సిద్ధిపేట టు ప్రగతి భవన్.. కదిలిరానున్న యువదండు

by Shyam |   ( Updated:2021-08-23 08:48:30.0  )
Pragathi Bhavan
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘త్వరలో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు’ విడుదల చేస్తామంటూ ఎలక్షన్ల క్యాంపెయిన్‌లో ప్రభుత్వం ప్రకటిస్తూనే ఉంది. అప్పుడు నాగార్జునసాగర్, దుబ్బాక, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఇప్పుడు మళ్లీ హుజురాబాద్ ఇలా నోటిఫికేషన్లు వస్తున్నాయంటూ గ్రాడ్యుయేట్‌లలో ఆశలు నింపారు. ఇలా ఎందరో యువకులు ఉద్యోగాల కోసం ఎదురు చూసి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా ఏదో ఓ చోట రాష్ట్రంలో నిరుద్యోగి ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదని యువత గమనించారు. ఉద్యోగాలు భర్తీ చేసే వరకూ ప్రభుత్వంపై పోరాటమే శరణమని భావించారు. ఈ క్రమంలో నోటిఫికేషన్ల కోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమర శంఖం పూరించేందుకు సిద్ధమయ్యారు. తమ హక్కులైన ఉద్యోగాలను సాధించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు కార్యచరణ సిద్ధం చేశారు.

రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎందరో యువకులు పుస్తకాల పురుగుల్లా ప్రిపేర్ అవుతున్నారు. ఇలా ఎదురుచూస్తూ వయసు పెరిగి చాలా ఉద్యోగాలకు అర్హత కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ క్రమంలో పీఆర్సీ కమిటీ తేల్చిన విధంగా 1.9 లక్షల ఉద్యోగాలను భర్తీచేసే విధంగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు గ్రాడ్యుయేట్లంతా సిద్ధమయ్యారు. ఇప్పటికే ప్రభుత్వంలోని మంత్రులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. మంత్రులను నిలదీసినా వారు ఆ ఊసే ఎత్తకపోవడంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు ముందుకొస్తున్నారు. ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఆగస్టు 24 న సిద్ధిపేట నుంచి నిరుద్యోగులంతా ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ప్రగతి భవన్ ముట్టడికి తరలిరావాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఈ క్రమంలో 24న జరిగే ముట్టడిపై రాజకీయంగా చర్చలు మొదలయ్యాయి. హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం నుంచే నిరసన ఉద్యమం మొదలు కావడం గమనార్హం. అంతేకాకుండా ఇప్పటివరకూ ప్రతిపక్ష నాయకుల సపోర్టును కోరిన నిరుద్యోగులు ఇప్పుడు గొంతు మార్చారు. ప్రతిపక్షాలు ఇలా ఉంటే నిరుద్యోగులుగా మిగిలిపోయే వాళ్లమా అని ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా రాష్ట్రంలో నిరుద్యోగుల ఉద్యమం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది.

ఈ అంశంపై రాష్ట్ర నిరుద్యోగ విద్యార్థి జేఏసీ చైర్మన్ భీంరావు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగ నోటిఫికేషన్ల సాధనే ధ్యేయంగా యువకులంతా నిరసనలు చేసే విధంగా కార్యచరణ చేస్తున్నట్లు తెలిపారు. మంత్రులు, ఎమ్మెల్యేలను నిలదీసే విధంగా నిరుద్యోగులంతా రోడ్డెక్కే పరిస్థితులొచ్చాయన్నారు.

Advertisement

Next Story

Most Viewed