వారాంతం అధిక నష్టాలతో ముగిసిన సూచీలు

by Harish |   ( Updated:2021-08-20 06:03:33.0  )
వారాంతం అధిక నష్టాలతో ముగిసిన సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి. శుక్రవారం ఉదయం ప్రారంభం నుంచే నష్టపోయిన సూచీలు రోజంతా అదే ధోరణిలో కొనసాగాయి. ముఖ్యంగా అమెరికా ద్రవ్యోల్బణం అధికంగా ఉందన్న ఫెడ్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు పతనమయ్యాయి. అలాగే, ఆసియా మార్కెట్లలో కూడా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిణామాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై పడిందని నిపుణులు తెలిపారు. ముఖ్యంగా ఎఫ్ఎంసీజీ మినహాయించి అన్ని రంగాలు నష్టాలను ఎదుర్కొనగా, నష్టాలు పెరిగాయి. చివరి గంటలో ఇంట్రాడే నష్టాల నుంచి సూచీలు కోలుకున్నప్పటికీ లాభాలను సాధించలేకపోయాయి.

కీలకమైన రిలయన్స్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ టెక్ లాంటి కంపెనీల షేర్లు కుదేలవడంతో ప్రతికూల ప్రభావం అధికంగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు ఇటీవల గణనీయంగా ర్యాలీ చేస్తున్న తరుణంలో మదుపర్లు లాభాల స్వీకరణకు సిద్ధమవడం వల్ల షేర్లు దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 300.17 పాయింట్లు కోల్పోయి 55,329 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 118.35 పాయింట్లు నష్టపోయి 16,450 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాలు కుప్పకూలాయి. ప్రధానంగా మెటల్ అత్యధికంగా 6 శాతాం పతనమవగా, పీఎస్‌యూ బ్యాంక్, ఫార్మా, రియల్టీ, మీడియా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టాటా స్టీల్, ఎస్‌బీఐ, డా రెడ్డీస్, సన్‌ఫార్మా, కోటక్ బ్యాంక్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఆటో, ఎన్‌టీపీసీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.35 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed