భూమ్మీదకు వచ్చిన క్రూ డ్రాగన్.. చారిత్రాత్మక ల్యాండింగ్!

by Harish |
భూమ్మీదకు వచ్చిన క్రూ డ్రాగన్.. చారిత్రాత్మక ల్యాండింగ్!
X

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి బయల్దేరిన మొట్టమొదటి కమర్షియల్ క్రూ మిషన్‌కు సంబంధించిన స్పేస్‌ ఎక్స్ డ్రాగన్ క్యాప్సుల్ భూమ్మీదకు వచ్చేసింది. ఇదే మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన డాగ్ హర్లీ, బాబ్ బెంకెన్‌ మెక్సికో గల్ఫ్‌లో సురక్షితంగా దిగారు. వారి కోసం ఒక రికవరీ వెసెల్ కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. 45 ఏళ్ల క్రితం అపొలో మిషన్ తర్వాత అమెరికా నీటిలో దిగిన మొదటి క్రూ మిషన్ క్యాప్సుల్ ఇదే. క్రూ డ్రాగన్ భూమికి చేరడంతో స్పేస్‌ఎక్స్‌తో కలిసి నాసా నిర్వహించిన రెండో మిషన్ పూర్తిగా విజయవంతమైనట్లయింది. త్వరలోనే మరో రెండు క్రూ డ్రాగన్ మిషన్లకు కూడా నాసా ప్రణాళికలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే క్రూ డ్రాగన్ క్యాప్సుల్ సముద్రంలో దిగగానే, అక్కడికి ప్రైవేట్ పడవలు వచ్చి చుట్టూ చేరాయి. అప్పుడే దిగిన క్యాప్సుల్ నుంచి నైట్రోజన్ టెట్రాక్సైడ్ వంటి హానికర రసాయనాలు విడుదలవుతాయని హెచ్చరించినప్పటికీ ఐదారు ప్రైవేట్ పడవలు అక్కడికి వచ్చి చేరాయి. వారిని హెచ్చరించడమే పెద్ద సమస్యగా మారిందని నాసా అడ్మినిస్ట్రేటర్ జిమ్ బ్రిడెన్‌స్టెయిన్ అన్నారు. ఇప్పుడు మాత్రమే కాదు భవిష్యత్తులో కూడా ఎలాంటి రక్షణ లేకుండా క్యాప్సుల్ దగ్గరికి వెళ్లవద్దని, ఇంకా కొన్ని రోజుల పాటు విషవాయువులు విడుదలవుతూనే ఉంటాయని ఆయన తెలిపారు. అయితే ఇప్పటికే పదుల సంఖ్యలో పడవలు క్యాప్సుల్ చుట్టూ తిరుగుతూ ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం పెద్ద తలనొప్పిగా మారిందని జిమ్ అన్నారు.

Advertisement

Next Story