి ప్రతి రోజూ స్నానం చేయించడంతో పాటు వాకింగ్‌కు కూడా తీసుకెళ్తారు. అంతేగాక ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం, అనేక ఇతర సదుపాయాలు ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణం కూడా ఉంటుంది. అందుకే చాలా మంది వృద్ధులు ఇంటి కంటే జైలు వాతావరణాన్ని ఇష్టపడుతున్నారు. ఒంటరి తనంతో కుంగిపోయే వారు జైలు కెళ్తే తోటి నేరస్థుల తోడు దొరుకుతుందని భావిస్తున్నారు. జైళ్లకు వెళ్తేందుకే ఆసక్తి చూపుతున్నారు. జైలును శిక్షగా గాక ఆశ్రయంగా చూస్తున్నారు. జపాన్‌లో ప్రతి ఐదో నేరస్తుడూ వృద్ధుడే అంటే జైళ్లు వారిని ఏ విధంగా ఆకర్షిస్తున్నాయో, అక్కడున్న సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
పదే పదే నేరాలు
జైలు నుంచి శిక్ష అనుభవించిన బయటకు వచ్చిన వృద్ధులు వారికి ఎటువంటి సంరక్షణ లేకపోవడంతో మళ్లీ నేరాలు చేసి జైలుకు వెళ్లేందుకే ఆసక్తి చూపుతున్నారు. రిలీజైన వెంటనే చిన్న చిన్న నేరాల ద్వారా జైలుకు వెళ్లే మార్గాన్ని ఎంచుకుంటున్నారు. జపాన్‌లో చోరీ కేసులే అత్యంత సాధారణ నేరంగా ఉంది. ఆ తర్వాత ఇతరులను భయబ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో తోషియో టకాటా అనే ఓ వృద్ధురాలు మాట్లాడుతూ.. ‘నేను పేదరికంలో ఉన్నాను. ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఉచితంగా ఆహారం వసతి అందించబడే ప్రదేశానికి వెళ్లాలనుకున్నా. కాబట్టి 62 ఏళ్ల వయసులో జైలుకు రావడానికి ఒక చిన్న దొంగతనానికి పాల్పడ్డాను. నా వయస్సును పరిగణనలోకి తీసుకుని, కోర్టు నాకు కేవలం ఒక ఏడాది జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత నేను జైలుకు వెళ్లడానికి చాలాసార్లు నేరాలు చేశాను’ అని చెప్పాడు.
ప్రతి ఐదో నేరస్థుడూ వృద్ధుడే
జపాన్‌లో గత 20 ఏళ్లలో జైలుకు వెళ్తున్న 65 ఏళ్లు పైబడిన వారి సంఖ్య మూడు రెట్లు పెరిగింది.1997లో ప్రతి 20 మంది నేరస్థులలో ఒకరు 65 ఏళ్లు పైబడిన వారు ఉండగా ప్రస్తుతం ప్రతి ఐదుగురు నేరస్థుల్లో ఒకరు వృద్ధులు ఉన్నారు. జపాన్ జనాభా 12.45 కోట్లు కాగా అందులో 65 ఏళ్లు పైబడిన వారి జనాభా దాదాపు 3.5 కోట్లు. ప్రభుత్వ డేటా ప్రకారం.. 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి సంఖ్య 2024లో రికార్డు స్థాయిలో 36.25 మిలియన్లకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధాప్యం పెరుగుతున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. జపాన్ మొత్తం జనాభాలో ప్రస్తుతం 29.3 శాతం వృద్ధులు ఉన్నారు. అలాగే వృద్ధుల నిష్పత్తి ఆధారంగా, 1,00,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన 200 దేశాలు, భూభాగాల జాబితాలో జపాన్ అగ్రస్థానంలో ఉంది.
ప్రభుత్వానికి సవాల్‌గా మారిన సమస్య
వృద్ధులు ఎదుర్కొనే సమస్యలను గుర్తించిన ప్రభుత్వం వారి కోసం గృహ నిర్మాణ పథకాలు, పెన్షన్స్ వంటివి అమలు చేస్తున్నది. అయితే అవి వృద్ధాప్యంతో బాధపడుతున్న వారికి ఏ మాత్రం సరిపోవడం లేదని నిపుణులు భావిస్తున్నారు. వృద్ధుల సంఖ్య వేగంగా పెరగడమే దీనికి కారణమని చెబుతున్నారు. దీంతో ఈ సమస్య ప్రస్తుతం జపాన్ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అయితే ఈ సమస్యపై ప్రభుత్వం పక్కా ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకుంటే దీనిని పరిష్కారం లభించే చాన్స్ ఉందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
పునరావాస కేంద్రాల ఏర్పాటు
ఈ సమస్య మరింత ముదరకముందే ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. కుటుంబానికి దూరంగా, పేదరికం, ఒంటరి తనంలో మగ్గుతున్న వృద్ధులను గుర్తించి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. అందులో వారికి వసతి, ఆహారం అందించడంతో పాటు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. దీని వల్ల వృద్ధులకి కాస్త ఆసరా దొరుకుతుంది. అంతేగాక తమ తోటి వృద్ధులతో జీవనం సాగించడం వల్ల మానసికంగా సైతం బలోపేతమయ్యే చాన్స్ ఉంటుంది. కేవలం పెన్షన్ అందించడం వల్ల వారిని సంతృప్తి పర్చలేం. ఎందుకంటే డబ్బులతో రోజు వారీ అవసరాలు తీరుతాయి కానీ వారికి మానసిక ఉల్లాసం దొరకదు. సామూహికంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటేనే వృద్ధుల్లో ఆనందం నెలకొంటుంది. మొదటగా వారిలో ఒంటరితనం అనే భావనను చెరిపివేయాలి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అంతేగానీ కేవలం పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటే మాత్రం ప్రాబ్లం సాల్వ్ అయ్యే అవకాశమే లేదు. కాబట్టి ప్రభుత్వం ఈ తరహా చర్యలు చేపట్టాలి.
జైలే బెటర్
జైలుకు రావడం వల్లే నా జీవితంలో ఆనందం వచ్చింది. నేను మొదటగా 60 ఏళ్ల వయసులో ఆహారం దొంగిలించి జైలు పాలయ్యాను. ఆ టైంలో నాకు జైలులో మంచి ఆహారం, ఆశ్రయం లభించింది. కాబట్టి నేను బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ అక్కడికి వెళ్లేందుకే నిర్ణయం తీసుకున్నా. మా కుటుంబం నాకు దూరంగా ఉంటోంది. గతేడాది జైలు నుంచి బయటకు వచ్చా. ఇక్కడ నన్ను పట్టించుకునే వారు ఎవరూ లేరు. ఆర్థిక సమస్యలూ వెంటాడుతాయి. జైలులో వాతావరణం బాగుంది. అక్కడ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటారు. అందుకే జైలుకు వెళ్లడానికి డెసిషన్ తీసుకుని చోరీకి పాల్పడ్డా. ఆర్థికంగా బాగుంటే జైలుకు వెళ్లేందుకు ఆసక్తి చూపకపోదును. జపాన్ ప్రభుత్వం వృద్ధుల కోసం పెన్షన్ అందజేస్తున్నా అది ఏ మాత్రం సరిపోవడం లేదు. దానితో బతకడం చాలా కష్టం.
- ఇటీవల చోరీకి పాల్పడి జైలుకు వెళ్లిన 81 ఏళ్ల మహిళ ఒకియో ఆవేదన