అమ్మాయిలను టీజ్ చేస్తే జైలుకే.. నగరంలో షీ టీమ్ నిఘా

by Sumithra |   ( Updated:2021-08-21 11:30:44.0  )
అమ్మాయిలను టీజ్ చేస్తే జైలుకే.. నగరంలో షీ టీమ్ నిఘా
X

దిశ, తెలంగాణ బ్యూరో: నగరంలో ఆకతాయిల ఆగడాలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. యువకులు బస్ స్టాపులను టార్గెట్ గా చేసుకొని అక్కడికివచ్చే మహిళలు, యువతులపై ఈవిటీజింగ్ కు పాల్పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అవగాహన కల్పించినా ఆకతాయిల్లో మాత్రం మార్పు రావడం లేదు. నగరంలో యువతులకు మరింత భద్రత కల్పించేందుకు పోలీసు శాఖ చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ‘షీ టీమ్’లను ఎక్కడికక్కడ మొహరించేలా ఏర్పాటు చేసింది. వీరంతా నగరంలోని రద్దీ ప్రాంతాలు, బస్ స్టాపులు, విద్యాసంస్థల వద్ద మకాం వేస్తుంటారు.

రాచకొండ కమిషనరేట్ పరిధిలో గత ఎనిమిది వారాల్లో 49 మంది ఈవ్‌టీజర్లను అదుపులోకి తీసుకున్నట్లు శనివారం రాచకొండ కమిషనరేట్ షీ టీమ్ ప్రకటించింది. వీరంతా కమిషనరేట్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో యువతులను, మహిళలను ఇబ్బంది పెట్టిన వారని తెలిపారు. ఇలాంటి చర్యల్లో పట్టుబడుతున్న వారిలో 18 నుంచి 22 మధ్య ఉన్న యువతే ఎక్కువగా ఉంటోందని పోలీసులు చెబుతున్నారు. ఇలా చూసుకుంటే నగరంలోని రాచకొండ పరిధిలోనే రోజుకో ఈవ్ టీజర్‌ను పోలీసులు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో స్కూళ్లు, కాలేజీలు తెరవకుండానే ఇన్నికేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇది కేవలం రాచకొండ పరిధిలోనిదే. ఇంకా సైబరాబాద్, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చూసుకుంటే భారీగా కేసులు నమోదయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రంలో విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్‌లో ఇప్పటికే కొన్ని కాలేజీల్లో తరగతులు ప్రారంభమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆకతాయిల నుంచి యువతులకు భద్రత కల్పించేందుకు షీ టీమ్‌ రంగంలోకి దిగింది. బస్ స్టాపులు, రద్దీ ప్రాంతాల్లో, పార్కులు సివిల్ డ్రెస్‌లో సాధారణ మహిళలుగా ఉండి ఈవ్ టీజర్లను అరెస్ట్ చేస్తున్నారు. స్కూళ్లు, కాలేజీలకు వచ్చే యువతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు అన్ని విధాలుగా పోలీసులు, షీటీంలు చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసు శాఖ తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed