ప్రభుత్వ ఆస్తులు కాదు మీ ఆస్తులు తాకట్టుపెట్టండి: జగన్‌పై సోము వీర్రాజు ఫైర్

by srinivas |
ప్రభుత్వ ఆస్తులు కాదు మీ ఆస్తులు తాకట్టుపెట్టండి: జగన్‌పై సోము వీర్రాజు ఫైర్
X

దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శలదాడికి దిగారు. దేశంలోనే ఇలాంటి దౌర్భాగ్యమైన పాలనను చూడలేదంటూ విరుచుకుపడ్డారు. జగన్ పనితీరును చూస్తుంటే కానుకలు ఇవ్వడం, అప్పులు చేయడమే పాలనగా ఉందన్నారు. మరోవైపు సీఎం జగన్ విడుదల చేసిన జాబ్ క్యాలండర్‌పై నిరుద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. తీవ్ర నిరాశలో ఉన్నవారు అన్ని చోట్ల నిరసనలు తెలుపుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతులకు గిట్టుబాటు ధర కల్పించకపోవడాన్ని తమ పార్టీ ఖండిస్తోందన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని విమర్శించారు.

విశాఖలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తున్న సీఎం జగన్ మరి తన సొంత ఆస్తులను ఎందుకు తాకట్టు పెట్టడం లేదని ప్రశ్నించారు. విశాఖలో కొనసాగుతున్న భూకబ్జాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అలాగే మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజుపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు దారుణమన్నారు. అశోక్ కుటుంబం ఎన్నో దానధర్మాలు చేసిందని అలాంటి వ్యక్తిని విమర్శించే అర్హత వైసీపీ నేతలకు లేదన్నారు. అశోక్ గజపతిరాజులాంటి వ్యక్తులపై విమర్శలు చేసేముందు వైసీపీ నేతలు వారి స్థాయిని దృష్టిలో పెట్టుకోవాలని సోము వీర్రాజు హెచ్చరించారు.

Advertisement

Next Story

Most Viewed