రేపట్నుంచే షర్మిల పాదయాత్ర.. కానీ, ఆ విషయంలో నో క్లారిటీ

by Anukaran |   ( Updated:2021-10-18 11:24:11.0  )
రేపట్నుంచే షర్మిల పాదయాత్ర.. కానీ, ఆ విషయంలో నో క్లారిటీ
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైఎస్సార్​టీపీ చీఫ్​షర్మిల తండ్రి బాటలోనే నడిచేందుకు సిద్ధమయ్యారు. రాజన్న రాజ్య స్థాపనే ధ్యేయంగా తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్ షర్మిల సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈనెల 20వ తేదీన తన పాదయాత్రను ప్రారంభించనున్నారు. తన తండ్రి సెంటిమెంట్​గా భావించే చేవెళ్ల నుంచే ఈ యాత్ర చేపట్టనున్నారు షర్మిల. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు యాత్రను కొనసాగించనున్నారు. 90 అసెంబ్లీ నియోజకవర్గాలు, 14 పార్లమెంట్​నియోజకవర్గాల్లో ఈ యాత్ర సాగనుంది. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పర్యటించనున్నారు.

ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు.. తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు యాత్ర ఉంటుంది. ఈ యాత్రలో భాగంగా స్థానికంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ముందుకు సాగనున్నారు. కాగా చేవెళ్లలో ఉదయం 10.30 గంటలకు వైఎస్సార్​విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం షర్మిల భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అనంతరం చేవెళ్ల, శంషాబాద్, మహేశ్వరం, కందుకూరు, ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం మీదుగా పాదయాత్ర సాగనుంది.

పాదయాత్ర అంటేనే గుర్తు వచ్చే పేరు వైఎస్సార్. ఆయనకు ముందు, తర్వాత ఎంతమంది యాత్రలు చేసినా వైఎస్సార్ కే ప్రజల్లో ఆదరణ ఎక్కువగా దక్కింది. అందుకే ఆయన తనయ షర్మిల సైతం ప్రభుత్వ విధివిధానాలకు వ్యతిరేకంగా పోరాడేందుకు పాదయాత్రనే అస్త్రంగా ఎంచుకున్నారు. వైఎస్సార్​యాత్ర సందర్భంగా ప్రజల కష్టాలను నేరుగా వెళ్లి తెలుసుకున్నట్లే షర్మిల కూడా అదే విధానాన్ని అనుసరించనున్నారు. వైఎస్సార్​తన యాత్రలో నిరుపేదలు తమ బిడ్డలను చదివించేందుకు పడుతున్న కష్టాలను చూసే ఫీజు రీయింబర్స్​మెంట్ ద్వారా ఉచిత విద్యను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ, 108, జలయజ్ఞం వంటి ఎన్నో పథకాలను అమలు చేశారు. ఇదే పంథాలో షర్మిల సైతం వెళ్లాలని డిసైడ్​అయ్యారు. రాష్ట్రం ఏర్పడితే బతుకులు బాగుపడ్డాయా.. తెలంగాణ ప్రజలు, నిరుద్యోగుల కలలు నిజమయ్యాయా? అని తెలుసుకునేందుకు షర్మిల యాత్రను చేపడుతున్నారు.

పార్టీ ఆవిర్భావం నాడే మరో 100 రోజుల్లో పాదయాత్ర చేస్తానని చెప్పిన షర్మిల ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు కొనసాగించి ప్రజల సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఆమె సిద్ధమయ్యారు. అంతేకాకుండా తన పార్టీ అధికారంలోకి వస్తే ఏయే పథకాలు అందుబాటులోకి తెస్తామో ఆమె ప్రజలకు వివరించనున్నారు. వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల రాబోయే ఎన్నికలకు ఇదే యాత్రను అస్త్రంగా పెట్టుకున్నారు. ఈ యాత్ర చేపట్టడం ద్వారా సమస్యలు తెలుసుకోవడంతోపాటు ఎన్నికల ప్రచారం కూడా ఒకేసారి పూర్తి చేయొచ్చని ఆమె భావిస్తున్నారు.

తండ్రి అడుగుజాడల్లో నడిచి తన అన్న జగన్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో 18 అక్టోబర్ 2012లో ప్రజా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించి 14 జిల్లాల్లో 116 నియోజకవర్గాలు, 2250 గ్రామాల్లో 230 రోజులపాటు షర్మిల పర్యటించారు. 3,112 కిలోమీటర్ల దూరం యాత్ర చేపట్టిన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. సోమవారం నాటికి ఈ యాత్ర చేపట్టి తొమ్మిదేళ్లు పూర్తయింది. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయలో ప్రారంభమైన ఈ యాత్ర దాదాపు 9 నెలలపాటు కొనసాగి 4 ఆగస్టు 2013లో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. అయితే షర్మిల చేపట్టిన 3,112 కిలోమీటర్ల రికార్డును తనే తిరగరాయాలని ప్రణాళికలు చేసుకున్నారు. కేవలం తెలంగాణలోనే దాదాపు 4000 కిలోమీటర్లు తిరిగేందుకు ఆమె సిద్ధమయ్యారు.

చేవెళ్ల నియోజకవర్గానికి వైఎస్ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. చేవెళ్ల నుంచి 2003లో ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఇక్కడి నుంచే పాదయాత్ర ప్రారంభించారు. ఉమ్మడి ఏపీలో ఆయన 1,467 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. పాదయాత్రతో రాజశేఖర్‌రెడ్డికి జనాదరణ లభించడమే కాకుండా ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.

రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర చేయడం వల్ల ముఖ్యమంత్రి స్థానానికి ఎలాంటి పోటీ లేకుండా ఆయనే సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వ కార్యక్రమాలు దాదాపుగా అక్కడి నుంచే ప్రారంభించారు. తిరిగి 2009లో ఎన్నికల ప్రచారాన్ని కూడా చేవెళ్ల నుంచే ప్రారంభించి రెండోసారి సీఎం కుర్చీలో వైఎస్సార్ కూర్చున్నారు. అందుకే అదే సెంటిమెంట్ ను కొనసాగించాలని షర్మిల నిర్ణయించుకుంది. ఇదిలా ఉండగా తన తండ్రి సెంటిమెంట్ ను ఏపీ ముఖ్యమంత్రి జగన్ సైతం కొనసాగించారు. 9 ఏప్రిల్ 2003న వైఎస్సార్ పాదయాత్ర ప్రారంభించారు. అయితే జగన్ కూడా 2010లో ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే తన తండ్రి వైఎస్సార్ కు కలిసి వచ్చినట్లే తనకు కూడా ఈ సెంటిమెంట్ కలిసి వస్తుందో లేదో వేచిచూడాల్సిందే.

నేడు ఇడుపులపాయకు షర్మిల

20వ తేదీన పాదయాత్ర ప్రారంభంకానున్న నేపథ్యంలో షర్మిల తన తండ్రి సమాధి వద్ద నివాళులర్పించేందుకు మంగళవారం ఇడుపులపాయకు వెళ్లనున్నారు. షర్మిలతో పాటు తన తల్లి విజయమ్మ సైతం వెళ్తున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో వారు కడపకు చేరుకుంటారు. అదేరోజు సాయంత్రం తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని 20వ తేదీన చేవెళ్ల పాదయాత్రకు వెళ్తారు.

ఇదిలా ఉండగా నిరుద్యోగుల్లో భరోసా కల్పించేందుకు ప్రతి మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్షలను షర్మిల చేపడుతోంది. కాగా పాదయాత్రలోనూ ఈ దీక్షలను యథావిధిగా కొనసాగించాలని షర్మిల నిర్ణయించింది. ఇదిలా ఉండగా పాదయాత్ర ప్రారంభం నేపథ్యంలో ఈ మంగళవారం నిర్వహించే నిరాహారదీక్షను ఆమె రద్దు చేసుకున్నట్లు లోటస్​పాండ్​వర్గాలు వెల్లడించాయి. ఏడేళ్లలో ప్రభుత్వం నిరుద్యోగులకు, రైతులకు ఏం చేశారో కేసీఆర్​సమాధానం చెప్పాలని ఆమె యాత్రలో భాగంగా ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు.

షర్మిల పాదయాత్రకు తల్లి మద్దతు

తెలంగాణలో షర్మిల చేపడుతున్న పాదయాత్రకు తల్లి విజయమ్మ తన మద్దతు తెలిపింది. రాజన్న రాజ్య స్థాపన కోరుకునే ప్రతి ఒక్కరూ తన బిడ్డకు తోడుగా నిలిచి పాదయాత్రను విజయవంతం చేయాలని ఆమె కోరింది. ప్రతి ఒక్కరూ ఈ యాత్రకు తరలిరావాలని ఒక వీడియో రూపంలో విజయమ్మ కోరింది.

‘పీకే’ టీం రాకపై నో క్లారిటీ

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్​కిశోర్​టీం వైఎస్సార్​తెలంగాణ పార్టీకి పనిచేస్తుందని, త్వరలోనే ‘పీకే’ టీం వస్తుందని గతంలో ఎన్నోసార్లు వైఎస్సార్​టీపీ నేతలు వెల్లడించారు. విజయమ్మ సైతం లోటస్ పాండ్​ వర్గీయులతో గతంలో చెప్పారు. కాగా, ఇటీవల షర్మిల సైతం ‘పీకే’ సాయం తీసుకోవడంలో తప్పేంటని ఒక చానల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. కాగా సెప్టెంబర్​మొదటి వారం నుంచే ప్రశాంత్ కిశోర్​టీం పూర్తిస్థాయిగా పార్టీ కోసం పని చేస్తుందని పార్టీ శ్రేణులు చెప్పినప్పటికీ నేటికీ వారు రాకపోవడం గమనార్హం. బుధవారం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతున్నా వారి రాకపై స్పష్టత లేదని నేతలు చెబుతున్నారు.

Advertisement

Next Story