మూడోరోజు మార్కెట్ల దూకుడు.. భారీ లాభాలు

by Harish |
మూడోరోజు మార్కెట్ల దూకుడు.. భారీ లాభాలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా మూడోరోజు దూకుడును కొనసాగించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వస్తున్న మద్దతుకు తోడు దేశీయంగా కీలక షేర్ల ర్యాలీ నేపథ్యంలో సూచీలు బుధవారం భారీ లాభాలను దక్కించుకున్నాయి. ఉదయం మార్కెట్లు ప్రారంభమైన తర్వాత నిలకడగా రాణించినప్పటికీ మిడ్‌సెషన్ తర్వాత జోరును పెంచాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ మరోసారి కీలక మైలురాయి 51 వేలను అధిగమించింది. నిఫ్టీ సైతం 15 వేల మార్కును దాటింది. మదుపర్లు భారీ కొనుగోళ్లకు మద్దతివ్వడం వల్లే మార్కెట్లు అధిక లాభాలను సాధించాయని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

అదేవిధంగా ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం కూడా మార్కెట్లకు కలిసొచ్చాయని నిపుణులు భావిస్తున్నారు. ప్రధానంగా మదుపర్లు ఒపెక్ దేశాల సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశాన్ని పరిశీలిస్తున్నారని నిపుణులు భావిస్తున్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,147.76 పాయింట్లు ఎగసి 51,444 వద్ద ముగియగా, నిఫ్టీ 326.50 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ రంగం అధికంగా 3 శాతానికిపైగా ర్యాలీ చేయగా, బ్యాంక్, ఐటీ, ప్రైవేట్ బ్యాంక్, ఫైనాన్స్, రియల్టీ రంగాలు స్వల్పంగా బలపడ్డాయి. ఆటో రంగం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో మారుతీ సుజుకి, బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం షేర్లు మాత్రమే నష్టాలను నమోదు చేయగా, మిగిలిన అన్ని షేర్లు లాభాలను సాధించాయి. ముఖ్యంగా బజాజ్ ఫిన్‌సర్వ్, రిలయన్స్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంక్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.87 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed