Solar Storm : భూమివైపు దూసుకొస్తున్న మరో విపత్తు.. వాటికి ముప్పు తప్పదా..?

by Shyam |   ( Updated:2021-09-06 23:33:44.0  )
Solar Storm : భూమివైపు దూసుకొస్తున్న మరో విపత్తు.. వాటికి ముప్పు తప్పదా..?
X

దిశ, ఫీచర్స్ : సౌర తుఫాను వచ్చేస్తోందంటూ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న విషయం తెలిసిందే. దీని వల్ల కొన్ని గంట‌లు లేదా కొన్ని రోజులపాటు ఇంటర్నెట్ బ్లాకవుట్ అయ్యే ప్రమాదముందని, కమ్యూనికేషన్‌ వ్యవస్థ కుప్పకూలుతుందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు అవి ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్‌లు, చమురు, గ్యాస్ పైప్‌లైన్‌లను కూడా దెబ్బతీస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఈ ఏడాది జూలైలో కూడా సౌర తుఫాను భూమి వైపు ముంచుకొస్తుంద‌ని వార్తలు రాగా అలాంటిదేం జరగలేదు. ఇంతకీ సోలార్ స్టార్మ్ అంటే ఏమిటి? దాని వల్ల భూగ్రహానికి జరిగే నష్టమేంటి? ఇది వరకు సౌర తుఫానులు వచ్చాయా? వస్తే అప్పుడేం జరిగింది..?

సౌరకుటుంబానికి మూలాధారం, కేంద్ర బిందువుగా ఉండే సూర్యుడే.. భూమి మీద జీవానికి ప్రాణాధారం. సూర్యుడి వేడి, శక్తి లేకుంటే భూమి మీద జీవమే ఉండదు. అయితే నిత్యం అగ్నిగోళంలా మండిపోయే భానుడి నుంచి ఎప్పుడూ సౌర మంటలు, సన్‌స్పాట్స్, కరోనల్ మాస్ ఎజెక్షన్‌(సీఎమ్ఈ)లు సహా సౌర తుఫానులు అంతరిక్షంలోకి విస్ఫోటనం చెందుతాయి. ఈ పేలుళ్ళ వల్ల విద్యుదావేశ కణాలు లక్షల కిలోమీటర్ల దూరం వరకు ఎగజిమ్ముతాయి. ఆ విపరీతమైన వేడిమికి అయాన్లు భూమ్యాకర్షణ శక్తివల్ల అటు వైపుగా ప్రయాణిస్తాయి. అలా ఈ వాయుగోళం 149.8 మిలియన్ కిలోమీటర్ల దూరం ఆవలలో ఉన్న భూగ్రహ ఎగువ వాతావరణం(అప్పర్ అట్మిస్పియర్)లోకి ప్రవేశించినప్పుడు, దాని ప్రభావం ఇంటర్నెట్ కేబుల్స్, ఉపగ్రహాలు, పవర్ గ్రిడ్‌లు, చమురు, గ్యాస్ పైప్‌లైన్‌లపై ఉంటుంది.

సూర్యుడి ఉపరితలం నుంచి దూసుకొచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాలనే సోలార్‌ స్మార్మ్ అని పిలుస్తారు. ఈ అయస్కాంతీకృత, విద్యుదావేశ సౌర కణాలు భూమి అయస్కాంత క్షేత్రంతో ఇంటరాక్షన్ (సంకర్షణ) చెంది బలమైన విద్యుత్ ప్రవాహాలను ప్రేరేపిస్తాయి. ఈ సౌర తుఫానులు.. అవి సంభవించిన, విడుదలైన శక్తిని బట్టి అనేక రకాలుగా ఉంటాయి. ఇందులో అత్యంత సాధారణమైనది ‘సోలార్ ఫ్లేర్’. సూర్యుడిపై సంభవించే పేలుళ్ళను ‘సన్‌ స్పాట్‌’గా పిలుస్తారు. సూర్యుని ఉపరితలం నుంచి భారీ అయనీకరణ కణాలతో కూడిన పేలుడే ‘కరోనల్ మాస్ ఎజెక్షన్ ఈవెంట్’. ఇది దాని మార్గంలో ఉన్న ప్రతి దానిపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు అయనీకరణం చెందిన కణాలు భూమి చుట్టూ తిరుగుతున్న కృత్రిమ ఉపగ్రహాలను నాశనం చేయగలవు. ఇక సౌర తుఫానుల విషయానికి వస్తే అవి చాలా అరుదుగా వస్తుంటాయి.

1859 కారింగ్టన్ ఈవెంట్..

1859, ఆగష్టు 28 – సెప్టెంబర్ 3, సోలార్ ఫ్లేర్‌ను గమనించడంతో పాటు డాక్యుమెంట్ చేసిన ఇద్దరు ఖగోళ శాస్త్రవేత్తల్లో ఒకరైన రిచర్డ్ కారింగ్టన్ పేరు మీద తొలి సౌర తుఫానుకు ఆయన పేరే పెట్టారు. ఈ సౌర తుఫాను రెండు కరోనల్ మాస్ ఎజెక్షన్లుగా వచ్చింది. రెండోవది చాలా తీవ్రంగా రావడంతో, ఇది భూ అయస్కాంత తుఫానును ప్రేరేపించింది. ఈ క్రమంలోనే ఓజోన్ పొరలో 5% విచ్ఛిన్నం చేయగా, ప్రపంచ టెలిగ్రాఫ్ వైర్ల ద్వారా ప్రవహించే విద్యుత్ ప్రవాహాలను ప్రభావితం చేసింది.

ఆరోరల్ స్మార్ట్ – 1582

తూర్పు ఆసియాలో ప్రాచీన అరోరల్ సంఘటనల రికార్డులను విశ్లేషిస్తున్నప్పుడు, శాస్త్రవేత్తలు 1582లో తీవ్ర తుఫాను సంభవించినట్లు కనుగొన్నారు. రెడ్ అరోరా సిఎమ్‌ఈల వల్ల సంభవించి ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావించారు. దీని Dst విలువలు -580 నుంచి -590 nT రేంజ్‌లో కొలుస్తారు. 16 వ శతాబ్దంలో కొన్ని అధునాతన సాంకేతికతలు ఉనికిలో ఉన్నా, ఈ తుఫాను వల్ల వాటికి ఎలాంటి అంతరాయం జరగలేదు.

కోల్డ్ వార్:

1967, మే 23న సంభవించిన ‘కోల్డ్ వార్’ సోలార్ ఫ్లేర్ అమెరికా చరిత్ర గమనాన్ని దాదాపుగా మార్చివేసింది. అప్పటికే యూఎస్, సొవియట్ యూనియన్‌ల మధ్య ప్రచ్ఛన్న పోరు నడుస్తుంది. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం, సోవియట్‌లపై వైమానిక దాడిని ఆదేశించగా, ఆ సమయంలోనే సౌర తుఫాన్ రావడంతో యూఎస్ రాడార్, రేడియో కమ్యూనికేషన్‌లు జామ్ కావడంతో అది రష్యా పనేనని భావించిన అమెరికా, దాడి నుంచి వెనక్కి తగ్గింది.

1972, 89, 2001, 2003లో సౌర తుఫానులు సంభవించాయి. అయితే 2012 జూలై 23లో ఓ సోలార్ స్మార్మ్ , నాసాకు సంబంధించిన సోలార్ టెర్రెస్ట్రియల్ రిలేషన్స్ ఆబ్జర్వేటరీ శాటిలైట్‌ను ఢీకొట్టింది. ఒకవేళ ఈ విస్ఫోటనం ఓ వారం ముందు జరిగి ఉంటే, భూమి నిజంగా అగ్నిగుండలో ఉండేదని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఆ సోలార్ సూపర్‌స్టార్మ్ మనల్ని తాకినట్లయితే, అది 2 ట్రిలియన్ డాలర్ల మేర నష్టాన్ని కలిగించేదని నాసా పేర్కొంది.

సూర్యుడు నిరంతరం జ్వలిస్తూ ఉండే అగ్నిగోళం. అయితే ఆ మంటలు ఎప్పుడూ ఉండేవే అయినా, కొన్ని సార్లు నిద్రాణంగా ఉంటే, కొన్నిసార్లు కెరటాలను తలపించేలా మంటలు ఎగిసి పడతాయి. నిద్రాణంగా కనిపించే దశను సోలార్‌ మినిమమ్‌ అని, మహోజ్జ్వలంగా మండే దశను సోలార్‌ మ్యాగ్జిమమ్‌ అని పిలుస్తారు. సాధారణంగా ఒక్కో దశలో సూర్యుడు 11 ఏళ్ల పాటు ఉంటాడు. అయితే నిద్రాణమైన సోలార్ సైకిల్ 2008 – 2019 వరకు కొనసాగగా, ప్రస్తుతం మ్యాగ్జిమమ్ దశకు చేరుకున్నాడని పరిశోధకులు చెబుతున్నారు. మినిమమ్ దశలోనూ సౌర తుఫాన్‌లు సంభవించాయి కానీ, అవి చాలా స్పల్పమైనవే కాగా ప్రస్తుత దశ మొదలైనప్పటి నుంచి.. సౌర తుఫాను వస్తుందంటూ పరిశోధకులు ఇప్పటికే పలుసార్లు చెప్పడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed