మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లిని చంపేశాడు

by Sumithra |   ( Updated:2020-12-16 06:41:36.0  )
మద్యానికి డబ్బు ఇవ్వలేదని తల్లిని చంపేశాడు
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని ఓ కొడుకు అతి కిరాతకంగా హతమార్చాడు. ఈ ఘటన రూద్రూర్ మండలం అంబం ( ఆర్) గ్రామంలో బుధవారం వెలుగు చూసింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…అంబంపేట గ్రామానికి చెందిన చిలపల్లి సాయవ్వ ( 65) తన చిన్న కుమారుడు చిన్న సాయిలు దగ్గర ఉంటోంది. కాగా సాయిలు మద్యానికి బానిసై తాగడానికి డబ్బుల కోసం భార్యను వేధించేవాడు.

దీంతో ఎనిమిది నెలల క్రితం ఇద్దరు పిల్లలతో కలిసి భార్య తన పుట్టింటికి వెళ్ళి పోయింది. దీంతో మానసిక క్షోభకు గురయ్యాడు. ఆ తర్వాత మద్యం తాగడానికి డబ్బుల కోసం తల్లి సాయవ్వను వేధించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం ఆమె దగ్గర పింఛన్ డబ్బులు ఉన్న విషయం తెలుసుకున్నాడు. ఆ డబ్బులను తాగడానికి ఇవ్వాలని తల్లిని అడిగాడు. కానీ తల్లి ససేమిరా అనడంతో తాగిన మైకంలో ఆమెను కిరాతకంగా చంపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బోధన్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Next Story