ఊగిసలాటలో సూచీలు

by Harish |
ఊగిసలాటలో సూచీలు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు సోమవారం ఆటుపోట్ల మధ్య స్వల్ప నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా భారీగా పెరుగుతున్న కరోనా ఆందోళనల మధ్య సూచీలు ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఉదయం ప్రారంభ సమయంలో భారీ నష్టాలను ఎదుర్కొన్న తర్వాత మిడ్-సెషన్‌లో కోలుకుని లాభాల్లో ట్రేడయ్యాయి. అనంతరం ఆటుపోట్లకు గురై సెన్సెక్స్ స్వల్ప నష్టాలకు, నిఫ్టీ స్వల్ప లాభాలకు పరిమితమయ్యాయి. మిడ్-సెషన్ సమయంలో లాభాల బాట పట్టిన మార్కెట్లు చివర్లో కొనుగోళ్లు పెరగడంతో నష్టాల్లో ట్రేడయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాల్లో ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి కనబడింది.

కరోనా కారణంగా మళ్లీ లాక్‌డౌన్ ఉంటుందనే భయం మదుపర్లలో ఉందని, ఇప్పటికీ కొనసాగుతున్న ఆంక్షలతో ఆర్థికవ్యవస్థ రికవరీ ఆలస్యమవుతుందనే సంకేతాలతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతిన్నదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీనికితోడు కీలక రంగాల్లో కొనుగోళ్లు పెరగడం మార్కెట్లు డీలాపడటానికి కారణమని పేర్కొన్నారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 63.84 పాయింట్లు తగ్గి 48,718 వద్ద ముగియగా, నిఫ్టీ 3.05 పాయింట్లు లాభపడి 14,634 వద్ద ముగిసింది. నిఫ్టీలో ప్రైవేట్ బ్యాంక్, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ, మీడియా రంగాలు డీలాపడ్డాయి. మెటల్ 2 శాతానికి పైగా బలహీనపడగా, ఎఫ్ఎంసీజీ, ఆటో, ఫార్మా రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో భారతీ ఎయిర్‌టెల్, హిందూస్తాన్ యూనిలీవర్, మారుతీ సుజుకి, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్, ఎన్‌టీపీసీ, నెస్లె ఇండియా, ఆల్ట్రా సిమెంట్ షేర్లు లాభాలను దక్కించుకోగా, టైటాన్, ఇండస్ఇండ్ బ్యాంక్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.86 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed