- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ట్రబుల్స్‌లో ఆర్టీసీ.. టెన్షన్‌లో ఉద్యోగులు
దిశ, గోదావరిఖని : టిక్కెట్లు కొట్టాల్సిన చేతులు.. మూటలు పట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. లెక్కలు రాయాల్సిన కండక్టర్లు.. లేఖలు రాసే పరిస్థితి ఏర్పడింది. అరకొర జీతాలతో బతుకు బండి లాగించే స్థితి ఆర్టీసీ ఉద్యోగులకు ఏర్పడింది. అలాంటి భద్రత లేని బ్రతుకులకు మొదటికే మోసం వచ్చింది. కరోనా లాక్‌డౌన్ ప్రభావం అద్దె బస్సుల ఉద్యోగులపై పడడంతో అర్ధాంతరంగా రోడ్డున పడ్డారు. ఆర్టీసీలో అద్దె బస్సులు నడవక ఎటువంటి పని లేక ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నారు.
కరోనా అన్ని వర్గాల ప్రజలను సమస్యల్లోకి నెట్టింది. అన్ని రంగాలలోనూ కోలుకోలేని దెబ్బ తీసింది. ఈ ప్రభావంతో ప్రైవేట్ బస్సుల యజమానులు తీవ్రంగా నష్టపోతున్నారు. లాక్‌డౌన్‌లో బస్సులన్నీ మూలకు చేరి వ్యాపారం నిలిచిపోయింది. వీటిపై ఆధారపడ్డ ఎంతో మంది డ్రైవర్లు క్లీనర్లు ఉపాధి లేక దిక్కుతోచని స్థితిలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమయానికి వాహనానికి సంబంధించిన ఫైనాన్స్ డబ్బులు కట్టేందుకు కూడా డబ్బులు లేక అప్పులు పుట్టక యజమానులు అయోమయానికి గురవుతున్నారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కొవిడ్-19 ఆర్టీసీని తీవ్రంగా దెబ్బతీసింది. దీనికి తోడు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు ఉన్న ఆదాయాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు రోడ్డుపై తిరుగుతున్నప్పటికీ కొవిడ్ నివారణలో భాగంగా తీసుకున్న చర్యలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. కరోనా లాక్‌డౌన్‌తో ఆర్టీసీ భారీ నష్టాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కరోనాకు ముందు ఆర్టీసీ బస్సులు 84 ఉండగా ప్రైవేటు బస్సులు 46. మొత్తం 130 బస్సులు నడవగా ప్రతిరోజు 18 నుంచి 20 లక్షల రూపాయల వరకు ఆదాయం వచ్చేది. ఇందులో అన్ని బస్సులకు గాను ప్రతీ రోజు డీజిల్‌కు సుమారుగా 10 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యేది. లాక్‌డౌన్, కరోనా కంటే ముందు ప్రతీ ఆర్టీసీ ఉద్యోగికి ఒకటో తేదీ నుంచి 5వ తేదీ లోపు ఉద్యోగుల జీతాలు వారి ఖాతాల్లోకి జమ అయ్యేవి. కానీ, ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు 16వ తేదీ తర్వాత వారికి జీతాలు జమ అవుతున్నాయి.
మొత్తం గోదావరిఖని ఆర్టీసీ డిపోలో 630 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే, లాక్ డౌన్ సమయంలో బస్సులు నడవక ఉద్యోగుల జీతాలకు నానా ఇబ్బందులు ఎదురయ్యాయి. అనంతరం రెండోసారి లాక్‌డౌన్ నేపథ్యంలో ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను నడిపించగా ప్రతీ రోజు 16 లక్షల లోపు ఆదాయం వచ్చింది. ఆ తర్వాత ఆర్టీసీకి వస్తున్న నష్టాన్ని సమకూర్చేందుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న 10 ఆర్టీసీ డిపోల్లో ఉన్న ప్రైవేటు బస్సులను పక్కన పెట్టడంతో వాటిపై ఆధారపడ్డ ఎంతో మంది జీవితాలు రోడ్డున పడ్డాయి.
ప్రస్తుతం గోదావరిఖని ఆర్టీసీ డిపోలో 84 బస్సులు నడుస్తుండగా ప్రతీ రోజు 12 నుంచి 14 లక్షల రూపాయలు ఆదాయం వస్తుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. దీనిలో ప్రతీ రోజు డీజిల్‌కు ఎనిమిది లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం 620 మంది ఉద్యోగులు గోదావరిఖని ఆర్టీసీ డిపోలో పనిచేస్తున్నారు. వీరికి ప్రతీ నెల సుమారు 3 కోట్ల రూపాయల జీతభత్యాలు చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్టీసీలో ఏర్పాటుచేసిన కార్గో సర్వీసుల్లో పది మంది సిబ్బంది పని చేస్తున్నారు. గోదావరిఖని ఆర్టీసీ కార్గో సర్వీస్‌లో ప్రతి రోజు కు 15 వేల రూపాయల ఆదాయం వస్తుందని అధికారులు తెలిపారు.
ఆర్టీసీలో ఉద్యోగ నోటిఫికేషన్ కరువు.?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 10 ఆర్టీసీ డిపోలు ఉండగా పెద్దపెల్లి జిల్లాలో రెండు డిపోలు ఉన్నాయి. వీటిలో 2012వ సంవత్సరంలో సూపర్ వైజర్లు, కండక్టర్లకు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటి నుంచి నేటి వరకు 9 సంవత్సరాలు గడుస్తున్నా ఆర్టీసీలో ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో సుమారుగా 150 ఉద్యోగాలకు పైగా ఖాళీలు ఉన్నా ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలం చెందిందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.
రోడ్డున పడ్డ 46 మంది డ్రైవర్లు..
కరోనా లాక్‌డౌన్ ప్రభావంతో గోదావరిఖని ఆర్టీసీ డిపో పరిధిలో నడిచే 46 ప్రైవేట్ అద్దె బస్సుల డ్రైవర్లు రోడ్డున పడ్డారు. వారంతా కేవలం ఆర్టీసీ బస్సులకే పరిమితం కావడంతో అద్దె బస్సు డ్రైవర్ల యజమానులు ఫైనాన్సులు కట్టలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కొంతమంది సమయానికి డబ్బులు చెల్లించకపోవడంతో వారికి సంబంధించిన బస్సులను సైతం ఫైనాన్స్ నిర్వాహకులు తీసుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. దీంతో, అద్దె బస్సులపై ఆధారపడ్డ వారి జీవితాలు రోడ్డున పడ్డాయి. లాక్‌డౌన్ ప్రభావంతో పనులు లేక బస్సులు నడవక.. పూట గడవడమే కష్టంగా మారడంతో దొరికిన పని చేసుకుంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. ఏది ఏమైనా లాక్‌డౌన్ ప్రభావం ఆర్టీసీపై తీవ్రంగా చూపించిందనే చెప్పవచ్చు. దీనిపై ప్రభుత్వం ఏ విధంగా దృష్టిసారిస్తోందో వేచి చూడాల్సిందే.
- Tags
- corona virus