అడుగు దూరంలో MLC ఎన్నికలు.. ఏకగ్రీవమా.. ఎన్నికలా..?

by Shyam |
అడుగు దూరంలో MLC ఎన్నికలు.. ఏకగ్రీవమా.. ఎన్నికలా..?
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఏకగ్రీవం కావడానికి పరిస్థితులు పూర్తిస్థాయిలో మెరుగు పడుతున్నాయి. పోటీలో ఉన్న ఒక్క అభ్యర్థిని తప్పించ గలిగితే ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు సరైన బలం లేకపోవడంతో ఆ పార్టీలు అభ్యర్థులను పోటీకి నిలపకపోవడంతో అధికార పార్టీ నేతలు తమ గెలుపు ఇక లాంఛనమే అని భావించారు. కానీ కొంతమంది ఎంపీటీసీలు తమ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ పోటీలో ఉండడానికి నామినేషన్లు వేశారు. అధికార పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు రంగంలో ఉండగా, ఎనిమిది మంది ఎంపీటీసీలు స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వీరిలో కనీసం కొందరైనా పోటీలో ఉండవచ్చునని, ఈ కారణంగా ఎన్నికలు అనివార్యం అని భావించారు. బుధవారం జరిగిన పరిణామాలు అధికార పార్టీ అభ్యర్థులకు మరింత అనుకూలంగా మారాయి.

ఆరు నామినేషన్లు తిరస్కరణ- మరొకరు ఉపసంహరణ..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులుగా సిట్టింగ్ ఎమ్మెల్సీలు దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మొత్తం 10 మంది అభ్యర్థులు 15 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. బుధవారం అధికారులు నిర్వహించిన నామినేషన్ల పరిశీలనలో సారాభాయి కృష్ణ, షేక్ రహీమ్ పాషా, మహమ్మద్ గౌస్, సంద రేణుక, బెజ్జం మల్లికార్జునరావు, మంతటి రామాంజనేయులు వేసిన నామినేషన్లు పలు కారణాలతో తిరస్కరణకు గురయ్యాయి. ఈ ప్రక్రియ పూర్తి కాకముందే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం కొండ రావు పల్లి సుధాకర్ రెడ్డి సైతం తాను వేసిన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నట్లుగా ఎన్నికల అధికారి వెంకట్రావుకు రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ వెంకట్రావు ధ్రువీకరించారు. దీనితో ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అధికార పార్టీకి చెందిన ఇద్దరు అభ్యర్థులతో పాటు, షాద్ నగర్ నియోజకవర్గంలోని కొందుర్గు మండలానికి చెందిన శ్రీశైలం స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల బరిలో నిలిచారు.

ఒక్క అభ్యర్థి తప్పుకుంటే ఏకగ్రీవమే..

ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు సక్రమంగా ఉన్న ముగ్గురు అభ్యర్థులలో ఒక్కరు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటే ఎన్నికలు ఏకగ్రీవం కానున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్న శ్రీశైలం రాష్ట్ర ఎంపీటీసీల సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎంపీటీసీల సమస్యల పరిష్కారం కోసం పోటీలో ఉంటారా..? అధికార పార్టీ నేతలు ఇచ్చే హామీలతో పోటీ నుండి తప్పుకుంటారా..? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ఉపసంహరణకు గడువు ఉండడంతో అధికార పార్టీ నేతలు స్వతంత్ర అభ్యర్థి ఉపసంహరణ కోసం ముమ్మర ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.

చక్రం తిప్పుతున్న మంత్రులు..

ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు రాష్ట్ర మంత్రులు చక్రం తిప్పుతున్నారు. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సూచనలు, సలహాలతో రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తనదైన శైలిలో ఎన్నికలను ఏకగ్రీవం చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. బుధవారం తన నామినేషన్ ఉపసంహరించుకున్న అభ్యర్థి ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఎంపీటీసీల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రులు హామీ ఇచ్చిన కారణంగానే తన నామినేషన్ ఉపసంహరించుకున్నట్లుగా వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed