మరోసారి లాభాల్లో మార్కెట్లు!

by Harish |
మరోసారి లాభాల్లో మార్కెట్లు!
X

దిశ,వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా నాలుగో సెషన్‌లో లాభాలను నమోదు చేశాయి. అమెరికా ఉద్దీపన ప్యాకేజీకి ట్రంప్ ఆమోదించడం, కొవిడ్-19 వ్యాక్సిన్‌కు సంబంధించి సానుకూల పరిస్థితులతో మదుపర్ల సెంటిమెంట్ బలంగా ఉందని, దీంతో ఆసియా మార్కెట్లతో పాటు దేశీయ మార్కెట్లు కూడా లాభాల్లో ర్యాలీ చేశాయని మార్కెట్ నిపుణులు తెలిపారు.

2020 ముగింపుతో పాటు, దశాబ్దం ముగియడానికి కొద్ది రోజులు మాత్రమే ఉండటంతో పెట్టుబడిదారులు రానున్న ఏడాదికి సంబంధించి ట్రేడ్ ప్రణాళికలను ప్రారంభిస్తున్నారు. ఎక్కువగా ఉత్పత్తి రంగాలపై దృష్టి సారిస్తుండగా, కొందరు ఫైనాన్స్ రంగంపై దృష్టి సారించారు. ఈ క్రమంలో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 380.21 పాయింట్లు ఎగసి 47,353 వద్ద ముగియగా, నిఫ్టీ 123.95 పాయింట్లు లాభపడి 13,873 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఇండెక్స్ 3 శాతం పుంజుకోగా, మెటల్, రియల్టీ, ఫైనాన్స్, ప్రైవేట్ రంగ బ్యాంకులు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, సన్‌ఫార్మా షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన అన్ని షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ముఖ్యంగా టైటాన్, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, ఆల్ట్రా సిమెంట్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఆటో షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.55 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed