- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చంద్రబాబా? జగనా? ఎవరి కోటరీ మాట నిజం?
‘తమలపాకుతో నువ్వొకటిస్తే, తలుపుచెక్కతో నేనొకటిస్తా’ అన్న రీతిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో తమిళనాడు మాదిరి రాజకీయ పరిణామాలు ఆంధ్రప్రదేశ్‌లో కనిపిస్తున్నాయి. అక్కడ కరుణానిధి అధికారంలో ఉండగా జయలలితపై దురుసుగా ప్రవర్తిస్తే.. ఆమె అధికారంలోకి వచ్చిన తరువాత అతనిపై దూకుడుగా వ్యవహరిస్తూ రాజకీయాలను రక్తికట్టించారు. అవే పరిణామాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో రాజకీయ పార్టీలు బహిరంగంగా కులాల పేరిట వ్యాఖ్యలు చేసుకోవడం ప్రజలను అవాక్కయ్యేలా చేస్తోంది.
1953లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పడిన తరువాత రాజకీయాల్లో ఆర్థిక, సామాజిక బలవంతులైన బ్రాహ్మణ, రెడ్డి సామాజిక వర్గాల మధ్య అధికారం ఉండేది. 1983లో ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేవరకు ఆ రెండు సామాజిక వర్గాలదే తెలుగునాట రాజకీయాల్లో ప్రధానపాత్ర ఎన్టీర్ రాజకీయ ప్రవేశంతో సమీకరణాలు మారిపోయాయి. ఎంతోమంది యువకులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆ తరువాతి కాలంలో బ్రాహ్మణ సామాజిక వర్గం నామమాత్రంగా మిగిలిపోగా కమ్మ సామాజిక వర్గం మాత్రం రాజకీయాల్లో కీలకపాత్ర పోషించింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ తరువాత ఏపీలో ఊహించని విధంగా రాజకీయాలు రెండుగా చీలిపోయాయి. ఒకటి కమ్మ సామాజిక వర్గానికి చెందినదైతే రెండోది రెడ్డి సామాజిక వర్గానికి చెందినదిగా మిగిలింది. దీంతో ఆయా పార్టీల్లో ఆ సామాజిక వర్గాలకు చెందినవారే కీలక పాత్ర పోషించారు. విపక్ష పార్టీని విమర్శించడమే సంప్రదాయంగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దీంతో అధినేతను సంతృప్తి పరిచేందుకు ఆయా కోటరీకి చెందిన నేతలు విమర్శలు గుప్పిస్తూ రాజకీయాలను రక్తికట్టించారు.
ఇప్పుడు వైఎస్సార్సీపీ అధినేత జగన్ అధికారంలోకి వచ్చారు. దీంతో ఊహించినట్టుగానే ఆయన ప్రతీకార రాజకీయాలు చేస్తున్నారని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. గతంలో తాము వ్యవహరించిన విధానాన్ని ఆ పార్టీ పూర్తిగా మర్చిపోయింది. దీంతో ప్రతీకార రాజకీయాలంటూ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తుండడంతో ‘చేసుకున్నవాడికి చేసుకున్నంత మహదేవా’ అన్నట్లుగా ఉందంటూ పలువురు కామెంట్ చేస్తున్నారు. ఈ క్రమంలో గతంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వద్ద పీఏలుగా పని చేసిన వారి నివాసాలపై జరిగిన ఐటీ దాడులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి.
ఐటీ దాడుల్లో సుమారు 3 లక్షల రూపాయలు, 20 తులాల బంగారం మాత్రమే లభ్యమైందని, వైఎస్సార్సీపీ నేతలు మాత్రం 2,000 కోట్ల రూపాయలు, బంగారం లభ్యమయ్యాయని దుష్ప్రచారం చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆవేదన వ్యక్తం చేస్తున్నది టీడీపీ నేత యనమల రామకృష్ణుడు కావడంతో వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై చంద్రబాబు, లోకేష్‌లు ఎందుకు నోరువిప్పడంలేదని వారు ప్రశ్నిస్తున్నారు. మాజీమంత్రి పుల్లారావు కూడా తన కుమారుడి కంపెనీపై ఐటీ దాడులు జరిగితే ఎందుకు మౌనంగా ఉన్నారంటూ నిలదీస్తున్నారు. టీడీపీ నేతలు చెబుతున్న మాటలే నిజమైతే సీబీడీటిపై పరువు నష్టం దావా వెయ్యగలరా? అని సవాలు విసిరారు. పచ్చమీడియా మాత్రమే ఎందుకు గొంతు చించుకుంటోందని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో రెండు పార్టీలకు చెందిన నేతలు కులాల పేరిట విమర్శణాబాణాలు ఎక్కుపెడుతుండడంతో ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయపార్టీలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ఏపీ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.
రెండు వేల కోట్ల అవినీతి జరిగిందని తాము పేర్కొనలేదని సీబీడీటీ అధికారులే ప్రెస్‌నోట్‌లో పేర్కొన్నారంటూ ఆ ప్రెస్‌నోట్ ప్రతిని వైఎస్సార్సీపీ చూపిస్తోంది. చంద్రబాబు అవినీతి బయటకు వస్తుందన్న ఆందోళనతోనే వివాదాన్ని పక్కదారి పట్టించేందుకే పవన్ కల్యాణ్ అమరావతి గ్రామాల్లో పర్యటన అని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. రాజకీయ నాయకుల ఆనారోగ్యకరమైన రాజకీయాలపట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆరోగ్యకరమైన రాజకీయాలు చేసి ఉంటే ఇప్పుడీ పరిస్థితి నెలకొనేది కాదు కదా? అంటూ టీడీపీని నిలదీస్తోంది. రెండు పార్టీలు తలోవాదన వినిపిస్తుండడానికి తోడు మీడియా సంస్థలు కూడా రెండు రకాల వాదనలు వినిపిస్తుండడంతో ఏపీవాసులు అయోమయానికి గురవుతున్నారు. ఈ రెండు పార్టీల్లో ఎవరు చెప్పేది నిజం.. బాబు కోటరీదా? జగన్ బృందానిదా? అంటూ ఏపీ వాసులు ఆరాతీస్తున్నారు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం వారు మాట్లాడుతున్నారని మండిపడుతున్నారు. ఎన్నికలకు సుదీర్ఘ సమయం ఉన్న నేపథ్యంలో ప్రజలకు పనికొచ్చే రాజకీయాలు చేయాలని వారు కోరుకుంటున్నారు. ప్రతీకార రాజకీయాల వల్ల రాష్ట్ర ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యమని వారు రెండు పార్టీలకు హితవు పలుకుతున్నారు.