వినూత్న న్యూస్ అగ్రిగేట‌ర్ యాప్ @ స్లిక్ టాక్స్

by Shyam |
వినూత్న న్యూస్ అగ్రిగేట‌ర్ యాప్ @ స్లిక్ టాక్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: జాతీయ, తెలంగాణ కేంద్రంగా ఆవిష్కర‌ణ‌ల్లో మరో యాప్ వినియోగదారులకు చేరువైంది. ప్రస్తుతం చిన్నా, పెద్దా తేడాలేకుండా ప్రపంచ‌వ్యాప్తంగా తాజా ప‌రిణామాల‌ను తెలుసుకునేందుకు వార్తల‌పై ఆధార‌ప‌డుతున్నారు. అయితే కొన్నిసార్లు అన‌వ‌స‌ర వార్తలు క‌నిపిస్తున్నాయి. ఇదే స‌మ‌యంలో టెక్నాల‌జీ ఆధారంగా వార్తలు పొందే తీరు ఇంకా చేరువ కాలేదు. ఈ స‌మ‌స్యల‌న్నింటికీ ప‌రిష్కారం చూపించ‌డ‌మే కాకుండా వార్తల‌తో మాట్లాడే అవ‌కాశం క‌ల్పించ‌డం, సోష‌ల్ మీడియా దిగ్గజాలైన ఫేస్ బుక్, ట్విట్టర్ ప్రత్యేక‌త‌లు ఒకే చోట పొందేందుకు అందుబాటులోకి వ‌చ్చిందే ‘స్లిక్ టాక్స్’.

ఈ యాప్ కు తెలంగాణ ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ (టీటా) స్టార్టప్ క‌మ్యూనిటీ సహకారం అందించింది. ఈ వినూత్న న్యూస్ అగ్రిగేట‌ర్ యాప్ ను బుధవారం టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మ‌క్తాల హైద‌రాబాద్ ప్రెస్‌క్లబ్లో ఆవిష్కరించారు. స్టార్టప్ కమ్యూనిటీలో భాగ‌మైన ఈ స్టార్టప్ కంపెనీకి న‌లుగురు హైదరాబాద్ టెక్కీలు మూల స్తంభాలు. ఈ న‌లుగురిలో క‌రుణాక‌ర్, అత‌ని బృందం శ‌శాంక్, యశ్వంత్‌ మరి కొందరు తెలుగు టెక్నోక్రాట్స్ క‌లిసి యాప్ రూపొందించారు. ‘స్లిక్ టాక్స్‌’ యాప్ అనేక ఇత‌ర న్యూస్ అగ్రిగేట‌ర్ యాప్‌ల‌కు విభిన్నం. వివిధ రూపాల్లో వ‌చ్చే వార్తల్లో నుంచి వినియోగ‌దారులు త‌మ‌కు న‌చ్చిన వాటిని ఎంపిక చేసుకోవ‌డంతో పాటు మ‌రెన్నో ప్రత్యేక‌త‌లు ఈ యాప్‌లో ఉన్నాయి.

నచ్చిన సమాచారం మాత్రమే..

‘స్లిక్ టాక్స్‌’ ద్వారా కేవ‌లం వార్తలను మాత్రమే అందించ‌రు. వీక్షకుల‌కు, కావాల్సిన వారికి న‌చ్చిన‌ స‌మాచారం మాత్రమే ఇవ్వనున్నారు. ఇష్టంలేని వాటిని బ్లాక్ చేసుకోవ‌చ్చు. హైద‌రాబాద్ గ్రోత్‌ అనే కేటగిరీ ఎంచుకుంటే ఈ కీవ‌ర్డ్స్ ఆధారిత సమాచారం మ‌రింత ప్రత్యేకంగా వ‌స్తుంది. ‘స్లిక్ టాక్స్’ లో యూజ‌ర్ బ్లాగ్ పెట్టుకొని త‌మ అభిప్రాయాలు పంచుకోవ‌చ్చు. అలా త‌మ‌కు న‌చ్చిన విభాగంలో త‌మ‌కున్న నాలెడ్జ్‌ ఎంద‌రితోనో పంచుకోవ‌చ్చు. ఇందుకు ‘స్లిక్ టాక్స్‌’లో అందుబాటులో ఉన్న వార్తల‌ను షేర్ చేయ‌వ‌చ్చు. ఈ యాప్ లో ఉన్న ప్రత్యేక అవ‌కాశం వీక్షకుడిని ఫాలో అవ‌డం. త‌ద్వారా త‌మలాంటి ఆలోచ‌న‌లు క‌లిగిన క‌మ్యూనిటీ ల‌భిస్తుంది.

అంతే కాకుండా ఈ క‌మ్యూనిటీ ద్వారా మిత్రులు, కుటుంబ స‌భ్యుల‌తో చ‌ర్చలు నిర్వహించ‌వ‌చ్చు. ఇప్పటి వ‌ర‌కు ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి వాటిల్లో ఉన్న ఈ సౌల‌భ్యం మొట్టమొద‌టి సారిగా న్యూస్ అగ్రిగేట‌ర్ యాప్‌లో ‘స్లిక్ టాక్స్’ ప్రవేశ‌పెడుతోంది. ఈ సంద‌ర్భంగా సందీప్ మ‌క్తాల మాట్లాడుతూ.. న్యూస్ అగ్రిగేట‌ర్ ల‌లో వార్తలు చదువుకునే ‘స్లిక్ టాక్స్‌’ ద్వారా విభిన్న అనుభూతి ద‌క్కుతుంద‌న్నారు. టీటా స్టార్టప్ క‌మ్యూనిటీ ద్వారా ఇప్పటి వ‌ర‌కు అనేక ఆవిష్కర‌ణలు వ‌చ్చాయ‌న్నారు. యాప్ గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో ఉచితంగా అందుబాటులో ఉందని పేర్కొన్నారు. bit.ly/39Ng8yI లింక్ ద్వారా ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చన్నారు.

Advertisement

Next Story

Most Viewed