ఇకపై రెండేళ్లకొకసారి.. సమ్మర్ తర్వాతే ఎలక్షన్స్?

by Aamani |
ఇకపై రెండేళ్లకొకసారి.. సమ్మర్ తర్వాతే ఎలక్షన్స్?
X

దిశ, బెల్లంపల్లి : సింగరేణి యాజమాన్యం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడంలో నిర్లక్ష్యం చేస్తున్నది. కేవలం ఉత్పత్తిపైనే దృష్టి సారించడం పలు విమర్శలకు తావిస్తోంది. కార్మికుల పక్షాన సింగరేణి యాజమాన్యంతో చర్చించేందుకు గుర్తింపు కార్మిక సంఘం తప్పనిసరి. వార్షిక నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యం కుంటుపడిందని, ఉత్పత్తి ఉత్పాదకత వైపు యాజమాన్యం దృష్టి సారించడంతో వేసవి తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. గుర్తింపు సంఘం ఎన్నికలను నిర్వహించాలని పలు కార్మిక సంఘాలు కేంద్ర లేబర్ కమిషనర్‌కు గత ఏడాది జూన్ నెలలో లేఖలు రాశారు. ఈ మేరకు జూలై 9న ఎన్నికలను నిర్వహించాలని కేంద్ర లేబర్ కమిషనర్ సింగరేణికి సూచించింది. కానీ, కొవిడ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో యాజమాన్యం కార్మిక సంఘాల ఎన్నికల నిర్వహణ చేపట్టలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఎన్నికలు నిర్వహించడంతో సింగరేణి మీనమేషాలు లెక్కిస్తున్నదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నారు.

నాలుగేండ్లు అవుతున్నా..

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను 2017వ అక్టోబర్ 5న నిర్వహించారు. రెండోసారి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం ఎన్నికయింది. ఈ సంఘం గడువు ముగిసి నాలుగేళ్లు అవుతున్నా యాజమాన్యం మాత్రం ఎన్నికలు నిర్వహించేందుకు సుముఖత వ్యక్తం చేయడం లేదు. కాగా, సంఘం కాలపరిమితి రెండేళ్లు కాకుండా నాలుగేళ్లుగా ఉండాలనే విషయమై పలు కార్మిక సంఘాల మధ్య భేదాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ విషయమై కేంద్ర లేబర్ కమిషనర్‌ను ఆశ్రయించాయి. లేబర్ కమిషనర్ రెండేళ్లకు ఒకసారి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని ఖరారు చేశారు. దీంతో తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించింది. విచారించిన ధర్మాసనం కేంద్ర లేబర్ కార్మిక శాఖ ఆధ్వర్యంలో కాలపరిమితి అంశాన్ని తేల్చుకోవాలని సూచించింది. కేంద్ర లేబర్ కమిషనర్ సంఘం కాలపరిమితిని రెండేళ్లు ఉండాలని పునరుద్ఘాటించారు.

సమ్మర్ తర్వాతే..

గుర్తింపు సంఘం కాలపరిమితి 2020 ఏప్రిల్ నాటికి ముగిసిందని జాతీయ సంఘాలు సైతం వెల్లడించాయి. ఎట్టకేలకు గుర్తింపు సంఘం ఎన్నికల అంశం కొలిక్కి రావడంతో యాజమాన్యం ఆచితూచి అడుగులు వేస్తూ వేసవి తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని యోచిస్తున్నది. సింగరేణి యాజమాన్యం కార్మిక శ్రేయస్సు దృష్ట్యా గుర్తింపు సంఘం ఎన్నికలను త్వరితగతిన నిర్వహించాలని పలు కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి.

Advertisement

Next Story

Most Viewed