పారిశ్రామిక పార్క్ భూముల సర్వేలో ఉద్రిక్తత.. కారు దగ్ధం

by Shyam |
పారిశ్రామిక పార్క్ భూముల సర్వేలో ఉద్రిక్తత.. కారు దగ్ధం
X

దిశ, మిర్యాలగూడ : ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలంలోని ఆలగడప గ్రామంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ ఉద్రిక్తంగా మారింది. 431.23 ఎకరాల భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇచ్చిన ప్రభుత్వం ప్రైవేట్ సిబ్బంది చేత భూములను సర్వే చేయిస్తున్నది. అందులో భాగంగా శనివారం సాయంత్రం కొందరు సర్వే సిబ్బంది నోటిఫై చేసిన భూముల్లో సర్వే చేస్తుండగా సర్వే బృందం కారుకు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం..

పారిశ్రామిక పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం పట్టణానికి సమీపంలో ఉన్న ఆలగడప గ్రామంలో రైతుల సాగు భూములను సేకరిస్తున్నట్లు ప్రకటించింది. కాగా, భూసర్వే కోసం హైదరాబాద్ నుంచి విరాట్ ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు చెందిన ఇద్దరు సర్వే ఉద్యోగులు శనివారం కారులో ఆలగడపకు చేరుకున్నారు. ఆయా భూములు సర్వే చేస్తుండగా.. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ప్రైవేటు సర్వే సిబ్బంది జహీరుద్దీన్, వసీంలపై దాడి చేసి వారి వాహనానికి నిప్పు పెట్టారు.

పారిశ్రామిక పార్క్ ఏర్పాటు కోసం గతంలోనే సర్వే చేయగా.. కొంత మిగిలి పోవడంతో తాము సాయంత్రం 4 గంటలకు ఆలగడపకు చేరుకొని సర్వే చేస్తుండగా.. కొందరు వ్యక్తులు వచ్చి తమపై దాడి చేసి, కారును తగులబెట్టినట్లు సిబ్బంది తెలిపారు. కొందరు రైతులు తమకు రక్షణగా నిలిచి వైద్యం చేయించినట్లు పేర్కొన్నారు.ఈ విషయం తెలుసుకున్న మిర్యాలగూడ రూరల్ సీఐ సత్యనారాయణ, ఎస్సై సుధీర్ కుమార్‌లు గ్రామానికి చేరుకుని సర్వే ప్రతినిధుల నుంచి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి వదిలేసినట్లు తెలియవచ్చింది.

Advertisement

Next Story

Most Viewed