మైదానంలో బొమ్మల వర్షం.. దాతృత్వాన్ని చాటిన అభిమానులు!

by Shyam |
Christmas
X

దిశ, ఫీచర్స్ : డిసెంబర్ వచ్చిందంటే చాలు వీధుల్లో, ఇళ్లలో ‘క్రిస్మస్’ సందడి కనిపిస్తుంటుంది. ఈ పండుగ సందర్భంగా బహుమతులను అందుకోవడం కంటే గొప్ప ఆనందం పిల్లలకు మరొకటి ఉండదు. శాంతా క్లాజ్ నుంచి కానుకలు పొందే అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు. దీంతో స్పానిష్ ఫుట్‌బాల్ సపోర్టర్స్ పేద పిల్లల కోసం వందలాది సాఫ్ట్ టాయ్స్‌ను విరాళంగా అందించారు. ఎవరూ బహుమతి లేకుండా క్రిస్మస్ జరుపుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

స్పానిష్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్లబ్ ‘రియల్ బెటిస్’ ఆదివారం రియల్ సోసిడాడ్‌తో మ్యాచ్ ఆడింది. ఈ ఏడాది ఇదే ఆఖరి హోమ్ గేమ్‌ కావడంతో ప్లేయర్స్ అందరూ కూడా ఆడుతూ, పాడుతూ, డ్యాన్స్ చేస్తూ సరదాగా గడిపారు. 1935 నుంచి ఏ సీజన్‌లోనూ లేనంత ఉన్నత స్థితిలో సంవత్సరాన్ని ముగించడంతో ఫుల్ జోష్‌లో కనిపించారు. ఈ ఆనందం, ఉత్సాహం ఆటగాళ్లలో మాత్రమే కాకుండా అభిమానుల్లోనూ కనిపించింది. స్టాండ్స్ నుంచే తమ ఆటగాళ్లకు అభినందనలు తెలియజేయడంతో పాటు బహుమతులు సేకరించే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పాండా, ఆక్టోపస్, పోకీమాన్ వంటి అనేక సాఫ్ట్‌టాయ్స్‌ను స్టేడియంలోకి విసిరేశారు.

బ్యాటరీ బేస్డ్ గిఫ్ట్స్, భారీ బహుమతులను నేరుగా వచ్చి అందజేయవచ్చని స్టేడియంలోని వాలంటీర్లు చెప్పగా.. మిగతావారు తమ సీట్ల నుంచే మైదానంలోకి విసిరివేయవచ్చని చెప్పడంతో బొమ్మల వర్షం కురిసింది. కానుకలు అందించిన అభిమానులందరికీ క్లబ్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ధన్యవాదాలు తెలిపింది. స్టాండ్‌లో ఉన్న దాదాపు 52,158 మంది అభిమానుల సహాయంతో 19వేల కంటే ఎక్కువ టాయ్స్ అందుకున్నట్లు అంతర్జాతీయ పత్రికలు నివేదించాయి. ఈ ఆలోచనను ఇష్టపడుతున్న నెటిజన్లు ట్రెండ్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మరిన్ని స్పోర్ట్స్ క్లబ్స్, ఇతర సంస్థలు ఇటువంటి సంప్రదాయాన్ని స్వీకరించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed