కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల ఫైర్

by Shyam |
కేసీఆర్ ప్రభుత్వంపై షర్మిల ఫైర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలో కొత్త పార్టీ పేరును ప్రకటించనున్న క్రమంలో.. ఇవాళ ముస్లిం, మైనార్టీలతో హైదరాబాద్‌లోని లోటస్​పాండ్‌లో వైఎస్ షర్మిల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వైఎస్సార్‌కి ముస్లింలంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేదని, ఉన్నత ఉద్యోగాల్లో ముస్లింలు ఉన్నారంటే అందుకు కారణం తన తండ్రేనని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులతో సమానంగా ముస్లింలకు స్కూళ్లు కట్టించి ఫీజు రీయింబర్స్​మెంట్ అందించారని ఆమె అన్నారు. అర్హులైన విద్యార్థులకు స్కిల్ డెవలప్​మెంట్​కింద రూ.40వేలు అందించి నైపుణ్యాభివృద్ధికి తన తండ్రి ఎంతో కృషి చేశారన్నారు. రెండు లక్షల మంది ముస్లింలకు రుణమాఫీ చేయడమే కాకుండా.. పేద ఆడ బిడ్డలు ఇంటికి భారం కాకూడదని ఆర్థికసాయం అందించాలని ఆలోచన చేసింది వైఎస్సారేనని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వక్ఫ్ భూములను కాపాడిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందన్నారు. ఓల్డ్ సిటీలో ఎక్కువ శాతం ముస్లింలే ఉన్నారని, అక్కడ డ్రైనేజీలు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుంటే నిధులు కేటాయించి డ్రైనేజీల ఏర్పాటు చేవారని ఆమె గుర్తుచేశారు. గంగా-జమున తహెజీబ్ అనే మాటలకే నేటి పాలకులు పరిమితమయ్యారని, ముస్లింలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలని కోరుకున్న మహోన్నత వ్యక్తి వైఎస్సార్​అని తెలిపారు.

12 శాతం రిజర్వేషన్​ ఏమైంది?

తెలంగాణలో ముస్లింల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని, టీఆర్‌ఎస్​ప్రభుత్వం వారికి 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి మోసం చేసిందని షర్మిల మండిపడ్డారు. పాతబస్తీలో ఇప్పటివరకు ఏదైనా అభివృద్ధి జరిగిందా? అంటూ ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాష్ట్ర సాధనలో ముస్లింల పాత్రను సర్కార్​ మరిచిపోయిందని, నేటికీ వాళ్ల బతుకులు మారలేదని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ముస్లింలకు వైఎస్సార్​నాలుగు శాతం రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన మాటను నిలుపుకున్నారని, కేసీఆర్​మాత్రం హామీలకే పరిమితమయ్యారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రం ఓటు బ్యాంకుగా.. కేంద్రం హేట్​బ్యాంకుగా..

తెలంగాణ వ్యాప్తంగా వక్ఫ్​బోర్డుకు సంబంధించిన భూములు 77 వేల ఎకరాలున్నాయని, అందులో 55 వేల ఎకరాలు కబ్జా అయ్యాయని షర్మిల తెలిపారు. ఇప్పటి వరకు అన్యాక్రాంతమైన భూములను అప్పగించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రప్రభుత్వం ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తుంటే.. కేంద్ర ప్రభుత్వం హేట్ బ్యాంక్‌గా చూస్తోందని విమర్శించారు. అన్యాక్రాంతమైన భూములు తిరిగి వక్ఫ్​బోర్డుకు అప్పగించేందుకు తాను పోరాడుతానని, అందుకు అందరూ ఏకం కావాలని షర్మిల పిలుపునిచ్చారు.

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన వైఎస్సార్​సీపీ నాయకులు షర్మిలను మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే వైఎస్ రాజశేఖర్​రెడ్డి అభిమాన సంఘం సభ్యులు లోటస్​పాండ్​వద్దకు భారీగా తరలివచ్చి బాణాసంచా కాల్చారు.

Advertisement

Next Story

Most Viewed