బయటపడ్డ అధికార పార్టీ నేత భాగోతం.. లైంగిక దాడి కేసులో విస్తుపోయే నిజాలు

by Anukaran |   ( Updated:2021-10-16 02:48:48.0  )
బయటపడ్డ అధికార పార్టీ నేత భాగోతం.. లైంగిక దాడి కేసులో విస్తుపోయే నిజాలు
X

దిశ, ములకలపల్లి: ఇటీవల వెలుగులోకి వచ్చిన బాలికపై లైంగిక వేధింపుల కేసులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న అధికారపార్టీ నాయకుడు మాదిబోయిన సత్యనారాయణ వికృత చేష్టలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. సత్యంబాబు బాలికల పట్ల ఎంత నీచంగా ప్రవర్తించేవాడో తెలుసుకొని అధికారులే నివ్వెరపోతున్నారు. మొన్న వెలుగులోకి వచ్చిన కేసులో ఒక్క బాలికతో మాత్రమే అసభ్యంగా ప్రవర్తించలేదని, అణ్యం పుణ్యం తెలియని ఇద్దరి చిన్నారులతో అదే రీతిలో ప్రవర్తించడాని విచారణలో తెలినట్లు సమాచారం. అసలు నిందితుడి గత జీవితంపై స్థానికులు తెలుపుతున్న అనేక విషయాలు వినే వారిని భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఆడపిల్లల పట్ల ఇలాంటి దుర్బుద్ధి కలిగిన వ్యక్తి మా మధ్య ఉన్నాడు అంటే నమ్మశక్యంగా లేదని నివ్వెరపోతున్నారు. ఈ విషయంపై “దిశ” కొందరు స్థానికుల ద్వారా సేకరించిన పరిశోధనాత్మక కథనం.

విచారణలో విస్తుపోయే నిజాలు..

బాలికపై లైంగిక దాడి కేసులో బుధవారం పోలీసులు అదుపులోకి తీసుకున్న సత్యంబాబు నిజస్వరూపం బయటపడింది. ఆరోజు నిందితుడు ఒక్క బాలికపై మాత్రమే అఘాయిత్యానికి ఒడికట్టలేదని, మరో ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి తీవ్ర ప్రయత్నాలు చేశాడని ప్రత్యక్ష సాక్షులు.. విచారణ బృందం ముందు నిజాలను వెల్లడించారు. తల్లిదండ్రులు ఇండ్లలో లేని సమయంలో సత్యంబాబు పసిపిల్లల పట్ల ప్రవర్తించిన తీరును బాధాతప్త హృదయంతో తల్లిదండ్రులు విచారణ అధికారులకు చెప్తుంటే అక్కడే ఉన్న గ్రామస్తులు కన్నీటి పర్యంతం అయినట్లు తెలిసింది. గతంలో సత్యనారాయణ ఇదే గ్రామ పాఠశాలలో విద్యా వాలంటీరుగా పనిచేస్తున్న సమయంలో బాలికల పట్ల ఇలాగే అసభ్యంగా ప్రవర్తించేవాడని, విద్యార్థినిలతో అసభ్యంగా మాట్లాడేవాడని, అతడి బారినపడ్డ కొందరు బాలికలు చెప్పి బాధపడ్డారు. ఒక్కొక్కటిగా నిందితుడి వికృత చేష్టలు బయటపడుతుంటే ఇలాంటి వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ అన్ని వర్గాలనుంచి వ్యక్తం అవుతుంది.

బాధితులను భయపెట్టేందుకు ప్రయత్నాలు..

అభం శుభం తెలియని తమ చిన్నారుల పట్ల నిందితుడి వికృత చేష్టలకు మానసికంగా కృంగిపోయిన బాధిత కుటుంబాన్ని కొందరు భయపెట్టి కేసునుంచి తప్పుకోవాల్సిందిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కేసు విచారణకు అధికారులు వస్తారని తెలుసుకున్న సత్యంబాబు మనుషులు కొందరు “చిన్నారులను తీసుకొని విచారణకు దూరంగా వెళ్లాలని” సూచించినట్లు తెలుస్తోంది. నిందితుడి వికృత చేష్టలకు వత్తాసు పలికే కొందరు.. ఆడపిల్లల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి “పరువు పోతుంది కేసులు ఎందుకు పెట్టారు” అంటూ మానసిక క్షోభకు గురిచేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాధిత కుటుంబానికి అండగా ఉండాల్సిన సమయంలో బాధితులను ఇబ్బందులకు గురిచేయడంపట్ల ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడి పక్షాన నిలబడి సత్యనారాయణను బయటపడేసేందుకు అధికార పార్టీ నేతలు కొందరు ఇప్పటికే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి అరాచకాలకు అధికార పార్టీ అండగా నిలవడంపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed