నష్టాల నుంచి బలమైన రికవరీ సాధించిన సెన్సెక్స్

by Harish |
stock-Market
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వారాంతం నష్టాల నుంచి లాభాలకు మారి స్వల్ప ఊరటను సాధించాయి. శుక్రవారం నాటి ర్యాలీలో నష్టాల్లోకి జారిన బీఎస్ఈ సెన్సెక్స్ మిడ్-సెషన్ తర్వాత పుంజుకుని ఏకంగా 850 పాయింట్లకు పైగా కోలుకుంది. అంతర్జాతీయ మార్కెట్లు, ఆసియా మార్కెట్లలో పెట్టుబడిదారులు జాగ్రత్త వహించడంతో కీలక రంగాల్లో అమ్మకాల ఒత్తిడి పెరిగింది. ఆ ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మొదట నష్టాలను ఎదుర్కొన్నాయి. అనంతరం రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, ఇన్ఫోసిస్‌లలో కొనుగోలు మొదలవడంతో బలమైన రికవరీ నమోదు చేయగలిగాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 21.12 పాయింట్లు లాభపడి 52,344 వద్ద ముగియగా, నిఫ్టీ 8.05 పాయింట్లు నష్టపోయి 15,683 వద్ద ముగిసింది. నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడేలో కనిష్ట స్థాయి నుంచి 878 పాయింట్లతో బలమైన రికవరీ సాధించినప్పటికీ స్వల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. ఎఫ్ఎంసీజీ, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్ మాత్రమే సానుకూలంగా ర్యాలీ చేయగా మిగిలిన అన్ని రంగాలు ప్రతికూలంగా ముగిశాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హిందూస్తాన్ యూనిలీవర్, బజాజ్ ఆటో, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, పవర్‌గ్రిడ్, ఎంఅండ్ఎం, నెస్లె ఇండియా, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.91 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed