మారిన మావోయిస్టుల ఉద్యమపంథా..

by Sumithra |
మారిన మావోయిస్టుల ఉద్యమపంథా..
X

దిశ‌, ఖ‌మ్మం/కరీంనగర్: మావోయిస్టుల అగ్ర‌నాయ‌కత్వంలో మార్పుతో ఉద్య‌మ పంథా కూడా మారిపోయిన‌ట్లుగా తెలుస్తోంది. ఆప‌రేష‌న్ ప్ర‌హార్‌ను ఎదుర్కొనేందుకు మావోలు విస్త‌ర‌ణ వ్యూహాన్ని అమ‌లు ప‌రుస్తున్న‌ట్లుగా స‌మాచారం. చ‌త్తీస్‌ఘ‌డ్‌లోని మావోల ర‌క్ష‌ణాత్మ‌క ప్రాంతాల‌పై నానాటికి పోలీసుల ప‌ట్టు పెరుగుతోంది. దీంతో మావోలు కూడా కొత్త స్థావ‌రాల ఏర్పాటుతో పాటు రిక్రూట్‌మెంట్లు చేయ‌గ‌లిగితేనే ఉద్య‌మానికి మ‌నుగ‌డ ఉంటుంద‌ని అగ్ర‌నాయ‌క‌త్వం భావిస్తోంద‌ని స‌మాచారం. ఈ మేర‌కు చ‌త్తీస్‌గ‌డ్‌కు పొరుగున ఉన్న నాలుగు రాష్ట్రాలైన ఆంధ్రా, తెలంగాణ, ఓడిషా, మ‌హారాష్ట్రాల్లో ముందుగా విస్త‌రించాల‌ని వ్యూహాలు రూపొందించుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈ కీల‌క ప‌రిణామాల్లో భాగంగానే ఇటీవ‌ల కొన్ని ద‌ళాలు భ‌ద్రాది కొత్త‌గూడెం, ములుగు జిల్లాల గోదావ‌రి ప‌రివాహ‌కం గుండా ప్ర‌వేశించిన‌ట్లుగా పోలీసుల‌కు ప‌క్కా స‌మాచారం అందింది. ఇంట‌లిజెన్స్ అధికారులు ఇచ్చిన స‌మాచారం కూడా స‌రిపోల‌డంతోనే రాష్ట్ర డీజీపీ వ‌రుస‌గా గోదావ‌రి ప‌రివాహ‌క జిల్లాల్లో ప‌ర్య‌టిస్తూ శాఖ అధికారుల‌ను అప్ర‌మ‌త్తం చేస్తూ వ‌స్తున్నార‌న్న అభిప్రాయం స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతోంది.

విస్త‌ర‌ణ వైపు అడుగులు..

మావోయిస్టు ఉద్య‌మంలో అధినాయ‌క‌త్వం మార‌డంతో దూకుడు పెరిగిన‌ట్లుగా తెలుస్తోంది. గతంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా ముప్పాల లక్ష్మణ్‌ రావు అలియాస్‌ గణపతి అలియాస్‌ రమణ కొన‌సాగారు. గణపతి ఆరోగ్యం బాగోలేక‌పోవ‌డంతో కేంద్ర కమిటీ ఆయనను తూర్పు విభాగం ప్రాంతీయ కార్యదర్శి (ఈఆర్‌బీ)గా నియమించింది. ఇక కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా నంబాల కేశవరావు అలియాస్‌ బసవరాజు అలియాస్‌ గంగన్న నియామ‌క‌మ‌య్యారు. ప్రస్తుతం కేశవరావు అధినాయకత్వంలో మావోయిస్టు పార్టీ విస్త‌ర‌ణ వైపు అడుగులు వేస్తున్న‌ట్లు స‌మాచారం. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని సుక్మా, జగ్దల్‌పూర్‌, దంతెవాడ, బీజాపూర్‌, నారాయణపూర్‌, కాంకేర్‌, బస్తర్‌ జిల్లాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్‌ల దిశగా పార్టీ ముందడుగు వేస్తున్నట్లు సమాచారం. అయితే పోలీస్‌శాఖ చ‌ర్య‌ల‌తో ఎంతోమంది మావోయిస్టులు లొంగుబాట ప‌డుతున్నారు. ఈ లోటును పూడ్చుకునేందుకు మ‌ళ్లీ మావోలు రిక్రూట్‌మెంట్‌పై దృష్టిసారించిన‌ట్లుగా తెలుస్తోంది.అదేవిధంగా యువతను, మైనర్లను సైతం పార్టీలోకి రావాలంటూ సానుభూతిపరుల ద్వారా స‌మాచారం పంపుతున్న‌ట్లు తెలుస్తోంది. అదే స‌మ‌యంలో త‌మ ఉనికిని కాపాడుకునేందుకు మావోలు కొత్త‌గూడెం భ‌ద్రాచ‌లం జిల్లాలోని ఏజెన్సీ మండ‌లాల్లో నేతల పేరుతో లేఖ‌లు విడుద‌ల చేస్తూ వ‌స్తున్నారు. దీంతో అక్క‌డి వ్యాపారులు, కాంట్రాక్టర్లలో ఆందోళ‌న నెల‌కొంటోంది.

వ‌రుస‌గా దాడులు..కొన‌సాగుతున్న కూంబింగ్‌..

ఆకు రాలే కాలం కావ‌డంతో మావోల జాడ‌ను ప‌సిగ‌ట్ట‌డం ప్ర‌త్యేక బ‌ల‌గాల‌కు కొంత సులువ‌వుతుంది. దీంతో పోలీస్‌శాఖ కూంబింగ్‌ల‌ను ముమ్మ‌రం చేసింది. కొంత‌కాలంగా చ‌త్తీస్‌గఢ్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంటోంది.. నిత్యం మావోయిస్టులు, భద్రతా దాడులు జ‌రుగుతూనే ఉన్నాయి. బీజాపూర్‌ జిల్లాలోని పామేడ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టులు సెర్చింగ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న భద్రతా బలగాలపై దాడుల‌కు పాల్ప‌డ్డారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు మృతి చెంద‌గా ఓ మావోయిస్టు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప‌రిణామాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న చ‌త్తీస్‌గఢ్ పోలీసులు ప‌క్క రాష్ట్రాల పోలీసుశాఖ‌ల‌తో క‌ల‌సి సంయుక్తంగా కూంబింగ్‌కు ప్ర‌ణాళిక రూపొందించుకుని అమ‌లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో స‌రిహ‌ద్దు ఏజెన్సీ గ్రామాలు, తండాల్లో భ‌యాందోళ‌న నెల‌కొంటోంది.

Tags : maoists, Dk, Dandakaranya, telangana, chhattisgarh, police, coombing, maharashtra, ganapathi

Advertisement

Next Story

Most Viewed