స్టాక్ మార్కెట్ల లాభాల జోరు..

by Harish |
stock markets
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు భారీ లాభాలను సాధించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి దేశ వృద్ధి రేటు అంచనాలకు మించి 8.4 శాతంగా నమోదవడం సూచీలకు కలిసొచ్చింది. దీనికి తోడు కొవిడ్ కొత్త వేరియంట్ అంత ప్రమాదకారి కాదని ఆర్థిక నిపుణులు చెప్పడంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ బలపడింది. ఇప్పటికే ఉన్న కొవిడ్ టీకాలు దీనిపై మెరుగ్గా పనిచేస్తాయని చెప్పడంతో స్టాక్ మార్కెట్లలో జోరు పెరిగింది. అలాగే, ఈ ఏడాది నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లు అత్యధికంగా రూ. 1.31 లక్షల కోట్లుగా నమోదవడం, అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవ్వడం లాంటి పరిణామాలు స్టాక్ మార్కెట్ల భారీ లాభాలకు మద్దతిచ్చాయి.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 619.92 పాయింట్లు ఎగసి 57,684 వద్ద, నిఫ్టీ 183.70 పాయింట్లు లాభపడి 17,166 వద్ద ముగిసింది. నిఫ్టీలో పీఎస్‌యూ బ్యాంకింగ్ ఇండెక్స్ దాదాపు 3 శాతం పుంజుకోగా, బ్యాంకింగ్, ఆటో, ఫైనాన్స్, ఐటీ, మీడియా, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు 1-2 శాతానికి పైగా పెరిగాయి. ఫార్మా, హెల్త్‌కేర్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఇండస్ఇండ్ బ్యాంక్ అత్యధికంగా 5.7 శాతం బలపడింది.

యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, టెక్ మహీంద్రా, మారుతీ సుజుకి, రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఎల్అండ్‌టీ, నెస్లె ఇండియా షేర్లు మెరుగ్గా రాణించాయి. డా రెడ్డీస్, ఆల్ట్రా సిమెంట్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్ షేర్లు నష్టపోయాయి. అమెరికా డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 74.93 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed