సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిసిన స్టాక్ మార్కెట్లు

by Harish |   ( Updated:2021-07-15 11:11:23.0  )
Sensex
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ ఈక్విటీ మార్కెట్లు మరోసారి సరికొత్త రికార్డు గరిష్ఠాల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలకు తోడు ఐటీ రంగంలో కొనుగోళ్ల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో సూచీలు రికార్డు స్థాయిలను తాకాయి. వరుసగా మూడు రోజులు లాభాల బాట పట్టిన స్టాక్ మార్కెట్లు కొత్త జీవితకాల గరిష్ఠాలతో బీఎస్ఈ సెన్సెక్స్ 53 వేల మార్కు పైన, ఎన్ఎస్ఈ నిఫ్టీ 15,900 మార్కుపైకి చేరుకున్నాయి. ఓ దశలో సెన్సెక్స్ 362 పాయింట్ల మేర పెరిగి 53,266 గరిష్ఠ స్థాయిలను తాకింది. అనంతరం కొంత వెనకబడ్డాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కార్పొరేట్ కంపెనీలు మెరుగైన ఆదాయాలను వెల్లడిస్తుండటంతో ఐటీ షేర్లు ర్యాలీ చేస్తున్నాయని, ఈ కారణంగానే మార్కెట్లు గురువారం ట్రేడింగ్‌లో ఆల్‌టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయని నిపుణులు వివరించారు.

దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 254.80 పాయింట్లు ఎగిసి 53,158 వద్ద క్లోజవ్వగా, నిఫ్టీ 70.25 పాయింట్లు లాభపడి 15,924 వద్ద ముగిసింది. నిఫ్టీలో ఐటీ ఇండెక్స్ అధికంగా 1 శాతానికి పైగా పుంజుకుని రికార్డు స్థాయిలో ట్రేడయింది. బ్యాంకింగ్, ఫైనాన్స్, మెటల్, ప్రైవేట్ బ్యాంక్, రియల్టీ రంగాలు బలపడ్డాయి. ఆటో, పీఎస్‌యూ బ్యాంక్ రంగాలు నీరసించాయి. సెన్సెక్స్ ఇండెక్స్‌లో హెచ్‌సీఎల్ టెక్ అత్యధికంగా 5.10 శాతం దూసుకెళ్లగా, ఎల్అండ్‌టీ, టెక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆల్ట్రా సిమెంట్, ఐటీసీ షేర్లు అధికంగా లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్, ఎంఅండ్ఎం, ఏషియన్ పెయింట్, టైటాన్, సన్‌ఫార్మా, బజాజ్ ఆటో, టీసీఎస్ షేర్లు నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.51 వద్ద ఉంది.

Advertisement

Next Story

Most Viewed