ఆయిల్ పామ్ సాగుకు సిద్దిపేట సన్నద్ధం

by Anukaran |   ( Updated:2021-01-07 21:13:23.0  )
ఆయిల్ పామ్ సాగుకు సిద్దిపేట సన్నద్ధం
X

దిశ ప్రతినిధి, మెదక్ : ఆయిల్ పామ్ సాగుకు సిద్ధిపేట జిల్లా సిద్ధమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు కేంద్రం ఆయిల్ పామ్ సాగుకు అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు సిద్ధిపేట జిల్లాను పైలేట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. వరి, మొక్కజొన్న, పత్తి పంటలు సాగు చేస్తున్న రైతులు ప్రతియేటా నష్టపోవాల్సి వస్తోంది. ఆయిల్ పామ్ సాగు చేస్తే లాభాల బాట పడుతారని అవగాహన కల్పిస్తూ రైతుల వద్ద నుంచి వ్యవసాయ అధికారులు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మంత్రి తన్నీరు హరీశ్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి ఆదేశాల మేరకు త్వరలోనే గ్రామగ్రామనా ఏఈవోలు అవగాహన సదస్సులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.

పైలెట్ ప్రాజెక్టుగా సిద్ధిపేట జిల్లా ….

రైతులను రాజును చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు మంత్రి హరీశ్ రావు సిద్ధిపేట జిల్లా పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రైతుల కోసం ప్రవేశపెట్టే ప్రతి సం క్షేమ పథకాన్ని జిల్లాలో పకడ్బందీగా అ మలు చేయడలో హరీశ్ రావుది అందవేసిన చేయి. అందులో భాగంగానే కేంద్రం ఆ యిల్ పామ్ కు అనుమతి ఇచ్చిన వెంటనే సాగుకు జిల్లా అనువైందా కాదా అనే అంశంపై వ్యవసాయ అధికారులతో సమీక్ష నిర్వహించి సాగుకు సిద్ధమే అని చెప్పారు. దీంతో కేంద్రం జిల్లాను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.సాధారణంగా జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తుంటారు. అందులో సుమారు 50 వేల ఎకరాల్లో సాగు చేసేందుకు కేంద్రం నుంచి అనుమతి తెప్పించారు. వచ్చే వానాకాలం నాటికి రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేలా ఇప్పటి నుంచి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సాగైన తర్వాత అమ్ముకోవడానికికూడా ఎంఎస్ త్రీఎఫ్ ఆయిల్ పామ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బాధ్యతలు అప్పగించారు.

కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆశతో ….

ఆయిల్ పామ్ సాగుకు ముఖ్యంగా నీరు, తేమ ఎక్కువగా ఉండాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రంగనాయకసాగర్ ప్రాజెక్టు, అంతగిరి ప్రాజెక్టు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ ప్రాజెక్టులు సిద్ధిపేట జిల్లాలో ఉండటం.. వీటితో పాటు ఐనాపూర్ డ్యాం, తపాస్ పల్లి రిజర్వాయర్లు సైతం జిల్లాలో ఉండటం కలిసివచ్చే అంశం. వీటి పరివాహక ప్రాంతాల్లో అయిల్ పామ్ ను అధికంగా సాగుచేయొచ్చని అధికారులు నివేదికలు సమర్పించారు.

ప్రభుత్వం నుంచి సబ్సిడీ …

ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు ప్రభుత్వం సుమారు 50 శాతం రాయితీని కల్పిస్తుంది. ఒక ఎకరానికి మొక్కల ఖర్చు, ఎరువులు, అంతర పంటలు, సూక్ష్మసేద్యం కలుపుకొని రూ.62 వేలు ఖ ర్చు అవుతుండగా ప్రభుత్వం రూ.31 వేల సబ్సిడీ అందిస్తుం ది. మిగిలిన రూ.30 వేలు రైతు భరించాల్సి ఉంటుంది. ఇది నాలుగేండ్ల వరకు ప్రభుత్వం బాధ్యతనే ఉంటుంది. ఇది పోను రైతులు మొక్కలు నాటడానికి, ఇతర యాజమాన్య ఖర్చులు, కంచె ఏర్పాటు ఇతర ఖర్చులకు మరో రూ.77 వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇది మొత్తం రైతులే భరించాలి. ఇందులో ఎలాంటి ప్రభుత్వం సబ్సిడీ సాయం అందదు.

ఆయిల్ పామ్ సాగు ఇలా …

ప్రతి హెక్టారు గరిష్టంగా 143 మొక్కలు మాత్రమే నాటాలి. ఇవి కూడా త్రికోణ ఆకృతిలో నాటాలి. ప్రతి మొక్కకు మధ్య 9 మీటర్ల దూరం పాటించాలి. మొదటగా నర్సరీ ఏర్పాటు చేసుకొని ఏడాది పాటు మొక్కలు పెంచాలి. మొక్క ఎత్తు 1-1.2 మీటర్ల ఎత్తు పెరిగిన తర్వాత మనం సాగు చేయాలనుకున్న ప్రాంతంలో గుంతలు ఏర్పాటు చేసుకొని నాటాలి. ఒక్క ఎకరం వరి సాగు చేయడానికి అవసరమైన నీటిలో ఆయిల్ పామ్ ను నాలుగు ఎకరాల్లో సాగు చేయొచ్చు. అంటే ఒక్కో చెట్టుకు సుమారు రోజుకు 200-250 లీటర్ల నీరు మాత్రమే అవసరం పడుతుంది. బిందు సేద్యాన్ని ఉపయోగించడం ద్వారా నీటిని ఆదా చేయవచ్చు.మొక్కను ఒక్కసారి నాటితే 30 ఏండ్ల వరకు దిగుబడి వస్తుంది. కావున ఒక్క నాలుగేండ్ల వరకు చెట్టును కాపాడుకోగల్గితే 30 ఏండ్ల వరకు ఎలాంటి టెన్షన్ ఉండదు.

అంతర పంటలతోనూ ఆదాయం …

ఆయిల్ పామ్ సాగు మధ్యలో దూరం బాగా ఉంటుంది. ఆ ప్రాంతంలో అంతర పంటగా పత్తి, మిరప సాగు చే యొచ్చు . అయితే అంతర పంటలు సాగు చేసే సమయం లో చాలా జాగ్రత్తలు పాటించాలి. లేకుంటే ఆయిల్ పామ్ మొక్కకు నష్టం వాటిల్లుతుంది. పంట చుట్టూ కంచె ఏర్పాటు చేసుకుంటే రక్షణగా ఉంటుంది. పెన్సింగ్ బదులు వెదురుబొంగులు, టేకు వంటి చెట్లను నాటితే రూ.కోట్లలో ఆదాయం వస్తుంది.

పంట మార్పిడితో అధిక లాభాలు: శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి

సంప్రదాయ పంటలతో రైతులు నష్టపోతున్నారు. ప్రస్తుతం ఆయిల్ పామ్ పంటకు బాగా డిమాండ్ ఉంది. డిమాండ్ ఉన్న పంటలను సాగు చేస్తే రై తులు లాభ పడతారు. ఇప్పటికే రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం.మంత్రి హరీశ్ రా వు ఆదేశాల మేరకు రైతులకు ఆయిల్ పామ్ సాగుతో కలిగే లాభాల పై ఏఈవోలతో ప్రతి గ్రామంలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం.

రైతులు సద్వినియోగం చేసుకోవాలి: హరీశ్ రావు, రాష్ట్ర ఆర్థిక మంత్రి

ఆయిల్ పామ్ సాగుకు సిద్ధిపేట జిల్లాను పైలెట్ ప్రాజెక్ట్ గా ఎంపిక చేయడం సంతోషించదగ్గ విషయం.. జిల్లా వ్యాప్తంగా 50వేల ఎక రాల్లో ఆయిల్ పామ్ సాగుకు వ్యవసాయ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మనకి సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం గోదావరి జలాలు జిల్లా అంతటా అందుతున్నాయి. ఆయిల్ పామ్‌కి అనుకూల అంశం. దీన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి.

Advertisement

Next Story