‘రాజన్న యాదిలో వైఎస్సార్ జెండా పండుగ’లో కార్యకర్తలకు షర్మిల దిశానిర్దేశం

by Shyam |
YS Sharmila
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సంక్షేమ పాలన తెచ్చే జెండా తమదేనని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల అన్నారు. ‘రాజన్న యాదిలో వైఎస్సార్ జెండా పండుగ’ కార్యక్రమాన్ని గురువారం లోటస్ పాండ్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత ఆమె తన మొదటి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో రాజన్న సంక్షేమ పాలన మళ్లీ తీసుకురావడమే తమ ఎజెండా అని స్పష్టం చేశారు.

ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్, పోడు భూములకు పట్టా అందించిన ఘనత తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కే దక్కిందన్నారు. ఆయన సంక్షేమ పాలన నుంచే జెండా పుట్టుకొచ్చిందని ఆమె తెలాపారు. పాలపిట్ట రంగు విజయానికి సూచిక అని అన్నారు. అందుకే దసరా రోజు ఆ పక్షిని చూసేందుకు ఉత్సాహం కనబరుస్తారని, తమ పార్టీ జెండాను చూసినా రెట్టింపు సంతోషం కలగాలనే ఉద్దేశ్యంతోనే పాలపిట్ట రంగు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. ఇక నీలి రంగు సమానత్వాన్ని సూచిస్తుందని, సమానత్వం కోసం పోరాటం చేసిన అంబేడ్కర్ నినాదమే పార్టీ సిద్ధాతమన్నారు. పాలనలో అందరికీ భాగస్వామ్యం, అన్ని వర్గాలకు సమన్వాయం చేయడమే నీలి రంగు ఉద్దేశ్యమని షర్మిల స్పష్టం చేశారు.

వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి ఒక్క వర్గానికి దక్కిందని, ఆ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని తిరిగి కలిసి తాము వస్తున్నట్లుగా చెప్పాలని వైఎస్సార్ అభిమానులు, కార్యకర్తలకు షర్మిల సూచించారు. నెల రోజుల పాటు గ్రామగ్రామాన జెండా పండుగ నిర్వహించాలన్నారు. తెలంగాణలో 35 ఏండ్లు పైబడిన వారందరికీ వైఎస్సార్ సంక్షేమ పాలన తెలుసని, అయితే వారందరికీ తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో వివరించాలన్నారు. 35 ఏండ్లు లోబడి ఉన్నవారికి వైఎస్సార్ సంక్షేమ పాలన ఎలా ఉందో తెలపాలని సూచించారు. పార్టీ ఆవిర్భవించకముందే ప్రజల పక్షాన నిలబడి పోరాడామని, ఏ ప్రతిపక్షం చేయని విధంగా నిరుద్యోగుల కోసం పోరాటం చేశామని గుర్తుచేశారు. వీటి ఫలితంగానే కేసీఆర్ ప్రభుత్వానికి భయం కలిగిందని, ప్రతిపక్షానికి సోయి వచ్చిందని విమర్శలు చేశారు. ప్రజల పక్షాన పోరాడితేనే ప్రజలు ఆదరిస్తారని షర్మిల అన్నారు. మనం ప్రజల కోసం ఉన్నామంటే వాళ్లే.. అధికారాన్ని మన చేతిలో పెడుతారని పేర్కొన్నారు.

కాళేశ్వరం గురించి ప్రభుత్వం ఎన్నో గొప్పలు చెబుతోందని, అసలు జలయజ్ఞానికి శ్రీకారం చుట్టిందే వైఎస్సార్ అని ప్రజలకు చెప్పాలని షర్మిల సూచించారు. స్థానికంగా మీమీ నియోజకవర్గాలు, గ్రామాల్లో ఉన్న సమస్యలపై పోరాడాలని, ధర్నాలు, దీక్షలు, రాస్తారోకోలు చేసి ప్రజల పక్షాన నిలవాలన్నారు. అప్పుడే పార్టీ బలోపేతమువుతుందని షర్మిల నాయకులకు సూచించారు. వైఎస్సార్ పోరాట పటిమ అందరికీ స్ఫూర్తిగా నిలవాలని అన్నారు. ఇప్పుడు మీకు పార్టీలో పదవులు వచ్చాయని సంతోషపడొద్దని, రాలేదని నిరాశ చెందకూడదని షర్మిల వివరించారు. భవిష్యత్ మొత్తం వైఎస్సార్ టీపీదేనని, కష్టపడి పనిచేసిన వారికి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు.

వైఎస్సార్ మరణించిన అనంతరం 12 ఏండ్లు ఆయన అభిమానులు తమ కుటుంబం కోసం వారి జేబుల్లోంచి డబ్బులు తీసి మరీ ఖర్చుపెట్టారని, ఆ సమయంలో చాలామందికి గుర్తింపు దక్కలేదన్నారు. గతాన్ని చూసి భవిష్యత్ మీద ఆశ కోల్పోవడం మూర్ఖత్వమే అవుతుందని తెలిపారు. తాను నిలబడటమే కాకుండా.. తనను నమ్ముకున్న అందరినీ నిలబెడతానని ఆమె నాయకులకు మాటిచ్చారు. పార్టీలోకి కొత్తవారిని ఆహ్వానించాలని, కొత్తవారు వస్తున్నారని పాత నాయకులు బాధపడకూడదన్నారు. అందరినీ గుర్తు పెట్టుకొని న్యాయం జరిగేలా చూస్తానని షర్మిల చెప్పారు. ఈ సమావేశం అనంతరం లోటస్ పాండ్ ఎదుట పార్టీ జెండాను ఆమె ఆవిష్కరించారు.

Advertisement

Next Story