వలస కూలీల జీవితమే సోనూ పుస్తకం..

by Shyam |
వలస కూలీల జీవితమే సోనూ పుస్తకం..
X

సినీ నటుడు సోనసూద్ వలస కార్మికులను ఆదుకున్న విధానం దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. సొంత ఖర్చులతో ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యం కల్పించి వారిని సొంత ఊరికి చేర్చిన విధానం ఆయనను రియల్ హీరోను చేసింది. తన సహృదయానికి ఫిదా అయి.. సోషల్ మీడియాలో మీమ్స్ కూడా వచ్చేశాయి. ఈ నేపథ్యంలో రియల్ హీరో సోనూను.. రీల్ హీరో చేయాలని దర్శక, నిర్మాతలను డిమాండ్ చేశారు అభిమానులు. ఇవన్నీ పక్కనబెడితే, సోనూ లేటెస్టుగా రచయితగా మారబోతున్నానని ప్రకటించారు.

వలస కార్మికులతో మాట్లాడే సమయంలో వారి కష్టాలను విన్న సోనూ.. ఆ అనుభవాలను పుస్తకంలో పొందుపరిచేందుకు రచయిత అవతారం ఎత్తనున్నారు. ఈ మూడున్నర నెలలు రోజుకు 16-18 గంటల పాటు మైగ్రేంట్ వర్కర్స్‌తో గడిపిన తనను వారి బాధలు కదిలించాయని తెలిపారు. కూలీలను సొంత గ్రామాలకు తరలించే సమయంలో వారు పొందిన ఆనందం.. సంతృప్తి, సంతోషాన్ని ఇచ్చిందని, ఆ చిరునవ్వులు ప్రత్యేకమైన అనుభవాన్ని ఇచ్చాయన్నారు. వలస కార్మికులకు సాయం చేసే అవకాశం ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతలు తెలిపిన సోనూ.. వలస కార్మికుల రియల్ లైఫ్ స్టోరీస్ పుస్తక రూపంలో తీసుకొస్తున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ రాండమ్ హౌస్ ఇండియా ప్రచురించనుందని చెప్పారు.

Advertisement

Next Story