నల్లగొండలో ఆరుగురికి కరోనా పాజిటివ్

by Shyam |
నల్లగొండలో ఆరుగురికి కరోనా పాజిటివ్
X

దిశ,నల్లగొండ:

నల్లగొండ జిల్లాలో ఆరుగురికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈనెల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లోని మర్కజ్ వద్ద జరిగిన ప్రార్థనలకు నల్లగొండ జిల్లా నుంచి 44 మంది వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు చేయగా ఇందులో ఆరుగురికి పాజిటివ్ ఉన్నట్టు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నల్లగొండ జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి జిల్లా అధికారులను ఈ విషయమై అప్రమత్తం చేశారు. నల్లగొండ డీఎంహెచ్‌వో కొండల రావు ఆధ్వర్యంలో గురువారం తెల్లవారుజామున పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను పరీక్షల నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. వీరితో పాటు వారి ఇళ్ళల్లో కిరాయికి ఉండే వారిని కూడా ఈ పరీక్షల నిమిత్తం తరలించారు. అలాగే మర్కజ్ వెళ్లి వచ్చిన తర్వాత పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారు. ఎక్కడెక్కడ తిరిగారు అన్న విషయాలను తెలుసుకొన్న అధికారులు ఆ ప్రాంతాల్లో శానిటేషన్ పనులను ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. పాజిటివ్ నిర్ధారణ అయినవారిలో నల్లగొండ పట్టణానికి చెందిన వారు ఐదుగురు, మిర్యాలగూడకు చెందిన ఒకరు ఉన్నారు. ఇందులో ఒక మహిళ కూడా ఉన్న్టట్టు అధికారులు చెబుతున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు వైద్యులు వెల్లడిస్తున్నారు. నల్లగొండ పట్టణంలో ఐదుగురికి కరోనా పాజిటివ్ బయటపడడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా కేంద్రం ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రశాంతంగా పండుగ రోజు కుటుంబ సభ్యులతో శ్రీరామనవమి వేడుకలను జరుపుకునే ఆనందంలో ఉన్న ప్రజల సంతోషం ఈ దుర్వార్తతో ఒక్కసారిగా ఆవిరైపోయింది. కాగా పోలీసులు కూడా భద్రత విషయంలో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నల్గొండ పట్టణంలోని మీర్ బాగ్ కాలానికి చెందిన ఇద్దరికీ, బర్కత్పురకు చెందిన ఒకరికి, రెహమాన్‌బాగ్ లో ఒకరికి, మన్యం చెల్కలో ఒకరికి, మిర్యాలగూడలోని ఓ మహిళకు పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులను వైద్య పరీక్షల నిమిత్తం తరలించేందుకు వెళ్లిన వైద్య సిబ్బందికి వారి నుంచి చుక్కెదురయింది. క్వారంటైన్ వెళ్లేందుకు వారు విముఖత చూపడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో పోలీసులు బలవంతంగా వారిని పరీక్షల నిమిత్తం 108 అంబులెన్స్‌లో తరలించారు. పరీక్షల అనంతరం వారిని నేరుగా క్వారంటైన్‌కు తరలిస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కొండలరావు ప్రకటించారు.

Tags: Coronavirus, positive, six members, Nallagonda, delhi markaz

Advertisement

Next Story

Most Viewed