ప్రత్యేక హోదా… కేంద్రానిది మళ్ళీ పాతపాటే!

by Ramesh Goud |
ప్రత్యేక హోదా… కేంద్రానిది మళ్ళీ పాతపాటే!
X

ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ఎన్ని ఒత్తిడులు ఉన్నప్పటికీ పద్నాల్గవ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారమే ఇవ్వడం కుదరడంలేదని కేంద్రం మళ్ళీ స్పష్టం చేసింది. గడచిన ఐదేళ్ళుగా ప్రత్యేక హోదాపై రాజకీయ పార్టీల మధ్య మాటలయుద్ధం జరుగుతోంది. అప్పుడు చంద్రబాబుగానీ, ఎన్నికల సమయంలో జగన్‌గానీ ఈ డిమాండ్‌నే ప్రధాన ప్రచారాస్త్రంగా వాడుకున్నారు. కానీ, ఫలితం మాత్రం ఎక్కడ వేసిన గొంగళి.. చందంగానే ఉంది. గతంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడూ, ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీ తదితరులంతా పద్నాల్గవ ఆర్థిక సంఘంపైనే నింద మోపారు. ప్రత్యేక హోదాకు ఆర్థిక సంఘం సిఫారసులే అడ్డంకి అని తప్పించుకున్నారు. ఆ సంఘంలో సభ్యుడిగా పనిచేసిన గోవిందరావు అనే ఆర్థికవేత్త మాత్రం తమ సిఫారసుల్లో అలాంటి ఆంక్ష ఎక్కడాలేదని వ్యక్తిగతంగా అభిప్రాయపడ్డారు. ఇదంతా ఇలా ఉంటే కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కుదరదని తేల్చి చెప్పారు.

నిజానికి పద్నాల్గవ ఆర్థిక సంఘం ఇకపైన ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వవద్దని చెప్పిందా? అలాంటి సిఫారసు చేస్తుందా? దానికి ఆ అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా?… ఇలాంటి ప్రశ్నలన్నింటికీ ఆ సంఘంలో ఒక సభ్యుడిగా పనిచేసిన గోవిందరావు వ్యక్తిగత హోదాలో ఒక సందర్భంలో వివరణ ఇచ్చారు. ప్రత్యేక హోదా ఇచ్చే అంశంలో ఆర్థిక సంఘానికి ఎలాంటి పాత్రా ఉండదని, ప్లానింగ్ కమిషన్ సిఫారసుల మేరకు నేషనల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఆ నిర్ణయం తీసుకుంటుంది తప్ప ఆర్థిక సంఘానికి ఎలాంటి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు. పద్నాల్గవ ఆర్థిక సంఘం సైతం ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను ఉటంకిస్తూ ప్రత్యేక హోదాపై ప్రస్తావన చేసింది.

”ఆయా రాష్ట్రాల ఆర్థిక అవసరాలు, వాటిని సమకూర్చుకోడానికి ఉన్నమార్గాలను ఆర్థిక సంఘం అధ్యయనం చేస్తుంది. మాకు ప్రభుత్వం ఇచ్చిన ‘టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్’లోనూ ఇదే చెప్పింది. ఏయే పద్దు కింద ఎంత ఆదాయం వస్తుందో, ఆదాయ వనరులు లేని కారణంగా అప్పుల భారం ఎలా పెరిగిపోతుందో పరిశీలిస్తాం. వాటి ఆధారంగా ఐదేళ్ళపాటు ఆ రాష్ట్రం ఆర్థికంగా నిలదొక్కుకోడానికి తగిన సూచనలు చేస్తాం. ఆయా రాష్ట్రాలు అమలుచేస్తున్న పన్నువిధానాలు, వాటి ద్వారా వస్తున్న ఆదాయం, పన్నేతర ఆదాయం లాంటి వాటిని అంచనా వేస్తాం. వివిధ పద్దుల కింద వస్తున్న ఆదాయం, ప్రభుత్వం చేయాల్సి ఉన్న ఖర్చు లాంటివాటిని పరిగణనలోకి తీసుకుని తగిన సిఫారసులు చేస్తాం. అందులో భాగమే కేంద్రం నుంచి ‘గ్రాంట్స్ ఇన్ ఎయిడ్’ ఎంత ఉండాలి, టాక్స్ డివొల్యూషన్ (పన్నుల్లో వాటా) ఎంత ఉండాలి లాంటి వాటిపై కేంద్రానికి స్పష్టం చేస్తాం…” అని పద్నాల్గవ ఆర్థిక సంఘం తన నివేదిక (పేరా 7.1)లో స్పష్టం చేసింది.

ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం మాత్రం ప్రత్యేక హోదా విషయంలో 14వ ఆర్థిక సంఘం సిఫారసులు అంటూ డిమాండ్‌పై తాత్సారం చేస్తోంది. గతంలో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు వెంకయ్యనాయుడు ఇదే చెప్పారు. అప్పటి ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్‌జైట్లీ ఇదే వక్కణించారు. ఇప్పుడు ఆర్థికశాఖ సహాయమంత్రిగా ఉన్న అనురాగ్ ఠాకూర్‌ కూడా ఇదే చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన ప్రకటన గెజిట్ రూపంలో విడుదల కానందువల్ల ప్రత్యేక హోదా హామీని ఇవ్వడం సాధ్యం కాదని మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొంతకాలం చెప్తూ వచ్చింది. ఆ తర్వాత పద్నాల్గవ ఆర్థిక సంఘం మీదకు నెట్టింది. ఇప్పుడు కూడా అదే పాట పాడుతోంది. ప్రత్యేక హోదాతో రాష్ట్రానికి ఒనగూరే ప్రయోజనం కంటే ఎక్కువ ఆర్థికంగా ఉపయోగపడే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటిస్తామని కేంద్రప్రభుత్వం, అప్పటి కేంద్రమంత్రులు హామీ ఇచ్చారు. ప్రత్యేక హోదా కుదరదని తేల్చి చెప్పారు. చివరకు అదే బీజేపీతో తెలుగుదేశం తెగతెంపులు చేసుకోడానికి కారణమైంది.

నిజానికి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుగానీ, ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్‌గానీ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా వినియోగించుకున్నారు. ప్రజల్లో సెంటిమెంట్లను పతాకస్థాయికి తీసుకెళ్ళారు. కేంద్రంతో కొట్లాడిగానీ, సఖ్యతతోగానీ ప్రత్యేక హోదాను సాధిస్తామని ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ హామీ ఇచ్చారు. ఏడునెలలు గడిచిపోయింది. కానీ, దాని ప్రస్తావనే లేదు. తీరా ఇప్పుడు కేంద్ర ఆర్థిక సహాయమంత్రి చెప్పనే చెప్పారు. ప్రత్యేక హోదా సాధ్యం కాదు అని. ఇక ఇప్పుడు పెదవి విప్పాల్సింది సీఎం జగన్ వంతయింది. కానీ, ఇప్పటివరకూ దాని ఊసే లేదు. ప్రత్యేక హోదాను సిఫారసు చేయాల్సిన ప్లానింగ్ కమిషన్ ఇప్పుడు అస్థిత్వంలోనే లేదు. దాని స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు.

Advertisement

Next Story