ఆ ఎంపీ నన్ను బెదిరించాడు : లోక్‌సభ స్పీకర్‌కు నటి ఫిర్యాదు

by Shamantha N |
Amravati mp navaneet kaur
X

దిశ, వెబ్‌డెస్క్: సాక్షాత్తు పార్లమెంటు లాబీల్లోనే శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తనను బెదిరించాడని ప్రముఖ సినీ నటి, అమరావతి ఎంపీ నవనీత్ కౌర్ లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఓం బిర్లాకు ఆమె లేఖ రాశారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు గానూ సావంత్.. తనను బెదిరించారని ఆమె ఆరోపించారు.

వివరాల్లోకెళ్తే.. మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన హోంమంత్రి వసూళ్ల ఆరోపణల కేసుపై సోమవారం పార్లమెంటు ఉభయసభలు దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నవనీత్ కౌర్ కూడా మహారాష్ట్ర ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. అనంతరం ఆమె పార్లమెంటు లాబీలో ఉండగా అక్కడికి వచ్చిన సావంత్ తనను బెదిరించాడని నవనీత్ ఆరోపిస్తున్నారు. ‘నేను పార్లమెంటు లాబీలో ఉండగా శివసేన ఎంపీ అరవింద్ సావంత్ నా దగ్గరకు వచ్చి నన్ను బెదరించాడు. నువ్వు మహారాష్ట్రలో ఎలా తిరుగుతావో చూస్తాను. నేను తలుచుకుంటే నిన్ను జైళ్లో కూడా పెట్టిస్తాను..’ అని అన్నాడని ఆమె స్పీకర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.

సావంత్ బెదిరింపులు మొత్తం మహిళా లోకానికే అవమానకరమని నవనీత్ కౌర్ అన్నారు. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లేఖలను ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా పంపారు. అయితే దీనిపై అరవింద్ సావంత్ స్పందిస్తూ.. ఈ ఆరోపణలు నిరాధారమని అన్నారు. ఆమెను బెదిరించాల్సిన అవసరం తనకెందుకు ఉందని ప్రశ్నించారు. కావాలంటే లాబీల్లో సీసీటీవీ ఫుటేజీలు చెక్ చేసి వాస్తవాలను తేల్చాలని సావంత్ తెలిపారు. నవనీత్ కౌర్ గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించి ఆపై రాజకీయాల్లోకి వచ్చిన విషయం విదితమే.

Advertisement

Next Story