సీబీఐ కస్టడీకి శంకర్‌రెడ్డి.. ఉత్తర్వులు ఇచ్చిన  పులివెందుల కోర్టు 

by srinivas |
CBI
X

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా అతడిని 8 రోజులు కస్టడీకి అప్పగించాలంటూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన పులివెందుల కోర్టు శివశంకర్ రెడ్డిని సీబీఐ కస్టడీకి అనుమతించింది. 7 రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబరు 2 వరకు శివశంకర్‌రెడ్డిని సీబీఐ కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనుంది. ప్రస్తుతం శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.

కేసులో కీలక నిందితుడు దస్తగిరి వాంగ్మూలం బయటకు వచ్చిన తర్వాత శివశంకర్‌రెడ్డిని సీబీఐ నవంబరు 17న హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వివేకాను హత్యచేస్తే శివశంకర్‌రెడ్డి రూ.40 కోట్లు ఇస్తాడంటూ ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చారు. దీంతో ఈ నెల 15న కడపలో విచారణకు హాజరుకావాలని శివశంకర్‌రెడ్డికి సీబీఐ సమాచారం ఇచ్చిన హాజరు కాలేదు. దాంతో సీబీఐ ప్రత్యేక బృందం హైదరాబాద్‌లో ఆయనను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed