కరోనా జిల్లాలకు ప్రత్యేకాధికారులు

by  |
కరోనా జిల్లాలకు ప్రత్యేకాధికారులు
X

దిశ, న్యూస్ బ్యూరో:

కరోనా వైరస్ వ్యాప్తి, పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న జిల్లాల్లో కట్టడి చర్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సూర్యాపేట, గద్వాల, వికారాబాద్ జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో అక్కడ అదనపు పర్యవేక్షణ కోసం సీనియర్ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం ప్రత్యేక బాధ్యతలను అప్పగించింది. సూర్యాపేట జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 80కు చేరుకోవడంతో సర్ఫరాజ్ అహ్మద్‌ను, గద్వాల జిల్లాకు రోనాల్డ్ రోస్‌ను, వికారాబాద్ జిల్లాకు రజత్‌‌కుమార్ షైనీని నియమిస్తూ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆ జిల్లాల్లోని కంటైన్‌మెంట్ క్లస్టర్లలో తీసుకుంటున్న చర్యలతో పాటు వైరస్ వ్యాప్తి నిరోధానికి ఇకపైన తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలు తదితరాలపై అక్కడి జిల్లా కలెక్టర్లకు ఈ ప్రత్యేకాధికారులు తగిన సూచనలు, సలహాలు ఇస్తారు.

కరోనా కట్టడిపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించి ఉన్నతాధికారులు స్వయంగా జిల్లాల్లో పర్యటించి వైరస్ తీవ్రతను అధ్యయనం చేయాలని, లాక్‌డౌన్ అమలు ఏ విధంగా జరుగుతుందో స్వయంగా పరిశీలించి తదనుగుణంగా మార్పులు చేర్పులు చేయాల్సిందిగా సూచించారు. ఆ సూచనల్లో భాగంగానే మూడు జిల్లాలకు ప్రత్యేకాధికారులను నియమిస్తూ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

సూర్యాపేట డీఎస్పీల బదిలీ

సూర్యాపేటలో కంటైన్‌మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేసి పటిష్ట చర్యలు తీసుకుంటున్నప్పటికీ పాజిటివ్ కేసులు నమోదు కావడంపై ప్రభుత్వం ఆందోళనతో ఉంది. దీనికి తోడు లాక్‌డౌన్ నిబంధనలను పకడ్బందీగా అమలుచేయాలనుకుంటోంది. అందులో భాగంగా సూర్యాపేట సబ్ డివిజినల్ పోలీస్ అధికారి నాగేశ్వరరావును, గద్వాల ఎస్డీపీవో పాల్వాయి శ్రీనివాస్‌లను డీజీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ డీజీపీ మహేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆ స్థానంలో హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మోహన్ కుమార్‌ను సూర్యాపేటకు, రాష్ట్ర పోలీసు అకాడమీ డీఎస్పీ యాదగిరిని గద్వాల ఎస్డీపీఓగానూ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags: Telangana, Corona, DGP, Suryapet, Gawal, Special Officers, IAS

Advertisement

Next Story

Most Viewed