స్వల్ప లాభాలతో సరిపెట్టిన సూచీలు!

by Harish |
స్వల్ప లాభాలతో సరిపెట్టిన సూచీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ వారం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. సోమవారం ఉదయం అధిక లాభాలతోనే ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ మిడ్-సెషన్ సమయానికి నీరసించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మొదట లాభాలు సాధించినప్పటికీ తరువాత కొద్దిసేపటికే నష్టాలు ఎదురయ్యాయి. చివరి వరకు ఊగిసలాడిన సూచీలు చివరి గంటలో మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపించడంతో స్వల్ప లాభాలతో సరిపెట్టాయని విశ్లేషకులు తెలిపారు.

బెంచ్‌మార్క్ సూచీలు ఉదయం మెరుగైన ర్యాలీని కొనసాగిస్తున్న సమయంలో ఒక్కసారిగా పెట్టుబడిదారులు లాభాల స్వీకరణకు దిగారు. ఈ కారణంగానే మిడ్-సెషన్ నుంచి స్టాక్ మార్కెట్లు తగ్గాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 32.02 పాయింట్లు లాభపడి 60,718 వద్ద, నిఫ్టీ 6.70 పాయింట్ల లాభంతో 18,109 వద్ద ముగిసింది. నిఫ్టీలో హెల్త్‌కేర్ ఇండెక్స్ 2 శాతానికి పైగా పుంజుకోగా, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, ఐటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు బలపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్, మెటల్, మీడియా, బ్యాంకింగ్, ఆటో రంగాలు దెబ్బతిన్నాయి.

సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఐటీసీ, ఏషియన్ పెయింట్, నెస్లె ఇండియా, కోటక్ బ్యాంక్, టీసీఎస్, హిందూస్తాన్ యూనిలీవర్, డా రెడ్డీస్ షేర్లు లాభాలను సాధించాయి. టాటా స్టీల్, ఎంఅండ్ఎం, బజాజ్ ఆటో, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎల్అండ్‌టీ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.46 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed