50 వేల మార్కును దాటిన సెన్సెక్స్!

by Harish |
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండోరోజు భారీ లాభాలను సాధించాయి. ఉదయం ప్రారంభం నుంచే జోరుగా మొదలైన సూచీలకు అన్ని రంగాల నుంచి మద్దతు లభించడంతో స్టాక్ మార్కెట్లు దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ ఇండెక్స్ 50 వేల మైలురాయిని, నిఫ్టీ 15 వేల పాయింట్లకు పైగా ఎగిశాయి. ప్రధానంగా దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో మదుపర్ల సెంటిమెంట్ పుంజుకుంది. దీంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, దేశీయంగా కీలక కంపెనీల షేర్లు ర్యాలీ చేయడం మార్కెట్లు పుంజుకోవడానికి కారణాలుగా విశ్లేషకులు వెల్లడించారు. ముఖ్యంగా ఆటో, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో ర్యాలీతో సూచీలు అధిక లాభాలను నమోదు చేశాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 612.60 పాయింట్లు ఎగసి 50,193 వద్ద ముగియగా, నిఫ్టీ 184.95 పాయింట్లు లాభపడి 15,108 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఆటో ఇండెక్స్ 3 శాతం లాభాలను సాధించగా, మెటల్, బ్యాంకింగ్, మీడియా, ఫైనాన్స్, ప్రైవేట్ బ్యాంక్ రంగాలు బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్, పలు ఫార్మా కంపెనీలు, ఎఫ్ఎంసీజీ షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, ఐటీసీ, డా రెడ్డీస్, ఎస్‌బీఐ, హిందూస్తాన్ యూనిలీవర్ షేర్లు మాత్రమే నష్టపోగా, మిగిలిన షేర్లన్నీ లాభాల్లో కదలాడాయి. ముఖ్యంగా ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, టైటాన్, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఎల్అండ్‌టీ, పవర్‌గ్రిడ్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఓఎన్‌జీసీ, టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు అధిక లాభాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.04 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed