ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావొద్దు

by Sridhar Babu |
ఎమర్జెన్సీ అయితే తప్ప బయటకు రావొద్దు
X

దిశ, రంగారెడ్డి :రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలో ఇకపై పోలీసుల అనుమతి లేకుండా ఎవరూ బయటకు రావొద్దని, నిత్యావసరాల, కూరగాయలు ఇతరత్రా ఏదీ పంపిణీ చేయరాదని ఐపీఎస్ అధికారిణి రీతిరాజ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె పలు కీలక విషయాలను వెల్లడించారు. షాద్‌నగర్ పట్టణంలో సామాజిక దూరం పాటించకుండా ఈరోజు నిత్యావసర సరుకులను పంపిణీ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసినట్టు ఆమె వెల్లడించారు.ప్రభుత్వ లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా కొందరు పంపిణీలు చేస్తున్నారని, దీనివల్ల కరోనా వైరస్ వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపై ఎమర్జెన్సీ అయితే తప్ప ఎవరూ బయటకు రావొద్దని, ఒక వేళ వచ్చి దొరికితే వారిపై 188, 270, 271 సెక్షన్ల క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, అదే విధంగా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. సోషల్ మీడియా, వార్తా ప్రసార మాధ్యమాల్లో నిరాధార వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా వెంటనే కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తామన్నారు.పోలీసులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయించిన ప్రకారం కూరగాయల కొనుగోలు జరగాలని, దానికి ప్రత్యేకంగా ఆయా ప్రాంతాలను కేటాయించామన్నారు. వాటి వివరాలను ఆమె మీడియా ద్వారా అందిరికి వివరించారు. 2, 28, 16, 21 వార్డులకు చెందిన ప్రజలు వినాయక గంజ్‌లో మాత్రమే కూరగాయలు కొనుగోలు చేయాలని, అదేవిధంగా జీహెచ్‌ఆర్ గ్రౌండ్ వద్ద 5, 6, 22, 23, 28 వార్డులకు సంబంధించిన ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలని సూచించారు. అలాగే ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద 1, 27, 15 వార్డులకు సంబంధించిన వారు కొనుగోలు చేయాలని, అలాగే దత్తాత్రేయ గుడి సమీపంలో 3, 4 వార్డులకు చెందిన ప్రజలు కూరగాయలు కొనుగోలు చేయాలని స్పష్టంచేశారు.ఎవరైనా కూరగాయలు, ఇతరత్రా సరుకుల కొనుగోలు పేరుతో రోడ్లపైకి సరైన కారణం లేకుండా వస్తే వెంటనే చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారణి రీతిరాజ్ హెచ్చరించారు.

Tags :corona, no body come outside, ranga reddy, ips officer rithi raj

Advertisement

Next Story