ఎట్టకేలకు లాభాలు సాధించిన స్టాక్ మార్కెట్లు!

by Harish |
stock markets
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఎట్టకేలకు లాభాలను సాధించాయి. సోమవారం రికార్డు నష్టాల అనంతరం సూచీలు కోలుకుంటున్నాయి. మంగళవారం నాటి ట్రేడింగ్‌లో అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాలు ఉన్నప్పటికీ దేశీయంగా మెటల్, ప్రభుత్వ రంగ బ్యాంకులు, రియల్టీ రంగాల్లో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు. భారీ నష్టాల నేపథ్యంలో కనిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు సిద్ధపడటం వల్లే వరుస 4 సెషన్ల నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు బయటపడ్డాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 198.44 పాయింట్లు ఎగసి 58,664 వద్ద, నిఫ్టీ 86.80 పాయింట్లు లాభపడి 17,503 వద్ద ముగిసింది. నిఫ్టీలో మెటల్ ఇండెక్స్ అధికంగా 3 శాతం కంటే ఎక్కువ పుంజుకోగా, మీడియా, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, హెల్త్‌కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలు బలపడ్డాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్, టెక్‌మహీంద్రా, ఎస్‌బీఐ, ఎల్అండ్‌టీ, కోటక్ బ్యాంక్ షేర్లు లాభాలను చూశాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, ఏషియన్ పెయింట్, ఇన్ఫోసిస్, బజాజ్ ఆటో, మారుతీ సుజుకి షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.40 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed