టెక్కీ టూ కౌన్సిలర్.. నిత్యం ప్రజాసేవలోనే..

by Shyam |   ( Updated:2021-07-14 09:57:53.0  )
టెక్కీ టూ కౌన్సిలర్..  నిత్యం ప్రజాసేవలోనే..
X

దిశ, కుత్బుల్లాపూర్: ఆమె బీఎస్సీ కంప్యూటర్స్ ​చదివారు. పెళ్లయిన తర్వాత ఎంసీఏ పూర్తి చేశారు. సాఫ్ట్​వేర్ ​ఇంజినీరుగా ఆరేండ్లు పని చేశారు. ఒరాకిల్ పీపుల్ ​సాఫ్ట్​ టెక్నికల్​ కన్సల్టెంట్‌గా విధులు నిర్వహించారు. కానీ మున్సిపల్​ ఎన్నికల బరిలో నిలిచారు. ఘన విజయం సాధించారు. కరోనా వైరస్ ​వ్యాప్తి కష్టకాలంలో ఆమె ఆపన్నులను ఆదుకుంటున్నారు. ఏడాదిగా పేదలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తూనే ఉన్నారు. ఒక్కో కుటుంబానికి 10, 15, 20 కిలోల వంతున బియ్యం, కూరగాయలు, పప్పులు తదితర వస్తువులను అందిస్తూ నిజమైన రాజకీయ సేవలో నిమగ్నమయ్యారు. ఆమె ఎవరో కాదు.. సాఫ్ట్​వేర్​ నుంచి కౌన్సిలర్​గా ఎదిగిన కందాడి జ్యోత్స్నా శివారెడ్డి. ప్రస్తుతం కుత్బుల్లాపూర్​ నియోజకవర్గం కొంపెల్లి మున్సిపాలిటీలో 11వ వార్డు కౌన్సిలర్​గా పని చేస్తున్నారు. ఆమె సేవాతత్పరతకు స్థానికుల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. రాజకీయ నాయకురాలిగా కాకుండా మానవత్వం మూర్తీభవించిన మహిళగా ఏడాదిగా నిరుపేద కుటుంబాలను ఆదుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్త ప్రచారం

సాఫ్ట్​వేర్ ఇంజినీరు నుంచి కౌన్సిలర్​గా ఎన్నికైన కందాడి జ్యోత్స్నా శివారెడ్డికి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ఆమె సేవా కార్యక్రమాలకు పేరు ప్రఖ్యాతలు లభిస్తున్నాయి. బోయిన్ పల్లికి చెందిన ఆమెకు కొంపల్లికి చెందిన నాటి ప్రజాప్రతినిధి కందాడి యాదిరెడ్డి కుమారుడు శివారెడ్డితో వివాహం జరిగింది. తన భర్త, పిల్లలంటూ ఇంట్లోనే ఉండకుండా ప్రజాసేవ చేయాలని నిర్ణయించుకుంది. తన మామ కందాడి యాదిరెడ్డి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని గత ఏడాది మున్సిపల్ ఎన్నికల్లో కొంపల్లి మున్సిపాలిటీ 11వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచారు. కొంపల్లి మాజీ సర్పంచ్ జెమ్మి నాగమణి దేవేందర్ పై భారీ మెజార్టీతో గెలుపొంది అందరి దృష్టిలో పడ్డారు. ఒక కౌన్సిలర్ గా ప్రజల్లోకి వచ్చిన ఆమెకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో ప్రజల ఫాలోయింగ్ ​ఉండడం గమనార్హం.

పుట్టిన రోజు నుంచి సేవలు

జ్యోత్స్నా శివారెడ్డి ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేస్తారు. రోజు మాదిరిగానే గతేడాది ఏప్రిల్ 12వ తేదీన ఉదయం 6 గంటల ప్రాంతంలో సినీప్లానెట్ కొంపల్లి సర్వీసు రోడ్డులో వాకింగ్ చేస్తుండగా .. ఓ వికలాంగురాలు కష్టంగా నడుచుకుంటూ వెళ్తుంది. లాక్ డౌన్ సమయంలో అంత ఇబ్బంది పడుతూ ఎక్కడికెళ్తున్నావమ్మా అని ఆమె పలుకరించగా.. మా సొంతూరు మహారాష్ట్ర, పొట్టకూటి కోసం హైదరాబాద్ వచ్చామంది. అయితే లాక్ డౌన్ వల్ల పనిలేక పస్తులుంటున్నామని, ఇంటికెళ్దామంటే డబ్బులు లేవు, రవాణా సౌకర్యం లేదని బోరున విలపించింది. చలించిన ఆమె.. ఆ వికలాంగురాలితో పాటు వచ్చిన మరో 50 మందికి భోజనం పెట్టించారు. వికలాంగురాలితో పాటు ముగ్గురు బాలింతలకు కారు సౌకర్యం
కల్పించి పంపించడంతోనే ఆమె సేవలకు పునాది వేశారు. తర్వాత ములుగు ఎమ్మెల్యే సీతక్క నుంచి అభినందనలు అందుకున్నారు. అప్పుడే ములుగులోనూ అడవుల్లో ఉండే వారిని గుర్తించి దుప్పట్లను అందజేశారు. ఇలా అప్పుడు ప్రారంభమైన జ్యోత్సాశివారెడ్డి సేవలు నేటి వరకు 70 టన్నుల బియ్యం పంపిణీ చేసి రికార్డు సృష్టించింది. ఆమెకు సేవ్ ద చైల్డ్ ఆర్గనైజేషన్, ది డొమెస్టిక్ వర్కర్స్ ఆర్గనైజేషన్ ఫౌండడర్ సిస్టర్ లీజి, జోష్ ల సహకారంతో ముందుకు నడుస్తున్నారు.

ఏడు జట్లతో సేవలు

లాక్ డౌన్ సమయంలో వ్యాపారాలు జరుగలేదు. హోటళ్లు, రెస్టారెంట్లు మూత పడ్డాయి. అయితే జ్యోత్స్నాశివారెడ్డి చేస్తున్న సేవలను గుర్తించిన కొంపల్లిలోని సైన్మా రెస్టారెంట్ యజమాని సందీప్ రెడ్డి తాము కూడా మీకు సహకరిస్తామని ప్రోత్సహించారు. అక్కడ పని చేస్తోన్న ఉద్యోగులతో ఏడు జట్లుగా ఏర్పడ్డారు. ఎక్కడ నిరుపేదలుంటారో తెలుసుకోవడం, అక్కడికెళ్లి అందించడం ఆరంభించారు. ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విధులు నిర్వహిస్తున్న పోలీసులు, ఆర్మీలకు సైతం పండ్లు, భోజన సదుపాయాలు కల్పించారు. అవసరమైన ప్రాంతాల్లో మాస్కులు, శానిటైజర్లు, ఇతర పరికరాలను అందజేశారు. మల్కాజ్ గిరిలో పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించిన కోవిడ్ వైద్యశాలకు ఉచితంగా జనరేటర్ ను అందించారు.

నిస్వార్ధ సేవే నా ధ్యేయం: కందాడి జ్యోత్స్నాశివారెడ్డి, కొంపల్లి కౌన్సిలర్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం

‘తాను అనుకోకుంటా మా మామ యాదిరెడ్డి స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. అతని సేవా దృక్పథాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్తున్నా. జీవితాంతం రాజకీయాల్లో ఉండి నిస్వార్ధంగా సేవ చేస్తాను. నా డివిజన్‌లోని ప్రజలు నన్ను ఆదరించి అఖండ మెజార్టీతో గెలిపించారు. ఇప్పటి వరకు ప్రజలకు అవసరమైన కనీస అవసరాలను తీర్చడం జరిగింది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకెళ్తా. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ప్రజల అభీష్టం మేరకు రాజకీయాల్లో పాల్గొంటాను. ప్రజల ఆదరాభిమానాలతో ఏ స్థాయికి తీసుకెళ్తే ఆ స్థాయిలో పని చేయడమే తన ధ్యేయం’ అని ఆమె అన్నారు.

Advertisement

Next Story

Most Viewed