- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లాక్డౌన్ ఉంటదా..? ఉండదా..?
దిశ, న్యూస్ బ్యూరో: హైదరాబాద్ మహా నగర పరిధిలో మరోమారు లాక్‌డౌన్ ఉంటుందా? ఉండదా? దీని మీద రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. లాక్డౌన్ ఉండే అవకాశాలు ఉన్నాయని నాలుగు రోజుల క్రితం ముఖ్యమంత్రి సంకేతాలిచ్చిచారు. విధివిధానాలను రూపొందించాలని కూడా అధికారులను ఆదేశించారు. మరోవైపు ఈ విషయం మీద మంత్రివర్గంలో చర్చించిన తర్వాతే స్పష్టత వస్తుందని మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు. లాక్‌డౌన్ తో ప్రయోజనం లేదని, ఇండ్లకే పరిమితమైతే పేదలు ఇబ్బంది పడతారని మరో మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. స్వీయ నియంత్రణే ఉత్తమమని సూచించారు. కరోనా కట్టడికి లాక్‌డౌన్ తప్పదని, ప్రభుత్వం ఇందుకు సిద్ధమైతే ప్రజలకు ముందుగానే సమాచారం ఇస్తామని ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పేర్కొన్నారు. ఇలా ప్రభుత్వంలో ఉన్న ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెబుతుండడంతో అయోమయం నెలకొంటోంది. ఏ సమయంలో ప్రభుత్వం కట్టడి ప్రకటన చేస్తుందోనని జనం నిత్యావసర వస్తువులను ముందుగానే నిల్వ చేసుకుంటున్నారు. వందలాది కుటుంబాలు పల్లెబాట పడుతున్నాయి. హోల్‌సేల్ దుకాణాలు మాత్రం జూలై ఐదు వరకు లాక్‌డౌన్ పాటిస్తామనే చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ పేరుతో ఆంక్షలను సడలించుకుంటూ పోతున్న సమయంలో తెలంగాణలో లాక్‌డౌన్ పెట్టినా ప్రయోజనం ఏముందనే అభిప్రాయమూ అధికారుల్లో వ్యక్తమవుతోంది.
వేగంగా వైరస్ వ్యాప్తి
నగరంలో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రోజూ దాదాపుగా వెయ్యి కేసుల వరకు నమోదవుతున్నాయి. కట్టడి అనివార్యమని ప్రభుత్వం అంచనాకు వచ్చింది. అందుకు లాక్‌డౌన్ ఒక్కటే మార్గం కాదని అధికారులు చెబుతున్నారు. కంటైన్‌మెంట్ జోన్లలో పటిష్ట చర్యలు తీసుకోవడం ద్వారా కూడా తగ్గించవచ్చని అంటున్నారు. లాక్‌డౌన్ పరిమిత కాలానికే ఉంటుందని, సడలించిన తర్వాత మళ్లీ కేసులు పెరుగుతాయనీ అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం ప్రభుత్వానికి తెలియందేమీ కాదని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. తాత్కాలిక ప్రయోజనం కోసం ఈ నిర్ణయం తీసుకోవడం సబబు కాదని అన్నారు. పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగించే స్థాయిలో లేవంటున్నారు. ప్రజల్లో మాత్రం లాక్‌డౌన్ పెట్టాలనే వాదన బలంగా వినిపిస్తోంది. కరోనా టెస్టుల సంఖ్య పెంచాలంటూ డిమాండ్ వచ్చినందునే 50 వేల టెస్టుల్ని చేయాలనే నిర్ణయం తీసుకున్నామని గతంలో ప్రధాన కార్యదర్శి వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజల డిమాండ్ మేరకు లాక్‌డౌన్ విషయంలోనూ సానుకూల నిర్ణయం తీసుకుంటుందా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడిప్పుడే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గాడిలో పడుతోంది. పేదలకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మళ్ళీ లాక్‌డౌన్ విధిస్తే ఆర్థిక సంక్షోభానికే దారితీస్తుందనే అభిప్రాయమూ వివిధ శాఖల అధికారుల్లో ఉంది. దీంతో ప్రభుత్వం ఎటూ తేల్చుకోలేకపోతోంది.
ఆ దిశగా చర్యలు లేవు
లాక్‌డౌన్ అంశం కేబినెట్ సమావేశంతో ముడిపడి ఉన్నందున, అది ఎప్పుడు జరుగుతుందా? అనే ఆసక్తి సామాన్య ప్రజానీకంలోనూ నెలకొంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లేమీ జరగడం లేదని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. సీఎం ఆదేశించినా విధి విధానాలను తయారు చేసే ప్రక్రియ కూడా మొదలు కాలేదు. అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. నగరంలో కేసులు పెరుగుతున్న మాట వాస్తవమే అయినా, లాక్‌డౌన్ తో ఎలా కట్టడి చేయగలుగుతామన్న వాదన కూడా బలంగానే వినిపిస్తోంది. కేంద్రం అన్‌లాక్ దిశగా వెళ్తుంటే తెలంగాణ మళ్లీ లాక్‌డౌన్ నిర్ణయం తీసుకుంటే ఎలా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. విమానాలు, రైళ్లు, అంతర్రాష్ట్ర రాకపోకలు జోరుగా సాగుతున్న సమయంలో వాటిని నిలువరించడం సాధ్యం కాదని అంటున్నారు. ఇన్ని రకాల సమస్యల నడుమ లాక్‌డౌన్ ద్వారా సాధించాలనుకున్న లక్ష్యం నెరవేరే అవకాశం స్వల్పంగానే ఉంటుందనేది ఆ అధికారుల వాదన. లాక్‌డౌన్ విధించాల్సి వస్తే పోలీసు, మున్సిపల్, వైద్యారోగ్యం, రెవెన్యూ తదితర శాఖల సిబ్బందిని సమాయత్తం చేయాల్సి ఉంటుందని కూడా ప్రభుత్వం పేర్కొంటోంది. మంగళవారం సాయంత్రానికి ఉన్న సమాచారం మేరకు నగరంలో లాక్‌డౌన్ ఉండకపోవచ్చన్నదే సీనియర్ అధికారుల అభిప్రాయం.