ఆన్‎లైన్ క్లాసుల్లో అల్లరి.. టీచర్లకు తలనొప్పి..!

by Sridhar Babu |
ఆన్‎లైన్ క్లాసుల్లో అల్లరి.. టీచర్లకు తలనొప్పి..!
X

దిశ ప్రతినిధి, ఖమ్మం: ఏ తరగతి గదిలో అయినా ఒకరో ఇద్దరో అల్లరిచేసే పిల్లలు ఉంటారు. కొన్నిచోట్ల వారి అల్లరి ఎక్కువయి తరగతి గదిని డిస్టర్బ్ చేస్తూ ఆకతాయిలుగా ముద్ర వేసుకుంటారు. ఇదంతా ప్రత్యక్షంగా కాలేజీల్లోనో, స్కూళ్లలోనో పాఠాలు బోధించేవారికి, సహ విద్యార్థులకు అనుభవం అవుతుంది. కానీ ఇప్పుడు ట్రెండు మారింది కదా.. ఆన్ లైన్ క్లాసుల్లో కూడా ఆకతాయిలు దర్శనమిస్తున్నారు. కంప్యూటర్ లో లొల్లి చేస్తూ.. పాఠాలు చెపుతుంటే డిస్టర్బ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.

పాటలు, డ్యాన్సులతో వెర్రి చేష్టలు చేస్తూ మిగతా విద్యార్థులకు నష్టం చేస్తున్నారు. అసలే కరోనా నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలు మూసివేశారు. తరగతిగది పాఠాలు లేక విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆన్ క్లాసుల ద్వారా విద్య బోధన చేస్తున్నాయి కొన్ని విద్యాసంస్థల యాజమాన్యాలు. ఫలితంగా ఇప్పుడు విద్యార్థులు ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్ల ద్వారా చదువు నేర్చుకుంటున్నారు. కొవిడ్ పుణ్యమా అని విద్యా సంవత్సరం నష్టపోయిన విద్యార్థులకు ఆన్ లైన్ క్లాసుల్లో ఇప్పుడు కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. పాఠాలు వినకుండా చిల్లర వేషాలు వేసే కొందరు ఆకతాయిలు ఇప్పడు ఆన్ క్లాసుల్లో కూడా ప్రత్యక్షమవుతూ పరేషాన్ చేస్తున్నారు. వీరి చేష్టలకు కొందరు విద్యార్థులు నవ్వుకుంటుంటే.. మరి కొందరేమో సీరియస్ అవుతున్నారు. ఇలా అయితే తాము చదువుకునేదెలా అంటూ వాపోతున్నారు.

ముఖం కన్పించకుండా వెర్రి చేష్టలు..

ఆన్ లైన్ క్లాసుల్లోకి ఎంటర్ అయిన ఆకతాయిలు క్లాస్ డిస్టర్బ్ చేయడమే తమ పనిగా పెట్టుకుంటున్నారు. ముఖంపై దుస్తులు, మాస్క్ లు వేసుకుని ఫేస్ కన్పించకుండా వెర్రివేషాలు వేస్తున్నారు. పాటలు పాడడం, డ్యాన్సులు వేయడం, పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మొత్తంగా క్లాస్ జరగకుండా చేస్తున్నారు. విద్యార్థులు, సంబంధిత టీచర్లు చేసేదేం లేక క్లాస్ నే ఆపేస్తున్నారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే పనిగా వెకిల చేష్టలు చేస్తున్నారు. ఫలితంగా మెరిట్ స్టూడెంట్స్ నీరసించి పోతున్నారు. అసలే కరోనా విద్యారంగాన్ని ముంచితే ఉన్న కాస్త వెసులుబాటులో అల్లరి మూకల ప్రవర్తనతో విసిగెత్తిపోతున్నారు.

ముఖానికి మాస్క్ వేసుకుని…

సాధారణంగా ఆన్ లైన్ క్లాస్ లు జరిగేటప్పుడు కొంత సమయం ముందు విద్యార్థులకు కాలేజీ తరఫున లింక్ పంపిస్తారు. విద్యార్థులందరూ తమ కాలేజీ కోడ్ తోపాటు వారికి కేటాయించిన రూల్ నంబర్తో ఆన్ లైన్ క్లాస్ లు వింటారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అదే లింక్.. కోడ్ తో ఆకతాయిలు కూడా మధ్యలో జాయిన్ అవుతున్నారు.. ఇదెలా సాధ్యమనేది సంబంధిత కాలేజీల యాజమాన్యాలకు, విద్యార్థులకు తెలియాలి.. విద్యార్థులు అదే లింక్ ను ఎవరికైనా పంపించినా ఇది సాధ్యమవుతుందని, లేకుంటే క్లాస్ విద్యార్థులు కూడా ముఖానికి మాస్క్ వేసుకుని ఇలా చేస్తుండొచ్చని సహా విద్యార్థులు చెపుతున్నారు..

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు..

అసలే కరోనా వచ్చి పిల్లల చదువులు ఆగమయ్యాయని.. ఇప్పుడు జరిగే ఆన్ లైన్ క్లాసులకు కూడా ఆకతాయిల బెడద తప్పడం లేదంటూ విద్యార్థుల తల్లిదండ్రలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ క్లాస్ ల పేరిట యాజమాన్యాలు లక్షలు దండుకుంటున్నా పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెల్లిస్తున్నామని.. చదువుకోసమని రూ. వేలు పెట్టి ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లు కొనిస్తున్నామని ఇప్పుడేమో ఇలా జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. ఆన్ లైన్ క్లాసులను డిస్టర్బ్ చేస్తున్న ఆకతాయిలను పట్టుకోకుండా. అసలు లోపం ఎక్కడ ఉందో కనిపెట్టకుండా సంబంధిత యాజమాన్యాలు క్లాస్ నే ఆపేస్తున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని వాపోతున్నారు.. ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed