ఆరుగురు జనశక్తి నక్సల్స్‌ అరెస్ట్

by Sridhar Babu |   ( Updated:2020-07-06 08:49:51.0  )
ఆరుగురు జనశక్తి నక్సల్స్‌ అరెస్ట్
X

దిశ, కరీంనగర్: సిరిసిల్ల జిల్లాలో మరోసారి పాగా వేసి కార్యకలాపాలను కొనసాగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న క్రమంలోనే, నక్సల్స్ కార్యకలాపాలను పోలీసులు కట్టడి చేశారు. జనశక్తి రాంచందర్ వర్గం పేరిట కొత్తగా ఏర్పడిన నక్సల్స్ గ్రూపు కార్యకలాపాలపై నిఘా వేసి పట్టుకున్నారు. ఈ ఆర్గనైజేషన్‌కు చెందిన వివిధ కేడర్‌ల నాయకులను అరెస్ట్ చేశారు. ఏడాది కాలంగా జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో తిరుగుతూ, పార్టీని బలోపేతం చేసేందుకు తిరుగుతున్న సీపీఐఎంల్ జనశక్తి రాంచదర్ గ్రూపుకు చెందిన ఆరుగురు నక్సల్స్‌తో పాటు, రెండు రివాల్వర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. సోమవారం సిరిసిల్ల ఎస్పీ రాహుల్ హెగ్డే మీడియాకు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. నాలుగు నెలల క్రితం సిరిసిల్ల ప్రాంతంలో పార్టీ కార్యకలాపాలు కొనసాగించాలని నిర్ణయించిన ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జి సుద్దపల్లి సుధాకర్, వేములవాడకు చెందిన ఊరడి లింగయ్య, దేశయ్యపల్లికి చెందిన కంకణాల అంజయ్యతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీకి ఆర్థిక వనరులు సమకూర్చడంతో పాటు కేడర్ నిర్మాణం చేయాలని బాధ్యతలు అప్పగించి ఆయుధాలు అప్పగించాడు. ఆ తరువాత వీరు ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లికి చెందిన బోయిని దేవయ్య అలియాస్ మురళీ, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన పయ్యావుల గోవర్దన్, నారాయణపూర్ మండలం జక్కాపూర్‌కు చెందిన అంబటి విఠల్‌లను కలిసి సమావేశం అయ్యారు. వారం క్రితం పెద్దలింగాపూర్ కు చెందిన ల్యాగల తిరుపతిని తుపాకులతో బెదిరించి రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ డబ్బులను తీసుకునేందుకు, పార్టీని బలోపేతం చేసేందుకు మండేపల్లి సమీపంలోని గుట్టపై సమావేశం అయ్యారు.

ఈ సమాచారం అందుకున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, రూరల్ సీఐ ఎండీ సర్వర్, తంగళ్లపల్లి ఎస్సై అభిలాష్‌లు పక్కా ప్లాన్‌తో దాడి చేశారు. ఈ దాడుల్లో ఆర్మూర్‌కు చెందిన ఉత్తర తెలంగాణ ఇన్‌చార్జి సుద్దపల్లి సుధాకర్, వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్‌కు చెందిన రాష్ట్ర కమిటీ సభ్యుడు ఊరడి లింగయ్య, తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లికి చెందిన జిల్లా కమిటీ సభ్యులు కంకణాల అంజయ్య, ముస్తాబాద్ మండలం రామలక్ష్మణపల్లికి చెందిన బోయిని దేవయ్య, ఇల్లంతకుంట మండలం పెద్దలింగాపూర్‌కు చెందిన పయ్యావుల గోవర్దన్, సిద్దిపేట జిల్లా నారాయణ్ పేట్ మండలం జక్కాపూర్ కు చెందిన, జిల్లా కమిటీ సభ్యుడు అంబటి విఠల్‌లను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రెండు కంట్రీ మేడ్ రివాల్వర్లు, ఐదు రివాల్వర్ రౌండ్లు, ఆరు మొబైల్ ఫోన్లు, 2 బైకులు, పార్టీ సాహిత్యం లెటర్ ప్యాడ్‌లు, మెంబర్ షిప్ బుక్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిరిసిల్ల ప్రాంతంలో నక్సల్స్ కార్యాకలాపాలు తిరిగి ఆరంభం అవుతున్న నేపథ్యంలోనే పకడ్బంధీగా వ్యవహరించి అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. ఈ గ్రూపుతో జిల్లాలో ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా లేక వీరు ఇంక ఎవరి నుంచైనా వసూళ్లకు పాల్పడ్డారా? అన్న కోణంలోనూ ఆరా తీస్తున్నామని రాహుల్ హెగ్డే వివరించారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిరిసిల్ల రూరల్ సీఐ సర్వర్ లు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed