తీవ్ర ఒడిదుడుకులతో స్వల్ప నష్టాల్లో మార్కెట్లు

by Harish |
తీవ్ర ఒడిదుడుకులతో స్వల్ప నష్టాల్లో మార్కెట్లు
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల మధ్య మంగళవారం స్వల్ప నష్టాలను నమోదు చేశాయి. ఉదయం ప్రారంభమైన సమయంలో లాభాలో జోరు పెంచిన సూచీలు మిడ్-సెషన్ అనంతరం ఆటుపోట్లకు గురయ్యాయి. ముఖ్యంగా బ్యాంకింగ్, మెటల్, ఫైనాన్స్ రంగాల్లో అమ్మకాల ధోరణి పెరగడంతో చివరికి స్వల్ప నష్టాలు తప్పలేదు. అమెరికా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు లాభాలను దక్కించుకోగలిగాయి. అయితే, దేశీయంగా గరిష్ఠ స్థాయిల వద్ద కీలక రంగాల షేర్లు నష్టాలను చూడటంతో స్టాక్ మార్కెట్లను దెబ్బతీశాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ‘

ఉదయం సమయంలో సోమవారం నాటి దేశ ఎగుమతులు వరుసగా మూడో నెలా పెరిగాయనే సంకేతాలతో ర్యాలీ చేశాయి. అలాగే, అమెరికా ఆర్థిక ఉద్దీపన, ఆసియా మార్కెట్లలో బాండ్ ఈల్డ్స్ సడలింపు, యూఎస్ ఫెడ్ సమావేశం నేపథ్యంలో మార్కెట్లు సానుకూలంగానే కదలాడాయి. అయితే, చివరి గంటలో కీలక సూచీల కారణంగా నష్టాల్లోకి మారాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 31.12 పాయింట్లను నష్టపోయి 50,363 వద్ద, నిఫ్టీ 19.05 పాయింట్ల నష్టంతో 14,910 వద్ద ముగిశాయి.

నిఫ్టీలో బ్యాంకింగ్ రంగం ప్రధానంగా నష్టాలకు దారితీసింది. ప్రైవేట్ బ్యాంక్, మెటల్, రియల్టీ రంగాలు కూడా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ రంగాలు పుంజుకున్నాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో ఏషియన్ పెయింట్స్, డా.రెడ్డీస్, హిందూస్తాన్ యూనిలీవర్, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఆల్ట్రా సిమెంట్ షేర్లు లాభాలను దక్కించుకోగా, ఎల్అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 72.51 వద్ద ఉంది.

Advertisement

Next Story