ఇవాళ భారీగా లాభాలొచ్చాయి.. అందులో మీరున్నారా?

by Harish |
Stock Markets
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీ లాభాలను సాధించాయి. మంగళవారం ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన సమయంలో అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడాయి. అయితే, తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి కీలక షేర్ల కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లు అధిక లాభాలవైపుగా పయనించాయి.

ఇదే సమయంలో గతవారం ఎక్కువ నష్టాలతో కిందకు దిగజారిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు సిద్ధపడ్డారు. అలాగే దేశీయంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సెప్టెంబర్ త్రైమాసిక ఫలితాలపై మదుపర్లు ఆసక్తిగా ఉన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 445.56 పాయింట్లు ఎగసి 59,744 వద్ద క్లోజయింది. నిఫ్టీ 131.05 పాయింట్లు లాభపడి 17,822 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ అధికంగా 2.8 శాతం పుంజుకుంది. ఐటీ, మీడియా, ప్రైవేట్ బ్యాంక్, హెల్త్‌కేర్, ఆటో రంగాలు కొనుగోళ్లను చూశాయి. ఎఫ్ఎంసీజీ, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, ఏషియన్ పెయింట్, టీసీఎస్ షేర్లు లాభాలను సాధించగా, సన్‌ఫార్మా, పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఆల్ట్రా సిమెంట్, టాటా స్టీల్, నెస్లె ఇండియా షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.51 వద్ద ఉంది.

Advertisement

Next Story