కొడుకు, కోడలు పైశాచికత్వం.. తల్లి కళ్లలో కారం చల్లి, కొడవలితో నరికి..

by Sumithra |
కొడుకు, కోడలు పైశాచికత్వం.. తల్లి కళ్లలో కారం చల్లి, కొడవలితో నరికి..
X

దిశ, నల్లగొండ : భూమి తన పేరుతో రిజిస్ట్రేషన్ చేయించాలని ఓ వృద్ధురాలిపై కుమారుడు, కోడలు కలిసి కళ్లలో కారం చల్లి, కొడవలితో తలపై మోది హత్యాయత్నం చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం పార్వతీపురం గ్రామంలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఇట్టె కిష్టమ్మ, భర్త కోటయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

వృద్ధుల పేరుతో ఇరువై ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా నాలుగు ఎకరాలు వారిపేరుతోనే ఉంచుకుని, మిగతా భూమిని ఇద్దరు కుమారులకు పట్టాచేసి ఇచ్చారు. వృద్ధులు వేరే ఇంట్లో నివసిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద కుమారుడు ఇట్టె సూరయ్య, కోడలు భూలక్ష్మికి వృద్ధుల పేరుతో ఉన్న భూమిపై కన్నుపడి, వారిని తీవ్రంగా వేధిస్తున్నారు.

2019లో ఓ సారి కిష్టమ్మపై దాడి చేయడంతో నిడమనూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదై, కోర్టు విచారణలో ఉన్నది. ఈ క్రమంలో వారిద్దరూ ఆదివారం ఉదయం కిష్టమ్మ కళ్లలో కారం చల్లి, కొడవలితో దాడి చేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి, బాధితురాలిని హుటాహుటినా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమిస్తుండటంతో మిర్యాలగూడలోనే ఆ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి విచారణ నిర్వహిస్తున్నారు.

Advertisement

Next Story